అసోంలో ప్రధాని మోడీ పర్యటన
రూ. 5,450 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
గౌహతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసోంలో పర్యటించి, రాష్ట్రానికి సంబధించిన రూ. 5,450 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై రూ. 3,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 'కుమార్ భాస్కర్ వర్మ సేతు'ను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ వంతెన గౌహతి, ఉత్తర గౌహతిలను కలుపుతూ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని లాచిత్ ఘాట్‌కు చేరుకుని, వర్చువల్ విధానంలో కామరూప్ జిల్లాలోని అమిన్‌గావ్‌లో ఐఐఎం గౌహతి తాత్కాలిక క్యాంపస్‌ను, ఈశాన్య ప్రాంతం కోసం నేషనల్ డేటా సెంటర్‌ను ప్రారంభించారు.
అంతేకాకుండా, పీఎం-ఇబస్ సేవా పథకం కింద దేశంలోని నాలుగు నగరాలకు 225 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇందులో గౌహతికి 100 బస్సులు, నాగ్పూర్, భావ్‌నగర్‌లకు 50 చొప్పున, చండీగఢ్‌కు 25 బస్సులు కేటాయించబడ్డాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని దిబ్రూగఢ్ జిల్లాలోని నేషనల్ హైవేపై ఏర్పాటు చేసిన 'ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ'ని ప్రారంభించి, అక్కడ యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల ఏరియల్ ప్రదర్శనను వీక్షించారు. ఈ అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని రూ. 100 కోట్లతో నిర్మించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 'బూత్ విజయ్ సంకల్ప్ సభ'ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. అసోంతో పాటు ఈశాన్య ప్రాంతమంతా భారతదేశానికి 'అష్టలక్ష్మి' వంటిదని ఆయన అభివర్ణించారు. గత 11 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఈశాన్య ప్రాంత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని పేర్కొంటూ, కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతానికి రూ. 5.5 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించామని, మౌలిక సదుపాయాల రంగంలో అపూర్వమైన అభివృద్ధి కనిపిస్తున్నదని ఆయన వివరించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలోనే అసోం భారతదేశానికి కీలకమైన వృద్ధి ఇంజిన్‌గా అవతరించిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని, అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి పన్నుల విభజన కిందఅసోంకు రికార్డు స్థాయిలో రూ. 49,725 కోట్లు కేటాయించామని ప్రధాని వెల్లడించారు.
No comments:
Post a Comment