Sunday, 6 July 2025

అదే నిజమైతే నగరంలో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేశారు?




ఈ వారం 'కొత్తపలుకు'లో రాధాకృష్ణ రాతలు మహాటీవీ వంశీ విద్వేషానికి కొనసాగింపే. కడుపులో కత్తులు పెట్టుకుని తెలంగాణ మీద లేని ప్రేమ చూపెట్టే రాధాకృష్ణ ఉద్యమకాలం నుంచే తెలంగాణ ఉద్యమాన్ని, బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచేలా అసత్య కథనాలు వండివార్చారు. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు వెనుక అనేక కారణాలున్నాయి. చంద్రబాబు, టీడీపీ సానుభూతి పరుల వల్లనే కాంగ్రెస్‌ గెలిచిందని రాధాకృష్ణ అనుకుంటే అది ఆయన భ్రమే. ఎందుకంటే సైబరాబాద్ ను నిర్మించానని, హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నేనే పెట్టానని గప్పాలు కొట్టే చంద్రబాబును పట్టించుకునే స్థితిలో నగర ప్రజలు లేరు. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌ ముఖచిత్రమే మారిపోయింది. కేసీఆర్‌ నాయకత్వంలో మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్‌ విజన్‌ వల్ల హైదరాబాద్‌కు బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చింది. అంతర్జాతీయ కంపెనీలన్నీ బెంగళూరును కాదని హైదరాబాద్‌లో తమ సంస్థలను నెలకొల్పాయి. 

“తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ‘ఆంధ్రజ్యోతిని కట్టడి చేస్తే తెలంగాణ ఉద్యమం చప్పబడిపోతుంది’ అని వ్యాఖ్యానించడం నిజం కాదా?” అని రాధాకృష్ణ తన కాలమ్‌ రాశారు. అయితే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో ఆంధ్రజ్యోతి గురించి ఎక్కడా పై వాక్యాలు రాయలేదు. మీడియా మేనేజ్‌మెంట్‌ గురించి ఆ నివేదికలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 13 టీవీ ఛానెళ్లు, 5 దినపత్రికలు ఉన్నాయి. అందులో రాజ్ న్యూస్ (టీ న్యూస్) మరియు హెచ్ఎం టీవీ తప్ప మిగతా మీడియా సంస్థలన్నీ తెలంగాణను వ్యతిరేకించాయన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఉద్యమాన్నిచల్లబరచాలంటే  ఈ రెండు ఛానల్స్‌ మినహా మిగిలిన ఛానల్స్‌ను మేనేజ్‌ చేయాలని సూచన చేసింది. 

ఇక చంద్రబాబు అరెస్టు పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వల్ల టీడీపీ సానుభూతిపరులు గుర్రుగా ఉన్నారని రాధకృష్ణ అన్నారు. అదే నిజమైతే నగరంలో బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లు వేశారో, మొత్తం సీట్లన్నీ ఎలా గెలిచిందో చెబితే బాగుండేది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఢిల్లీ నుంచి గల్లీదాకా జరిగినా ముఖ్యకేంద్రం హైదరాబాదే. ఉద్యమకాలంలో అయినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అయినా ఇక్కడ నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజల భద్రత బాధ్యతను కేసీఆర్‌ తీసుకున్నారు. శాంతిభద్రత విషయంలో రాజీపడలేదు. రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని అందించే హైదరాబాద్‌ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ ప్రజలు గత ఐదు దశాబ్దాల్లో చూడని అభివృద్ధిని చూశారు. కానీ ఎన్నడూ కేసీఆర్‌, కేటీఆర్‌లు చంద్రబాబులా సెల్ఫ డబ్బా కొట్టుకోలేదు. 



ఏపీ కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందని కేసీఆర్‌, కేటీఆర్‌ భయపడుతున్నారట. 2014, 2018, 2023 బీఆర్‌ఎస్‌ సింగిల్‌గానే పోటీ చేసింది. 2018లో చంద్రబాబు మహాకూటమిలో చేరి మొత్తం బాధ్యత తానే తీసుకున్నా బీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. 2014లోనూ మోడీ హవా దేశమంతా వీచినా ఇక్కడ ఆ పార్టీ ప్రభావం ఏమీ కనిపించలేదు. 2018లో అయితే సింగిల్‌ సిటుకే పరిమితమైంది. ఏపీ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) , కాంగ్రెస్‌ కలిసి పోటీచేసినా 2028లో ఏం జరగబోతుందనేది తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉన్నది. కూటములతో వచ్చినా, అనైతిక పొత్తులతో పోటీ చేసినా కేసీఆర్‌ భయపడుతారా? ఉద్యమనాయకుడికి తెలంగాణ ప్రజల చైతన్యం తెలువదా? ఎన్టీఆర్‌ నుంచి అధికారాన్ని గుంజుకున్న చంద్రబాబుకు ఎన్నడూ ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదు. అలాంటి చంద్రబాబుకు కేసీఆర్‌ కు పోలిక ఎందులోనూ లేదు. ఇక  ఏపీలో సూపర్‌ సిక్స్‌  హామీలను చంద్రబాబు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలను ఆయన శిష్యుడు రేవంత్‌ రెడ్డి అమలు చేయలేమని చేతులెత్తేశారు. 


రాధాకృష్ణ అసలు బాధ ఏపీలో జగన్‌మోహన్‌ రెడ్డి మళ్లీ గెలిస్తే ఎక్కడ తన అయిపోతుందో అని అంతర్గత భయం ఆయనను వెంటాడుతున్నది. అందుకే ఇప్పటికీ జగన్‌కే కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారని ఆయన తన రాతల్లో అక్కసు వెళ్లగక్కారు. అయితే 2014లో ఓటుకు నోటు కేసు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల తర్వాత వైసీపీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకూడదని నిర్ణయించుకున్నది. దానికే కట్టుబడి ఉన్నది. అంతేగాని చంద్రబాబు లాగా శిఖండి రాజకీయాలు చేయడం లేదు. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయితే 2023 డిసెంబర్‌ వరకు కేసీఆర్‌ ఉన్నంత వరకు వాటిని తిప్పికొట్టారు. ఆయనను అమరావతికి తరమికొట్టారు. ఇప్పుడు ఆయన తాబేదారు రేవంత్‌ రెడ్డి చేతగాని తనం వల్ల ఆయన మళ్లీ ఇక్కడ రాజకీయాలు మొదలుపెట్టారు. అయితే కేసీఆర్‌ ఆ మధ్య అన్నట్టు నాకు గట్టిగానే కొట్టడం తప్ప మెల్లగా కొట్టడం అలవాటు లేదన్నారు. 2028లో అదే జరగబోతున్నది. కేసీఆర్‌ తెలంగాణలో కొట్టే ఆ రాజకీయ దెబ్బ అమరావతిలోనే కాదు హస్తినలోని వినిపిస్తుంది. ఆ సౌండ్‌ ఎంత భయంకరంగా ఉంటుందో విందువు. అప్పటివరకు స్టే ట్యూన్‌ రాధాకృష్ణా!

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...