Monday, 2 February 2026

కేంద్ర బడ్జెట్‌ 2026-27 ముఖ్యాంశాలు

 

కేంద్ర బడ్జెట్‌ 2026-27 ముఖ్యాంశాలు



పార్ట్‌-ఎ

కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ 2026-27 ముఖ్యాంశాలు:

కర్తవ్య భవన్‌లో మూడు ప్రధాన కర్తవ్యాలు స్ఫూర్తిగా ఈ తొలి బడ్జెట్ రూపొందింది:

· తొలి కర్తవ్యం... సుస్థిర ఆర్థిక వృద్ధిని మరింత వేగిరపరచడం. ఇందుకోసం ఉత్పాదకత, పోటీతత్వం పెంపు, అనిశ్చిత ప్రపంచ గమనాన్ని తట్టుకోగల పునరుత్థాన సామర్థ్యం పెంచుకోవాలన్నది లక్ష్యం.

· రెండో కర్తవ్యం... ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా వారి సామర్థ్యాన్ని పెంపొందించి, భారత సౌభాగ్య ప్రస్థానంలో వారిని శక్తమంతమైన భాగస్వాములుగా రూపుదిద్దదడం.

· మూడో కర్తవ్యం... సమష్టి కృషితో సామూహిక ప్రగతి (సబ్‌కా సాథ్‌-సబ్‌కా వికాస్) దృక్కోణం మేరకు ప్రతి ప్రాంతం, రంగం, సమాజం, కుటుంబం నుంచి అర్థవంతమైన భాగస్వామ్యం లక్ష్యంగా వనరులు, సౌకర్యాలు, అవకాశాల కల్పన.

బడ్జెట్ అంచనాలు

· రుణేతర రాబడులు ₹36.5 లక్షల కోట్లు, మొత్తం వ్యయం ₹53.5 లక్షల కోట్లు, కేంద్ర ప్రభుత్వ నికర పన్ను రాబడులు ₹28.7 లక్షల కోట్లు.

· స్థూల మార్కెట్ రుణ సమీకరణ ₹17.2 లక్షల కోట్లు, కాలపరిమితి నిర్దేశిత సెక్యూరిటీల ద్వారా నికర మార్కెట్ రుణ సమీకరణ ₹11.7 లక్షల కోట్లు.

o రుణేతర రాబడుల సవరించిన అంచనాలు ₹34 లక్షల కోట్లు.. ఇందులో కేంద్ర నికర పన్ను రాబడులు ₹26.7 లక్షల కోట్లు.

o మొత్తం వ్యయం సవరించిన అంచనా ₹49.6 లక్షల కోట్లు... ఇందులో మూలధన వ్యయం సుమారు ₹11 లక్షల కోట్లు.

· ప్రస్తుత బడ్జెట్ (2026-27) అంచనాలలో ద్రవ్య లోటు జీడీపీలో 4.3 శాతం.

· సవరించిన (2025-26) అంచనాలలో ద్రవ్య లోటు అదే బడ్జెట్ అంచనాలకు సమానంగా జీడీపీలో 4.4 శాతం.

· సవరించిన (2025-26) అంచనాల మేరకు జీడీపీలో 56.1 శాతంతో పోలిస్తే, 2026-27 బడ్జెట్ అంచనాలలో రుణ-జీడీపీ నిష్పత్తి జీడీపీలో 55.6 శాతం.

తొలి కర్తవ్యమైన ఆర్థిక వృద్ధి వేగం పెంపు-కొనసాగింపు దిశగా 6 కీలకాంశాల ప్రతిపాదన

1. దేశంలోని 7 వ్యూహాత్మక, కీలక రంగాల్లో తయారీ కార్యకలాపాల పెంపు

                               i. బయోఫార్మా శక్తి (విజ్ఞాన-సాంకేతిక-ఆవిష్కరణ రంగాల ద్వారా ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి వ్యూహం) ప్రకటన. రాబోయే ఐదేళ్లలో ₹10,000 కోట్లతో భారత్‌ను ప్రపంచ బయోఫార్మా తయారీ కూడలిగా రూపొందించడం దీని లక్ష్యం.

ఎ. దేశంలో 3 కొత్త నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎన్‌ఐపీఈఆర్‌) సంస్థలతో బయోఫార్మా-కేంద్రక నెట్‌వర్క్‌ సృష్టి, ఇప్పటికేగల 7 సంస్థల ఉన్నతీకరణ.

