Wednesday, 25 February 2026

చిన్న పిల్లలకు న్యాయవ్యవస్థపై విషం నూరిపోస్తారా?

  • ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు సుమోటో కేసు
  • సీజేఐ తీవ్ర ఆగ్రహం!

న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే అంశాన్ని చేర్చడంపై భారత అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించిన సుప్రీంకోర్టు, దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్ బ్యాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరుపుతూ.. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సాగుతున్న ఇటువంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది. ఎనిమిదో తరగతి చదివే పసిపిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధించడం వెనుక ఒక లోతైన కుట్ర దాగి ఉన్నట్లు కనిపిస్తున్నదని సీజేఐ అనుమానం వ్యక్తం చేశారు.



సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువస్తూ.. దేశ భవిష్యత్తు అయిన చిన్నారులకు న్యాయవ్యవస్థ పట్ల తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా పాఠాలు ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. "ఈ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థకు అధిపతిగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను, ఇప్పటికే ఈ అంశంపై సుమోటోగా కేసు నమోదు చేశాను. న్యాయవ్యవస్థను కించపరచడానికి ఈ భూమిపై ఎవరినీ అనుమతించను. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని గంభీరంగా హెచ్చరించారు. ఈ పాఠ్యాంశం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు సైతం తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన తెలిపారు.


పాఠ్యపుస్తకంలోని సదరు అధ్యాయంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరిస్తూ.. కేసుల జాప్యం, న్యాయమూర్తుల కొరతతో పాటు 'అవినీతి'ని కూడా ఒక ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బ్యాగ్చీ స్పందిస్తూ.. ఈ తరహా పాఠ్యాంశాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కేవలం న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి పాఠాలు చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశాలను త్వరలోనే బయటపెడతామని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో ఎన్‌సీఈఆర్‌టీ నుంచి వివరణ కోరనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment

Featured post

భారత ప్రధానికి ఇజ్రాయెల్ అత్యున్నత గౌరవం

మోడీకి 'స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్' ప్రదానం ఈ పురస్కారం అందుకున్న తొలి ప్రపంచ నేత జెరూసలేం: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయ...