ప్రధాని మోదీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇటీవలే రాజధానిలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కాంగ్రెస్ అనుబంధ యువజన విభాగం కార్యకర్తలు చొక్కాలు విప్పి నిర్వహించిన నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం జరిగిన 'న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్'లో ప్రసంగించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ఎన్ని బట్టలైనా చింపుకోవచ్చని, కానీ తమ ప్రభుత్వం మాత్రం దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. విదేశీ ప్రతినిధుల ముందు కాంగ్రెస్ కేవలం బట్టలు ఊడదీయడమే కాకుండా, తన అసమర్థతను, మేధోపరమైన దివాళాకోరుతనాన్ని ప్రపంచం ముందు బహిర్గతం చేసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ దేశ యువత (మిలీనియల్స్) ఇప్పటికే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారని, ఇప్పుడు జెన్-జీ (Gen-Z) కూడా అదే పాఠాన్ని నేర్పేందుకు సిద్ధంగా ఉందని మోదీ హెచ్చరించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ ప్రధాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనంపై 'బబ్బర్ షేర్' (సింహాల) విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే విపక్షాలు అసూయ చెందాయని, కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు చెందిన 'బబ్బర్ షేర్లు' ప్రజల చెప్పు దెబ్బలు తిని భయంతో పరుగులు తీస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఏఐ సమ్మిట్‌లో నిరసన తెలిపిన తన పార్టీ కార్యకర్తలను 'బబ్బర్ షేర్లు' అని రాహుల్ గాంధీ కొనియాడటాన్ని ప్రస్తావిస్తూ మోదీ ఈ కౌంటర్ ఇచ్చారు. వైఫల్యాల వల్ల కలిగే నిరాశ, అహంకారం తలకెక్కినప్పుడు మాత్రమే దేశ ప్రతిష్టను దిగజార్చే ఇలాంటి ఆలోచనలు వస్తాయని, దేశం గర్వించదగ్గ ఏఐ సమ్మిట్ వేడుకను అపహాస్యం చేయడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.
తన 45 నిమిషాల ప్రసంగంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఏకిపారేసిన ప్రధాని, ఆ పార్టీ తన వైఫల్యాలను దాచుకోవడానికి మహాత్మా గాంధీ పేరును వాడుకుంటుందని, ఏదైనా మంచి జరిగితే మాత్రం దాని క్రెడిట్ ఒకే కుటుంబానికి ఇస్తుందని ఆరోపించారు. 1984లో 400 పైగా సీట్లు గెలిచిన కాంగ్రెస్, నేడు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే 50 కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను కలిగి ఉండే స్థాయికి పడిపోయిందని గుర్తు చేశారు. గత పదేళ్లలో దేశం 'ఫ్రాజైల్ ఫైవ్' జాబితా నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నదని, అందుకే నేడు అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి క్యూ కడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
2047 నాటికి 'వికసిత్ భారత్' అనేది కేవలం రాజకీయ నినాదం కాదని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పులను సరిదిద్ది దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించే పవిత్ర యజ్ఞమని మోదీ పునరుద్ఘాటించారు. గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ కేవలం అనుసరించే దేశంగానే మిగిలిపోయిందని, కానీ నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో భారత్ కేవలం భాగస్వామిగానే కాకుండా, ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే స్థాయికి చేరుకుందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణం అనేది స్వల్పకాలిక ఆలోచనలతో సాధ్యం కాదని, అది దీర్ఘకాలిక దార్శనికత మరియు సరైన సమయంలో తీసుకునే కఠిన నిర్ణయాల వల్లే సాధ్యమవుతుందని ప్రధాని స్పష్టం చేశారు.

No comments:
Post a Comment