Thursday, 26 February 2026

ఎప్ స్టీన్‌ ఫైల్స్ వివాదం: పాలకులకు నైతిక జవాబుదారీతనం లేదా?

 

  • కేంద్రంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం
  • కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్!

వాయనాడ్: అమెరికాలో సంచలనం సృష్టించిన 'ఎప్ స్టీన్‌ ఫైల్స్' వ్యవహారం ఇప్పుడు భారత రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ ఫైల్స్‌లో పేరున్న ప్రభుత్వ పెద్దలు నైతిక బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. గురువారం వాయనాడ్‌లో పర్యటించిన ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫైల్స్‌లో పేర్లు వచ్చిన వారు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారని, కానీ భారతదేశంలో మాత్రం పాలకులకు ప్రజల పట్ల కనీస నైతిక జవాబుదారీతనం  లేదని విమర్శించారు. ఒక పక్క కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేరు ఈ జాబితాలో ఉండటంపై కాంగ్రెస్ ఆయన రాజీనామాకు పట్టుబడుతుండగా, ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



ఒక వ్యక్తికి సంబంధించిన అక్రమ కార్యకలాపాలు తెలిసి ఉండి కూడా, వారితో నిరంతరం ఈమెయిల్స్ ద్వారా సంభాషణలు జరపడం, సమావేశం కావడం వంటివి తీవ్రమైన అంశాలని ప్రియాంక పేర్కొన్నారు. "మీరు ఒక మంత్రిగా ఉన్నప్పుడు, మీ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. విదేశాల్లో ఇలాంటి కేసుల్లో మంత్రులు మాత్రమే కాదు, ఏకంగా రాజకుటుంబీకులు కూడా విచారణను ఎదుర్కొన్నారు, రాజీనామాలు చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఒక నేరగాడితో సంబంధాలు ఉన్నా కూడా ఎటువంటి చలనం లేకపోవడం దురదృష్టకరం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పేరు ఉండటమే కాకుండా, సదరు వ్యక్తి ప్రవర్తనపై అవగాహన ఉండి కూడా సంబంధాలు కొనసాగించడం నైతికంగా తప్పని  చెప్పారు.

No comments:

Post a Comment

Featured post

మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు

మా పోర్టులకు ముప్పు వాటిల్లితే మధ్యప్రాచ్యంలోని ఏ నౌకాశ్రయమూ సురక్షితం కాదు ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా ఐఆర్‌జీసీ హెచ్చరిక మళ్ళీ నిలి...