Wednesday, 4 February 2026

పార్లమెంట్‌లో 'ద్రోహి-దేశద్రోహి' రచ్చ


  • రవ్‌నీత్ బిట్టూపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
  • రగిలిపోయిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఆసక్తికరమైన, వివాదాస్పదమైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఎనిమిదిమంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు మకర ద్వార్ వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అటుగా వెళ్తున్న మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత బీజేపీ మంత్రి బిట్టూను చూసిన రాహుల్.. "ఇదిగో ఒక ద్రోహి అటు వెళ్తున్నాడు, ఆ ముఖం చూడండి" అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, ఆయనకు కరచాలనంఇచ్చేందుకు ప్రయత్నిస్తూ.. "హలో బ్రదర్, నా ద్రోహి మిత్రమా! కంగారు పడకు, మళ్లీ నువ్వు కాంగ్రెస్‌కే తిరిగి వస్తావు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


  • మీరే అసలైన దేశద్రోహులు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రవ్‌నీత్ బిట్టూ అంతే ఘాటుగా స్పందించారు. రాహుల్ షేక్ హ్యాండ్ ఆఫర్‌ను తిరస్కరించిన ఆయన.. "దేశ్ కే దుష్మన్" (దేశ శత్రువు) అంటూ రాహుల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిట్టూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "సిక్కులను ఊచకోత కోసిన గాంధీ కుటుంబ వారసుడితో ఒక సర్దార్ ఎప్పటికీ చేయి కలపడు. సైన్యం గురించి, దేశం గురించి ప్రతిరోజూ తప్పుగా మాట్లాడే మీరే అసలైన దేశద్రోహులు" అని ధ్వజమెత్తారు. ఆపరేషన్ బ్లూ స్టార్ , సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పించారు.


మరోవైపు బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు, సిక్కులను ద్రోహులు అనడం కాంగ్రెస్ కుటిల మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ రాజా వారింగ్ మాత్రం రాహుల్ వ్యాఖ్యలను సమర్థించారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని "ద్రోహి" అనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎంపీల సస్పెన్షన్,  రాహుల్ గాంధీని సభలో మాట్లాడనివ్వకపోవడంపై నెలకొన్న ఉద్రిక్తతలు ఈ వ్యక్తిగత దూషణలతో మరింత వేడెక్కాయి.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...