బి. 1000కి పైగా గుర్తింపుగల ఇండియా క్లినికల్ ట్రయల్స్ సైట్‌ల నెట్‌వర్క్‌ సృష్టి

                             ii. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం) 2.0 ప్రారంభం. నిపుణ కార్మికశక్తిని తీర్చిదిద్దడం, పరికరాలు-సామగ్రి ఉత్పాదన, పూర్తిస్థాయి శ్టాక్‌ ఇండియన్ ఐపీ రూపకల్పన, సరఫరా వ్యవస్థల బలోపేతం దీని లక్ష్యాలు.

                          iii. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ పథకం వ్యయ అంచనా ₹40,000 కోట్లకు పెంపు.

                           iv. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాలకు మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాల పరంగా ప్రోత్సాహం, మద్దతు దిశగా ప్రత్యేక కీలక ఖనిజ కారిడార్‌ల నిర్మాణం.

iv. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాలకు మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాల పరంగా ప్రోత్సాహం, మద్దతు దిశగా ప్రత్యేక కీలక ఖనిజ కారిడార్‌ల నిర్మాణం.

                             v. సాముదాయక ప్రాతిపదికగల స్థాపన సంసిద్ధ నమూనాతో పోటీతత్వ విధానంలో 3 ప్రత్యేక కెమికల్ పార్కుల ఏర్పాటుపై రాష్ట్రాలకు మద్దతు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభిస్తుంది.

                          vi. మూలధన సామగ్రి సామర్థ్య బలోపేతం

· కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలోని 2 ప్రదేశాల్లో హై-టెక్‌ టూల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి. ఇవి స్థానికంగా గణనీయ స్థాయిలో, చౌకగా అత్యంత-సునిశిత విడిభాగాలను రూపొందించే, పరీక్షించే, తయారు చేసే డిజిటల్‌ సాంకేతిక సేవా సంస్థలుగా ఉండాలి.

· హెచ్చుమూల్యంగల అధునాతన సాంకేతికత ఆధారిత నిర్మాణ-మౌలిక సదుపాయాల యంత్రసామగ్రి (సీఐఈ) దేశీయ తయారీని బలోపేతం చేయడానికి ఒక పథకం అమలులోకి వస్తుంది.

· ఐదేళ్లలో ₹10,000 కోట్ల అంచనా వ్యయంతో కంటెయినర్ల తయారీ పథకాన్ని అమలు చేస్తారు. అంతర్జాతీయ పోటీతత్వంతో కూడిన కంటెయినర్ల తయారీ వ్యవస్థ ఏర్పాటు దీని లక్ష్యం.  

                        vii. జౌళి రంగం కోసం సమీకృత కార్యక్రమం ప్రకటన

ఎ. పట్టు, ఉన్ని, జనుము, మానవ నిర్మిత-నవశక ఫైబర్‌లు వంటి సహజ ఫైబర్‌ల రంగంలో స్వావలంబన దిశగా జాతీయ ఫైబర్ పథకం.

బి. జౌళిరంగ విస్తరణ-ఉపాధి పథకం... యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నతీకరణ సహా సార్వత్రిక పరీక్ష-ధ్రువీకరణ కేంద్రాలకు మూలధన మద్దతుతో సంప్రదాయ సముదాయాల ఆధునికీకరణ దీని లక్ష్యం.

· సాంకేతిక వస్త్రాలకు విలువ జోడింపుపై దృష్టి సారిస్తూ పోటీతత్వ విధానంలో మెగా టెక్స్‌ టైల్ పార్కుల ఏర్పాటు.

· ఖాదీ, చేనేత, హస్తకళల బలోపేతానికి మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ కార్యక్రమం ప్రకటన.

ఎ. ప్రపంచ మార్కెట్ లింకేజీ, బ్రాండింగ్‌లో తోడ్పాటు దిశగా శిక్షణ-నైపుణ్యం, ప్రక్రియలు-ఉత్పాదకత నాణ్యత క్రమబద్ధీకరణలకు మద్దతునిచ్చే కార్యక్రమం.

2. వారసత్వ పారిశ్రామిక రంగాల పునరుజ్జీవనం

· మౌలిక సదుపాయాలు-సాంకేతిక పరిజ్ఞాన ఉన్నతీకరణ ద్వారా వ్యయ నియంత్రణలో పోటీతత్వం, సామర్థ్యం మెరుగు లక్ష్యంగా 200 వారసత్వ పారిశ్రామిక సముదాయాల పునరుద్ధరణకు ప్రత్యేక పథకం.

