- భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం
- దేశ ఆర్థిక చరిత్రలో ఒక నూతన అధ్యాయం
న్యూఢిల్లీ: భారత్ - అమెరికా మధ్య కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పంద ముసాయిదా దేశ ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ అందుబాటులోకి రావడంతో, ఈ రోజును ఆయన "బంగారు అక్షరాలతో లిఖించదగిన రోజు" అని అభివర్ణించారు.
ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా భారత ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి గణనీయంగా తగ్గాయి. ఇది పొరుగు దేశాల కంటే చాలా తక్కువ అన్నారు. రత్నాలు, ఆభరణాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరి నూనె, జీడిపప్పు, అలాగే అరటి, మామిడి, పైనాపిల్ వంటి పండ్ల ఎగుమతులపై అమెరికాలో సున్నా పన్ను విధించబడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. భారత రైతులు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల వారి ప్రయోజనాలు పూర్తిగా రక్షించబడినాయని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ కూడా సురక్షితంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు. అదే సమయంలో, జన్యు మార్పిడి ఆహార పదార్థాలను భారతదేశంలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఈ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. టెక్స్‌టైల్స్, లెదర్ , బొమ్మల ఎగుమతి పెరగడం వల్ల లక్షలాదిమందికి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో ఈ ఒప్పందం కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment