- బ్రిటన్ రాజకుటుంబంలో కలకలం
- కింగ్ చార్లెస్ సోదరుడు ఆండ్రూ అరెస్ట్
- ఎప్‌స్టీన్ కేసులో కీలక మలుపు!
లండన్: బ్రిటన్ రాజకుటుంబం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ కుదుపుకు గురైంది. కింగ్ చార్లెస్ III చిన్న తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటెన్ విండర్స్ (66)ను బ్రిటిష్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అమెరికాను వణికించిన సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆయనకు ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్న క్రమంలో 'పబ్లిక్ ఆఫీస్‌లో దుష్ప్రవర్తన'ఆరోపణల కింద థేమ్స్ వ్యాలీ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సరిగ్గా తన 66వ పుట్టినరోజు నాడే ఆండ్రూ అరెస్టవ్వడం గమనార్హం. గత ఏడాదే రాజకుటుంబ హోదాలను, 'డ్యూక్ ఆఫ్ యార్క్' బిరుదును కోల్పోయిన ఆండ్రూను పోలీసులు ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
శాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆండ్రూ నివాసానికి గురువారం ఉదయం ఆరు గుర్తు తెలియని పోలీసు వాహనాల్లో వచ్చిన అధికారులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెర్క్‌షైర్, నార్ఫోక్ ప్రాంతాల్లోని ఆయనకు సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 2010లో బ్రిటన్ వాణిజ్య ప్రతినిధిగా పనిచేసిన సమయంలో, ఆండ్రూ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాలను, నివేదికలను ఎప్‌స్టీన్‌కు పంపినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు విడుదల చేసిన తాజా పత్రాల్లో వెల్లడైంది. ఈ ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించి అరెస్ట్ వరకు వెళ్లారు.
ఈ పరిణామంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పందిస్తూ.. రాజు తన సోదరుడి ప్రవర్తన పట్ల తీవ్ర ఆందోళనతో ఉన్నారని, పోలీసుల విచారణకు రాజకుటుంబం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని స్పష్టం చేసింది. ఎవరూ చట్టానికి అతీతులు కారని, రాజకుటుంబీకులైనా నిబంధనలు పాటించాల్సిందేనని ఈ అరెస్ట్ ద్వారా తేలిపోయింది. గతంలోనే వర్జీనియా గిఫ్రే చేసిన లైంగిక ఆరోపణలతో కోర్టు బయట మిలియన్ల డాలర్లు చెల్లించి సెటిల్ చేసుకున్న ఆండ్రూకు, ఈ తాజా అరెస్ట్ చట్టపరంగా పెద్ద దెబ్బగా మారింది. ఈ కేసు ఇప్పుడు బ్రిటన్ అంతటా పెను సంచలనంగా మారింది.
No comments:
Post a Comment