3. “ఛాంపియన్‌ ఎస్‌ఎంఈ”ల సృష్టి - సూక్ష్మ సంస్థలకు మద్దతు

· భవిష్యత్ “ఛాంపియన్‌ పరిశ్రమల” సృష్టి లక్ష్యంగా నిర్దిష్ట ప్రమాణాల ప్రాతిపదికన వివిధ సంస్థలను ప్రోత్సహించేందుకు ₹10,000 కోట్లతో ‘ప్రత్యేక ‘ఎస్‌ఎంఈ' వృద్ధి నిధి’కి శ్రీకారం.

· సూక్ష్మ సంస్థలకు చేయూత కొనసాగింపు, మూలధన ముప్పు నిర్వహణ కోసం అదనంగా ₹2,000 కోట్లతో ‘స్వయం సమృద్ధ భారత్‌ నిధి.’

· దేశంలో... ప్రత్యేకించి 2, 3 అంచెల పట్టణాల్లో ‘కార్పొరేట్ మిత్ర’ కార్యకర్తలను తీర్చిదిద్దడం కోసం స్వల్పకాలిక, మాడ్యులర్ కోర్సులు, ఆచరణాత్మక ఉపకరణాల రూపకల్పన దిశగా “ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ, ఐసీఎంఏఐ” వంటి వృత్తివిద్య సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం.

4. మౌలిక సదుపాయాలకు బలమైన ప్రోత్సాహం

· ప్రస్తుత (2026-27) ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం ₹12.2 లక్షల కోట్లకు పెంపు.

· మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ దశలో నష్టభయం నివారణ దిశగా ప్రైవేట్ డెవలపర్లలో విశ్వాసం నింపేందుకు మౌలిక సదుపాయాల ముప్పు నివారణ హామీ నిధి ఏర్పాటు.

· ప్రత్యేక ‘ఆర్‌ఈఐటీ’ల ఏర్పాటు ద్వారా ‘సీపీఎస్‌ఈ’ల కీలక స్థిరాస్తుల రీసైక్లింగ్‌ను ప్రభుత్వం వేగిరపరుస్తుంది.

· పర్యావరణపరంగా సుస్థిర వస్తు రవాణాను ప్రోత్సహించేందుకు ప్రతిపాదించిన చర్యలిలా ఉన్నాయి:

ఎ. తూర్పున డంకుణీ-పశ్చిమాన సూరత్‌ నగరాలను జోడిస్తూ కొత్త ప్రత్యేక రవాణా కారిడార్ల నిర్మాణం.

బి. రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఒడిశాలోని కొత్త జలమార్గం-5 నుంచి తాల్చేర్- అంగుళ్‌లోని ఖనిజ సంపన్న ప్రాంతాలను, కళింగ నగర్ వంటి పారిశ్రామిక కేంద్రాలను పరదీప్ సహా ధమ్రా ఓడరేవులతో ఇవి అనుసంధానిస్తాయి.

o మానవశక్తి అవసరాలు తీర్చే దిశగా ప్రాంతీయ కేంద్రాలుగా శిక్షణ సంస్థల ఏర్పాటు.

o అలాగే, వారణాసి, పాట్నా నగరాల పరిధిలో లోతట్టు జలమార్గాలకు అనుగుణంగా ఓడల మరమ్మతు వ్యవస్థ ఏర్పాటు.

సి. దేశంలో 2047 నాటికి లోతట్టు జలమార్గాలు, తీరప్రాంత షిప్పింగ్ వాటాను 6 శాతం నుంచి 12 శాతానికి పెంచడంతోపాటు రైలు-రోడ్డు మార్గాల నుంచి మార్పు దిశగా తీరప్రాంత రవాణా ప్రోత్సాహక పథకం ప్రారంభం.

· సీప్లేన్‌ల తయారీ దేశీయీకరణ సహా చివరి అంచెతోపాటు సుదూర ప్రాంతాల అనుసంధానం మెరుగు, పర్యాటకానికి చేయూత దిశగా ప్రోత్సాహకాలు మంజూరు.

ఎ. ఈ కార్యకలాపాలకు చేయూతనిచ్చేలా ‘సీప్లేన్ వీజీఎఫ్‌ పథకం’ ప్రవేశపెడతారు.

