- 'పరీక్షా పే చర్చ'లో విద్యార్థులకు దిశానిర్దేశం
- సాంకేతికతను ఆయుధంగా మార్చుకోవాలని పిలుపు
పరీక్షలంటే భయం, ఒత్తిడిని అధిగమించి వాటిని ఒక పండుగలా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే 'పరీక్షా పే చర్చ' 9వ ఎడిషన్ రెండవ వీడియో ఎపిసోడ్ విడుదలయింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని, పరీక్షల సమయంలో ఎదురయ్యే ఆందోళనలను ఎలా అధిగమించాలో విలువైన సలహాలు ఇచ్చారు. చిన్న చిన్న స్టార్టప్‌లతో తమ పారిశ్రామిక ప్రయాణాన్ని ప్రారంభించాలని విద్యార్థులను ప్రోత్సహించిన ఆయన, పెద్ద ఆలోచనలు చిన్నపాటి ప్రారంభాల నుంచే వస్తాయని పేర్కొన్నారు. అలాగే, పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పరిజ్ఞానం కోసం ఇండస్ట్రీ నిపుణులను సంప్రదించాలని సూచించారు. చదువు , తమకు నచ్చిన రంగాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడంపై మాట్లాడుతూ, కళలు, సృజనాత్మక అలవాట్లు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని, వాటిని చదువుకు అడ్డుగా భావించకూడదని మోడీ స్పష్టం చేశారు.
శిక్షణ , క్రమశిక్షణ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన ప్రధాని, రోడ్లపై ఉమ్మివేయకపోవడం, చెత్త వేయకపోవడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, ఆహారాన్ని వృథా చేయకపోవడం వంటి ప్రాథమిక పౌర బాధ్యతలను విద్యార్థులు పాటించాలని కోరారు. ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. 'వోకల్ ఫర్ లోకల్', 'వెడ్ ఇన్ ఇండియా' వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, భారతీయ ఉత్పత్తులను ఎంచుకోవడం, వివాహాలను దేశంలోనే జరుపుకోవడం దేశ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తుందని, ఇవి 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడతాయని ప్రధాని వివరించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) , సాంకేతికతను చూసి భయపడాల్సిన అవసరం లేదని, వాటిపై ఆధారపడకుండా వివేకంతో, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సాంకేతికత ఒక శక్తివంతమైన గురువు అని, దాన్ని అభ్యసన, ఆవిష్కరణ ,వృద్ధికి ఒక సాధనంగా మార్చుకోవాలని ఆయన ఉద్బోధించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని విద్యార్థులతో జరిగిన ఈ కార్యక్రమంలో 4.5 కోట్లకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
No comments:
Post a Comment