Monday, 7 July 2025

తెలంగాణలో బీజేపీ మార్క్‌ రాజకీయం మొదలు




బీజేపీ మార్క్ రాజకీయాలు తెలంగాణలో మొదలుపెట్టింది. కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్‌ రావు ఇప్పటికే తాను క్రిమినల్‌ లాయర్‌ ఒక్కొక్కరిని బొక్కలో వేయిస్తానని బెదిరించారు. మీడియా స్వేచ్ఛ పేరుతో కొంతమంది అదేపనిగా బీఆర్‌ఎస్‌పై విషం చిమ్ముతుంటే పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా ఉండదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిని అన్న విషయం రాంచందర్‌ రావు, కేంద్ర సహాయ మంత్రిని అని సంజయ్‌ మరిచిపోయారు. బీఆర్‌ఎస్‌ను బద్నాం చేయడానికి, కేసీఆర్‌ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా రాయొచ్చు అన్నట్టు వీళ్లు అభయహస్తం ఇస్తున్నారు. 


రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ పార్టీ. దేశవ్యాప్తంగా బీజేపీ బుల్డోజర్‌ రాజ్‌, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా ఆపార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేతిలో రాజ్యాంగం బుక్కు పట్టుకుని తిరుగుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్‌ సర్కార్‌ కాషాయ నేతలకు, కాషాయ నేతలు కాంగ్రెస్‌ సర్కార్‌కు వంతపాడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్‌, కాషాయ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి అనడానికి బీఆర్‌ఎస్‌పై రాంచందర్‌రావు, సంజయ్‌ల వ్యాఖ్యలే నిదర్శనం. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తికి చట్టం, కోర్టులతో పనిలేదనుకుంటా. అర్జెంటుగా కేసీఆర్‌, కేటీఆర్‌లను జైళ్లో వేయాలని రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేస్తున్నారు. బహిరంగంగానే తెలంగాణ భవన్‌పై దాడిచేయడానికి సిద్ధంగా ఉండాలని బీజేవైఎం కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చామని చెబుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ప్రస్తుతం ఆయనే హోం శాఖ మంత్రి కాబట్టి సంజయ్‌ వ్యాఖ్యలను తేలికగా తీసుకోవద్దు. బాధ్యత మరిచి భౌతిక దాడులకు పురికొల్పుతున్న ఆయనపై కేసులు పెట్టాలని తెలంగాణ సమాజం డిమాండ్‌ చేస్తున్నది. 


వీళ్లిద్దరే కాదు ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్‌, రఘునందన్‌ రావు, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిల వ్యాఖ్యలు గమనిస్తే వాళ్ల టార్గెట్‌ బీఆర్‌ఎస్‌ మాత్రమే. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌, బీజేపీలు వేరైనా రాష్ట్రంలో మాత్రం ఒక్కటే అన్నట్టు వాళ్ల వైఖరి ఉంటున్నది. ఏపీ కూటమి ఇక్కడ పోటీ చేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ఏపీ, తెలంగాణలో బీజేపీ పార్టీ వ్యవహారాల బాధ్యతలు బాబుకే అప్పగించారని అనుకోవాలా? ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని వదిలి బీఆర్‌ఎస్‌ ను బలహీనపరచడానికి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నది. కానీ ఇప్పుటి నుంచే విద్వేషపూరిత ప్రసంగాలు, ఉద్రిక్తలు రెచ్చగొట్టేలా సవాళ్లు విసరడం దేనికి సంకేతం? బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు మూడేళ్ల ముందు అక్కడ ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా అలాంటి రాజకీయాలే చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సప్పుడు చేయకుండా ఉంటున్నది.  ఈ పరిణామాలన్నీ తెలంగాణలో అస్థిరతను సృష్టించడానికే అన్నది స్పష్టమౌతున్నది. 19 నెలల కాంగ్రెస్‌ పాలనానుభవం తర్వాత పాలు ఏవో నీళ్లు ఏవో తేలిపోయింది. వీళ్ల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాషాయ పార్టీ నేతలను ప్రోత్సహిస్తూ బీఆర్‌ఎస్‌పై ఉసిగొల్పుతున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి.తెలంగాణ వనరులను ఏపీకి తాకట్టు పెట్టడానికి రెండు జాతీయ పార్టీల నేతలు చేస్తున్న కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉన్నది. 




No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...