5. దీర్ఘకాలిక ఇంధన భద్రత-సుస్థిరతకు భరోసా

· కర్బన సంగ్రహణ-వినియోగం-నిల్వ (సీసీయూఎస్‌) సాంకేతికతల కోసం రాబోయే ఐదేళ్లలో ₹20,000 కోట్లు కేటాయింపు.

6. నగర ఆర్థిక ఆర్థిక మండళ్ల ఏర్పాటు

· సంస్కరణలు-ఫలితాల ఆధా రిత ఆర్థిక సహాయ యంత్రాంగంతో పోటీతత్వ విధానంలో ప్రణాళికలు అమలు చేసేలా నగర ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు రాబోయే ఐదేళ్లలో ₹5000 కోట్లు కేటాయింపు.

· పర్యావరణపరంగా సుస్థిర ప్రయాణిక వ్యవస్థలను ప్రోత్సహిస్తూ నగరాల మధ్య ‘వృద్ధి సంధాన కర్త’లుగా కింది విధంగా 7 హై-స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణం:

     i. ముంబై-పుణే

    ii. పుణే-హైదరాబాద్,

   iii. హైదరాబాద్-బెంగళూరు,

  iv. హైదరాబాద్-చెన్నై

    v. చెన్నై-బెంగళూరు,

  vi. ఢిల్లీ-వారణాసి,

 vii. వారణాసి-సిలిగురి.

· “వికసిత భారత్ కోసం బ్యాంకింగ్‌పై ఉన్నత స్థాయి కమిటీ”ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆర్థిక స్థిరత్వం, సార్వజనీనత, వినియోగదారులకు రక్షణలో భాగంగా ఈ రంగాన్ని సమగ్రంగా సమీక్షించి దేశ తదుపరి దశ వృద్ధికి అనుగుణంగా మార్చాలన్నది దీని లక్ష్యం.

· ప్రభుత్వ రంగ ‘ఎన్‌బీఎఫ్‌సీ'లలో స్థాయిని సాధించడం, సామర్థ్యం మెరుగుదల దిశగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ల పునర్వ్యవస్థీకరణ.

· దేశ భవిష్యత్‌ ఆర్థిక ప్రాథమ్యాలకు అనుగుణంగా విదేశీ పెట్టుబడుల కోసం మరింత సమకాలీన, వినియోగదారు హిత చట్రం రూపకల్పన లక్ష్యంగా విదేశీ మారక నిర్వహణ (రుణేతర-పత్రాల) నిబంధనలపై సమగ్ర సమీక్షకు ప్రతిపాదన.

పురపాలక బాండ్లు

· పెద్ద నగరాల ద్వారా అధిక విలువ గల మునిసిపల్ బాండ్ల జారీని ప్రోత్సహించే లక్ష్యంతో ₹1000 కోట్లకు పైగా విలువైన ఒకే దఫా బాండ్ల జారీపై ₹100 కోట్ల ప్రోత్సాహకం ప్రకటన.

రెండో కర్తవ్యం.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం-సామర్థ్యం పెంచడం

· వికసిత భారత్‌కు ప్రధాన చోదక శక్తిగా సేవల రంగంపై దృష్టి సారించే చర్యలను సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయిలో ‘విద్య నుంచి ఉపాధి... వ్యవస్థాపన’ స్థాయీ సంఘం ఏర్పాటు.

వికసిత భారత్‌ కోసం వృత్తి నిపుణుల సృష్టి

· ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల్లో అనుబంధ ఆరోగ్య నిపుణుల (ఏహెచ్‌పీ) కోసం ఇప్పటికేగల సంస్థల ఉన్నతీకరణ, కొత్త ‘ఏహెచ్‌పీ’ సంస్థల ఏర్పాటు.

ఎ. రాబోయే ఐదేళ్లలో 1,00,000 మంది అనుబంధ ఆరోగ్య నిపుణులు అందుబాటులోకి వస్తారు.

· దేశాన్ని వైద్య పర్యాటక సేవల కూడలిగా రూపొందించేందుకు 5 ప్రాంతీయ వైద్య కేంద్రాల ఏర్పాటు.

ఆయుష్‌

· దేశంలో 3 కొత్త అఖిలభారత ఆయుర్వేద సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదన

పశుసంవర్ధకం

· పశుపోషకులకు 20,000 మందికిపైగా పశువైద్య నిపుణులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.

