Friday, 6 February 2026

హాస్యాస్పదం, విడ్డూరం


  • లోక్‌సభలో ప్రధాని మోడీ గైర్హాజరీపై స్పీకర్ వ్యాఖ్యలకు TMC ఘాటు కౌంటర్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమివ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభకు ఎందుకు రాలేదో చెబుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత సాగరిక ఘోష్ "హాస్యాస్పదం, విడ్డూరం"అని పేర్కొన్నారు. ప్రధానిపై ప్రతిపక్షసభ్యులు ఊహించని రీతిలో నిరసన తెలపవచ్చని తనకు "కచ్చితమైన సమాచారం" ఉందని, అందుకే ఆయన సభకు రావద్దని తాను సలహా ఇచ్చినట్లు స్పీకర్ ఓం బిర్లా సభలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాని భయం వెనుక నిజాలు: రాజ్యసభలో TMC డిప్యూటీ లీడర్ అయిన సాగరిక ఘోష్, సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా ప్రధాని మోడీ లోక్‌సభను ఎదుర్కోవడానికి ఇష్టపడలేదని ఆరోపించారు. "మహిళా ఎంపీల నుంచి భౌతిక దాడుల ముప్పు ఉందని పేర్కొంటూ ప్రధాని లోక్‌సభలో మాట్లాడలేదని స్పీకర్ చెప్పడం హాస్యాస్పదం. నిజం ఏమిటంటే, నరేంద్ర మోడీ లోక్‌సభను ఎదుర్కోవడానికి ఇష్టపడలేదు" అని ఘోష్ విమర్శించారు.



  • గ్రేడ్ D ప్రభుత్వం

రాజ్యసభలో కూడా ప్రధాని మోడీ కేవలం ఖాళీ బెంచీలను ఉద్దేశించి ప్రసంగించారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని "గ్రేడ్ D" ప్రభుత్వం అని పేర్కొన్న ఆమె, D అంటే "నిరాకరణ" , "పిరికితనం" అని వ్యాఖ్యానించారు. గత బుధవారం లోక్‌సభలో ప్రతిపక్ష మహిళా ఎంపీలు బ్యానర్లతో ప్రధాని సీటు వైపు దూసుకెళ్లిన దృశ్యాల నేపథ్యంలో సభ వాయిదా పడింది. ఆ సమయంలో ప్రధాని సభలో లేరు. ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.

No comments:

Post a Comment

Featured post

దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి కన్నుమూత

  న్యూఢిల్లీ: దూరదర్శన్‌ మాజీ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. 1980, 1990 దశకాల్లో దూరదర్శన్‌ వార్తా ప్రసారాల్లో పరిచయమైన ...