Monday, 16 February 2026

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు


  • హత్య కాదు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారణ
  • సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం

 రెండు దశాబ్దాల కిందట తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన యువ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నటి ప్రత్యూష మరణం హత్య కాదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న సిద్ధార్థ్ రెడ్డికి విధించిన శిక్షను ఖరారు చేసింది. మరోవైపు నటి ప్రత్యూష తల్లి సరోజినీ దేవి హత్య జరిగినట్లుగా ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం  కొట్టివేసింది.  దర్యాప్తు సంస్థలు సేకరించిన సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలు ప్రత్యూష మరణం విషప్రయోగం వల్లే సంభవించిందని స్పష్టంగా నిరూపిస్తున్నాయని కోర్టు పేర్కొంది. గొంతు నులిమి చంపారనే ఆరోపణలను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది.



ప్రత్యూష , సిద్ధార్థ్ రెడ్డిలు ప్రేమించుకున్నారు.  అయితే వారి ప్రేమను సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని విషం తీసుకున్నారు.  అందులో సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడని కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆత్మహత్యాయత్నం కేసుల్లో సిద్ధార్థ్ రెడ్డికి  హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. నిందితుడిపై అత్యాచారం ఆరోపణలను కూడా కోర్టు కొట్టివేసింది. ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం వల్లనే ఆత్మహత్య జరిగిందని, ఆత్మహత్య ఒప్పందంలో ప్రాణాలతో బయటపడిన భాగస్వామి చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తనపై ఉన్న నేరారోపణను సవాలు చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, నాలుగు వారాల్లోగా కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...