ఎ. ప్రైవేట్ రంగంలో పశువైద్య, పారా పశువైద్య కళాశాలలు-ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ప్రయోగశాలలు, బ్రీడింగ్ సౌకర్యాల స్థాపన కోసం రుణ సంబంధిత మూలధన సబ్సిడీ మద్దతు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.

సృజనార్థిక వ్యవస్థ

· దేశవ్యాప్తంగాగల 15,000 మాధ్యమిక పాఠశాలలు, 500 కళాశాలలలో విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) కంటెంట్ క్రియేటర్ లేబొరేటరీల ఏర్పాటులో ముంబైలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్’ మద్దతిస్తుంది.

విద్య

· ప్రధాన పారిశ్రామిక, రవాణా కారిడార్ల సమీపాన పోటీతత్వ విధానంలో 5 విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌ల ఏర్పాటు.

ఎ. వీజీఎఫ్‌, మూలధన మద్దతు ద్వారా ప్రతి జిల్లాలో 1 బాలికల హాస్టల్ ఏర్పాటు.

పర్యాటకం

· ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ’- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీగా ఉన్నతీకరణ

ఎ. హైబ్రిడ్ విధానంలో ప్రామాణిక, అధిక నాణ్యతగల 12 వారాల శిక్షణ కోర్సుతో 20 పర్యాటక ప్రదేశాల్లో 10,000 మంది గైడ్‌ల నైపుణ్యాభివృద్ధికి ‘ఐఐఎం’ సహకారంతో ప్రయోగాత్మక పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

బి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వం పరమైన అన్ని కీలక ప్రదేశాల డిజిటలీకృత డాక్యుమెంటేషన్‌ కోసం 'నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్’ ఏర్పాటు.

వారసత్వ... సాంస్కృతిక పర్యాటకం

· లోథాల్, ధోలావీరా, రాఖీగఢీ, ఆదిచనల్లూర్, సారనాథ్, హస్తినాపూర్, లేహ్ ప్యాలెస్‌తో సహా 15 ప్రాచీన ప్రాంతాలు ఉత్తేజభరిత, అనుభవపూర్వక సాంస్కృతిక ప్రదేశాలుగా అభివృద్ధి.

క్రీడలు

· క్రీడా రంగం పరిణామశీల మార్పుల దిశగా రాబోయే దశాబ్దంలో ‘ఖేలో ఇండియా మిషన్’ ప్రారంభమవుతుంది.

మూడో కర్తవ్యం... ‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ దృక్కోణానికి అనుగుణంగా కింది 4 రంగాల్లో లక్ష్యనిర్దేశిత కృషి అవసరం:

1. రైతుల ఆదాయం పెంపు

· కింద పేర్కొన్న అంశాల్లో కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఎ. దేశవ్యాప్తంగా 500 జలాశయాలు, అమృత సరోవరాల సమీకృత అభివృద్ధి.

అధిక మూల్య వ్యవసాయం

· కింద పేర్కొన్న అధిక మూల్య పంటల సాగుకు ప్రభుత్వ మద్దతు:

ఎ. తీర ప్రాంతాల్లో కొబ్బరి, కోకో, జీడిమామిడి, గంధపు తోటల పెంపకం

బి. కొబ్బరి ఉత్పత్తి, దిగుబడి పెంపు దిశగా కొబ్బరి ప్రోత్సాహక పథకం

భారత్‌-విస్తార్‌ (వ్యవసాయ వనరుల సౌలభ్యం కోసం ఏకీకృత సాదృశ వ్యవస్థ)

· అగ్రిశ్టాక్ పోర్టళ్లను, వ్యవసాయ పద్ధతులపై ‘ఐసీఏఆర్ ప్యాకేజీ’ని ‘ఏఐ’ వ్యవస్థలతో అనుసంధానించే ‘భారత్-విస్తార్’ బహుభాషా ‘ఏఐ’ ఉపకరణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుంది.

2. దివ్యాంగులకు సాధికారత

· దివ్యాంగుల కోసం ఐటీ, ఏవీజీసీ రంగాలు సహా ఆతిథ్య-పానీయాల రంగాల్లో పని-ఆధారిత, ప్రక్రియ-ఆధారిత పాత్రపోషణ దిశగా ‘దివ్యాంగజన్ కౌశల్ యోజన’.

3. మానసిక ఆరోగ్యం – అత్యవసర ఆరోగ్య సంరక్షణపై నిబద్ధత

· ఉత్తర భారతంలో ‘నిమ్హాన్స్-2’ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం.

