- విమానాలన్నీ రద్దు, యూఏఈ లోహై అలర్ట్ !
అబుదాబి: ఇరాన్ , ఇజ్రాయెల్-అమెరికా మధ్య మొదలైన తీవ్ర యుద్ధ పరిణామాల ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికులపై పడింది. శనివారంఅబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో వందలాది మంది భారతీయులతో సహా వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటంతో, భద్రతా కారణాల దృష్ట్యా యూఏఈ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. దీనివల్ల అబుదాబి విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన, అక్కడ ల్యాండ్ కావాల్సిన అన్ని విమాన సర్వీసులను అధికారులు ఒక్కసారిగా నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా ఎయిర్‌పోర్ట్ అంతటా గందరగోళం, ఆందోళన నెలకొంది. విమానాశ్రయంలోని టెర్మినల్స్‌లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యూఏఈ నేషనల్ గార్డ్ బలగాలు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రయాణికులెవరూ బయటకు రావద్దని, భవనం లోపలే సురక్షితంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా భారతదేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం వేచి ఉన్న వందలాదిమంది భారతీయులు ఎటు వెళ్ళాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ లోని హోటళ్లు, లాంజ్‌లు ఇప్పటికే నిండిపోవడంతో చాలా మంది నేలపైనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కొందరు ప్రయాణికులు మాట్లాడుతూ.. కొన్ని క్షిపణులు సమీపంలోనే పడినట్లు వార్తలు వస్తున్నాయని, ఎయిర్‌పోర్ట్ లోపల పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అత్యవసర పరిస్థితిని గమనించిన అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే స్పందించింది. చిక్కుకుపోయిన భారతీయుల క్షేమం కోసం యూఏఈ అధికారులు మరియు విమానయాన సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు అవసరమైన ఆహారం, నీరు, ఇతర కనీస సదుపాయాలు అందేలా చూస్తున్నామని, పరిస్థితి చక్కబడిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. గగనతలం పునరుద్ధరణపై స్పష్టత వచ్చే వరకు భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని సూచించింది.
No comments:
Post a Comment