- అబోటాబాద్ సమీపంలో భీకర పోరు
- ఇరుదేశాల మధ్య ముదిరిన యుద్ధ మేఘాలు!
న్యూఢిల్లీ/కాబూల్: సరిహద్దు వివాదాలతో అట్టుడుకుతున్న ఆఫ్ఘనిస్తాన్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. శుక్రవారం నాడు ఆఫ్ఘన్ సాయుధ దళాలు పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతం, అబోటాబాద్ సమీపంలో ఉన్న ఒక అణు కేంద్రం, కీలక సైనిక స్థావరంపై భారీ దాడులు నిర్వహించాయి. కాకుల్ గ్రామ పరిసరాల్లో జరిగిన ఈ మెరుపు దాడిలో వందలాదిమంది మరణించినట్లు, క్షతగాత్రులను హుటాహుటిన ఇస్లామాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించినట్లు రష్యన్ వార్తా సంస్థ 'టాస్' (TASS) వెల్లడించింది. కాకుల్‌లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ (PMA) కూడా ఉంది, దీనినే ఆఫ్ఘన్ దళాలు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
- ప్రతీకారేచ్ఛతో విరుచుకుపడ్డ ఆఫ్ఘన్ వాయుసేన
గత రాత్రి కాబూల్, కాందహార్ , పక్తియా ప్రాంతాలపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు నిరసనగా తాము ఈ ప్రతీకార చర్య చేపట్టామని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేవలం అబోటాబాద్ మాత్రమే కాకుండా, ఇస్లామాబాద్ సమీపంలోని ఫైజాబాద్ సైనిక శిబిరం, నౌషెరా కంటోన్మెంట్ , జామ్రుద్‌లోని మిలిటరీ కాలనీలపై కూడా తమ వాయుసేన విజయవంతంగా దాడులు చేసిందని ఆఫ్ఘన్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. పాక్ సైన్యానికి చెందిన కీలక స్థావరాలను తాము కచ్చితత్వంతో నేలమట్టం చేశామని కాందహార్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆఫ్ఘన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పష్టం చేశారు.
- పాక్ ప్రతిస్పందన , అంతర్జాతీయంగా ఆందోళన
మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ దాడులను ధృవీకరిస్తూనే, తాము కూడా దీటుగా స్పందించామని పేర్కొంది. తమ భూభాగంపై ఆఫ్ఘన్ దళాలు జరిపిన దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. పాకిస్థాన్ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశాలపై ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సామాన్య పౌరుల మరణాలను కూడా భారత్ తీవ్రంగా ఖండించింది.
No comments:
Post a Comment