ఎ. రాంచీ, తేజ్‌పూర్‌లలోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థలకు ప్రాంతీయ ఉన్నత సంస్థలుగా ఉన్నతీకరణ.

4. పూర్వోదయ రాష్ట్రాలు సహా ఈశాన్య ప్రాంతంపై దృష్టి

· దుర్గాపూర్‌లో సముచిత అనుసంధాన కూడలితో సమీకృత తూర్పు తీర పారిశ్రామిక కారిడార్ నిర్మాణం, 5 పూర్వోదయ రాష్ట్రాలలో 5 పర్యాటక గమ్యస్థానాల సృష్టి, 4,000 ఈ-బస్సుల కేటాయింపు.

ఎ. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో బౌద్ధ సర్క్యూట్ల రూపకల్పన కోసం సిద్ధమవుతున్న పథకం.

16వ ఆర్థిక సంఘం

· 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు, ప్రస్తుత (2026-27) ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు గ్రాంట్ల కింద ₹1.4 లక్షల కోట్లు కేటాయింపు.

పార్ట్‌-బి

ప్రత్యక్ష పన్నులు

కొత్త ఆదాయపు పన్ను చట్టం

· ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులోకి వస్తుంది.

· సరళీకృత ఆదాయపు పన్ను నిబంధనలు, ఫారాలపై త్వరలో వెల్లడి… సాధారణ పౌరుల సౌలభ్యం లక్ష్యంగా వీటికి పునఃరూపకల్పన చేశారు.

జీవన సౌలభ్యం

· రోడ్డు ప్రమాద బీమా పరిహార ట్రిబ్యునల్ ఒక సహజ వ్యక్తికి పరిహారంపై మంజూరు చేసే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు. అలాగే, ఈ ఖాతా సంబంధిత టీడీఎస్‌ రద్దు.

టీసీఎస్‌ హేతుబద్ధీకరణ

· విదేశీ పర్యాటక ప్యాకేజీ విక్రయంపై టీసీఎస్‌ (ప్రస్తుత 2-20శాతం నుంచి) 2 శాతానికి తగ్గింపు.

· విద్య, వైద్యం కోసం ‘ఎల్‌ఆర్‌ఎస్‌’ చెల్లింపులపై టీసీఎస్‌ (ప్రస్తుత 5 శాతం నుంచి) 2 శాతానికి తగ్గింపు.

· మానవ వనరుల సరఫరా కోసం సరళీకృత టీడీఎస్‌ నిబంధనలతో శ్రమ ఆధారిత వ్యాపారాలకు ప్రయోజనం.

· అసెస్సర్ వద్ద దరఖాస్తు దాఖలుకు బదులు తక్కువ లేదా నిల్ డిడక్షన్ సర్టిఫికేట్ కోసం నియమాధారిత ఆటోమేటెడ్ ప్రక్రియలో చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం పథకం.

· డివిడెండ్లు, వడ్డీలు తదితరాలపై టీడీఎస్‌ నిమిత్తం ఫామ్ 15జి లేదా 15హెచ్‌ కోసం డిపాజిటరీలతో సింగిల్ విండో సదుపాయం

· సవరించిన రిటర్నుల సమర్పణ గడువు నామమాత్రపు రుసుముతో డిసెంబరు 31 నుంచి మార్చి 31 వరకు పొడిగింపు.

· పన్ను రిటర్నుల దాఖలుకు విభిన్న కాలక్రమం

· ‘ఎన్‌ఆర్‌ఐ’ల ప్రమేయంగల ఆస్తి లావాదేవీలపై ‘టీఏఎన్‌’ బదులు నివాస కొనుగోలుదారుల ‘పాన్‌’ కార్డు ఆధారిత చలానా.

· చిన్న పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆదాయం లేదా ఆస్తి వెల్లడి దిశగా ఏకకాలంలో 6 నెలల విదేశీ ఆదాయ వెల్లడి పథకం.

జరిమానా.. విచారణల హేతుబద్ధీకరణ

· ఆదాయపు పన్ను అసెస్‌మెంట్-పెనాల్టీ చర్యలు రెండింటినీ సార్వత్రిక క్రమంలో ఏకీకృతం చేసే ప్రతిపాదన.

