- మలేషియా ప్రధానితో చర్చల్లో ప్రధాని మోడీ కఠిన హెచ్చరిక
కౌలాలంపూర్: ఉగ్రవాదం విషయంలో భారతదేశం తన కఠినమైన వైఖరిని పునరుద్ఘాటించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించేది లేదని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మలేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కౌలాలంపూర్లో జరిగిన విస్తృతస్థాయి చర్చల్లో మోడీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
- ఆర్థిక , సాంకేతిక సహకారం
రక్షణ, భద్రతా సంబంధాలను పెంపొందించడం, సముద్ర భద్రత లో సహకారాన్ని విస్తరించడంపై ఇరువురు నేతలు చర్చించారు. సెమీకండక్టర్ అభివృద్ధి, డిజిటల్ ఆర్థికవ్యవస్థ, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీరంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. విపత్తు నిర్వహణ, ఆడియోవిజువల్ కో-ప్రొడక్షన్, అవినీతి నిరోధం, డిజిటల్ చెల్లింపుల వంటి పలు రంగాలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మలేషియాలో అకడమిక్ పరిశోధన, అధ్యయనాలను ప్రోత్సహించడానికి తిరువళ్ళువర్ కేంద్రంను ఏర్పాటు చేయనున్నట్లు భారత్ ప్రకటించింది.
- ఆసియాన్ బంధం
ప్రధాని మోడీ ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమై, సెమీకండక్టర్ పరిశ్రమలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఆసియాన్ చైర్మన్‌షిప్ తీసుకున్నందుకు మలేషియాకు అభినందనలు తెలిపిన మోడీ, ఆసియాన్-ఇండియా వస్తు వాణిజ్య ఒప్పందం సమీక్షను త్వరగా పూర్తి చేయడానికి అంగీకరించారు. ఇరు దేశాలు సముద్ర పొరుగుదేశాలుగా బలమైన బంధాన్ని కలిగి ఉన్నాయని, మలేషియాలో ఉన్న పెద్ద భారతీయ డయాస్పోరా దీనికి పునాదని ఆయన అన్నారు. సహకారానికి సెమీకండక్టర్లు కీలకమైన రంగమని పేర్కొన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఈస్ట్) కార్యదర్శి పి. కుమారన్, ఈ పర్యటనలో ఉగ్రవాద వ్యతిరేక సహకారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
No comments:
Post a Comment