· వివాదాల తగ్గింపు లక్ష్యంగా పునఃమూల్యాంకన చర్యలు ప్రారంభించాక కూడా పన్ను చెల్లింపుదారులు రిటర్నులను నవీకరించవచ్చు. అయితే, సంబంధిత సంవత్సరానికి వర్తించే దానికన్నా అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

· ఆదాయం తప్పుగా నివేదిస్తే విధించే జరిమానా చెల్లింపుపై అదనపు ఆదాయపు పన్ను జమ నిబంధన ద్వారా మినహాయింపు ఉంటుంది.

· కొత్త ఆదాయపు పన్ను చట్టం కింద విచారణ చట్రం హేతుబద్ధీకరణ.

· ఖాతా పుస్తకాలు, పత్రాలను సమర్పించకపోవడంతోపాటు వస్తు రూపంలో చెల్లింపు చేసినపుడు టీడీఎస్‌ చెల్లింపు నిబంధన కింద నేరంగా పరిగణించబడదు.

· రూ.20 లక్షలకన్నా తక్కువ విలువగల విదేశీ చరాస్తుల సమాచారం వెల్లడించకపోవడంపై విచారణ నుంచి మినహాయింపు వెనుకతేదీ 1.10.2024 నుంచి అమలులోకి వస్తుంది.

సహకార సంస్థలు

· పాలు, నూనెగింజలు, పండ్లు లేదా కూరగాయల సరఫరా లావాదేవీలు నిర్వహించే ప్రాథమిక సహకార సంఘాలకు ఇప్పటికే అనుమతించిన మినహాయింపు పశుదాణా, పత్తి విత్తన సరఫరాదారులకూ వర్తింపు.

· కొత్త పన్ను విధానం కింద సహకార సంఘాల మధ్య డివిడెండ్ ఆదాయాన్ని, అది తన సభ్యులకు పంపిణీ చేసినట్లుగా పరిగణించి మినహాయించాలి.

· ప్రకటిత జాతీయ సహకార సమాఖ్య వివిధ కంపెనీలలో 31.1.2026 వరకు పెట్టిన పెట్టుబడులపై లభించే డివిడెండ్ ఆదాయంతోపాటు దాని సభ్య సహకార సంఘాలకు పంపిణీ చేసిన డివిడెండ్‌కు సంబంధించి 3 సంవత్సరాల మినహాయింపు లభిస్తుంది.

భారత వృద్ధి చోదక శక్తిగా ఐటీ రంగానికి చేయూత

· సాఫ్ట్‌ వేర్ అభివృద్ధి సేవలు, ఐటీ ఆధారిత సేవలు, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ సేవలు, సాఫ్ట్‌ వేర్ అభివృద్ధి సంబంధిత కాంట్రాక్టు ఆర్‌ అండ్‌ సేవలు 15.5 శాతం ఉమ్మడి ‘సేఫ్ హార్బర్ మార్జిన్‌’తో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్’ పేరిట ఒకే విభాగం కిందకు వస్తాయి.

· ఐటీ సేవల కోసం ‘సేఫ్ హార్బర్‌’ వెసులుబాటు పరిమితి రూ.300 కోట్ల నుంచి రూ.2,000 కోట్లకు పెంపు.

· ఐటీ సేవల కోసం ‘సేఫ్ హార్బర్‌’ను ఆటోమేటెడ్ నియమాధారిత ప్రక్రియ ద్వారా ఆమోదించాలి. దీన్ని ఒకేసారి ఐదేళ్లపాటు కొనసాగించవచ్చు.

· ఐటీ సేవల కోసం ఏకపక్ష అడ్వాన్స్‌డ్ ప్రైసింగ్ అగ్రిమెంట్ (ఏపీఏ) ప్రక్రియను వేగిరపరచాలి. ఈ మేరకు రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయడానికి యత్నించాలి.. పన్ను చెల్లింపుదారు అభ్యర్థనపై మరో 6 నెలలు పొడిగించవచ్చు.

· ‘ఏపీఏ’లో ప్రవేశించే సంస్థకు అందుబాటులోగల సవరించిన రిటర్నుల సౌకర్యాన్ని దాని అనుబంధ సంస్థలకూ వర్తింపజేయాలి.

అంతర్జాతీయ వ్యాపారం.. పెట్టుబడుల ఆకర్షణ

· భారత్‌లోని డేటా సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్త వినియోగదారులకు క్లౌడ్ సేవలందించే ఏ విదేశీ కంపెనీకైనా 2047 వరకు పన్ను మినహాయింపు.

· భారత్‌ నుంచి డేటా సెంటర్ సేవలందించే కంపెనీ సంబంధిత సంస్థ అయితే, దాని వ్యయంపై 15 శాతం ‘సేఫ్ హార్బర్’ వెసులుబాటు కల్పించాలి.

· బాండెడ్ గిడ్డంగిలో కాంపోనెంట్ వేర్‌హౌసింగ్ కోసం నివాసేతరులకు ఇన్‌వాయిస్ విలువపై 2 శాతం లాభదాయకతతో ‘సేఫ్ హార్బర్’ సౌకర్యం కల్పించాలి. దీనిపై విధించే సుమారు 0.7 శాతం పన్ను, పోటీ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.

· బాండెడ్ జోన్‌లోని ఏ టోల్ ప్రక్రియ తయారీదారుకైనా మూలధన వస్తువులు, పరికరాలు లేదా టూలింగ్‌ను అందించే నివాసేతరులకు 5 ఏళ్లపాటు ఆదాయపు పన్ను మినహాయింపు.

· ప్రకటిత పథకాల కింద 5 సంవత్సరాల నివాస కాలానికి, నివాసేతర నిపుణుడి అంతర్జాతీయ (భారత్‌ వెలుపలి) ఆదాయానికి మినహాయింపు.

· అంచనా ప్రాతిపదికన పన్ను చెల్లించే నివాసేతరులందరికీ కనీస ప్రత్యామ్నాయ పన్ను నుంచి మినహాయింపు.

వాణిజ్య సౌలభ్యం

· వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి వస్తురవాణా అనుమతులు-ఆమోదాలు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏకైక, అంతర సంధానిత డిజిటల్ గవాక్షం ద్వారా సజావుగా పూర్తవుతాయి.

· నిషేధిత సరకులలో దాదాపు 70 శాతం వాటాగల ఆహారం, ఔషధాలు, మొక్కలు, జంతువులు-వన్యప్రాణి ఉత్పత్తుల క్లియరెన్స్ ప్రక్రియలు ఏప్రిల్ 2026 నాటికి ఈ వ్యవస్థ కిందకు వస్తాయి.

· ఎటువంటి సమ్మతి అవసరం లేని వస్తువులకు, దిగుమతిదారు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే కస్టమ్స్ ద్వారా క్లియరెన్స్ చేయాలి.

· అన్ని రకాల కస్టమ్స్ ప్రక్రియల కోసం ఏకైక, సమీకృత, సౌలభ్య వేదికగా కస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మరో రెండేళ్లలో అందుబాటులోకి వస్తుంది.

· అన్ని ప్రధాన ఓడరేవులలో ప్రతి కంటైనర్‌ను స్కాన్ చేసే లక్ష్యంతో దశలవారీగా రిస్క్ అసెస్‌మెంట్ కోసం అధునాతన ఇమేజింగ్, ఏఐ టెక్నాలజీతో నాన్-ఇంట్రూసివ్ స్కానింగ్ విధానాన్ని విస్తరింపజేస్తారు.

కొత్త ఎగుమతి అవకాశాలు

· విశిష్ట ఆర్థిక మండలం (ఈఈజడ్‌)లో లేదా ఏ దేశానికీ చెందని సముద్ర జలాల్లో భారతీయ ఫిషింగ్ నౌక ద్వారా చేపల వేటకు సుంకం రద్దు. ఆ చేపలను విదేశీ ఓడరేవులో దింపడం వస్తు ఎగుమతిగా పరిగణనలోకి వస్తుంది.

· కొరియర్ ఎగుమతులపై ప్రస్తుత కన్సైన్‌మెంట్ విలువపై ₹10 లక్షల పరిమితి పూర్తిగా తొలగింపు. దీంతో ఇ-కామర్స్ ద్వారా ప్రపంచ మార్కెట్‌ల సౌలభ్యం పొందాలనే భారత చిన్న వ్యాపారులు, చేతివృత్తులవారు, అంకుర సంస్థల ఆకాంక్షలు సాకారం.

జీవన సౌలభ్యం

· అంతర్జాతీయ ప్రయాణాల్లో లగేజీ క్లియరెన్స్‌ నియంత్రణ నిబంధనల సవరణ. ప్రస్తుత ప్రయాణ వాస్తవాలకు అనుగుణంగా సుంకం రహిత అనుమతుల దిశగా నిబంధనల సవరణ.

· నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు వివాదాల పరిష్కారానికి సిద్ధమైతే జరిమానా బదులు అదనపు మొత్తం చెల్లింపుతో కేసుల మూసివేత.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...