'తెలంగాణ అస్తిత్వం- సవాళ్లు, కర్తవ్యాలు' అనే అంశంపై తెలంగాణ వికాస సమితి చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశం అధికారపార్టీని కలవరానికి గురిచేసింది. అందులో పాల్గొన్న వక్తలు వివిధ రంగాల్లో నిపుణులు. వారు చెప్పిన అభిప్రాయాలు ప్రజల్లోకి వెళితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రజలు మునుముందు బట్టలూడదీస్తారేమో అన్న ఆందోళన ఆపార్టీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో అంతర్గతంగా ఉన్నది. అందుకే సమావేశం కార్డు పెట్టగానే అభ్యుదయభావాలు గల కొంతమందితో విమర్శలు చేయించింది. వాళ్లతో రాతలు రాయించింది. (వీళ్లకు కేసీఆర్ అంటే కోపం.ఎందుకంటే ఆయన ప్రజలతోనే ఉన్నారు. కానీ ఇలాంటి వారిని ఎంటర్‌టైన్ చేయలేదు. కానీ ప్రస్తుతం వీళ్లకు రేవంత్‌రెడ్డి మంచి సత్సంబంధాలు ఉన్నాయి) సీఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా మేము మౌనంగానే ఉంటాం. అసలు ప్రశ్నించం. కనీసం విమర్శించం అన్నట్టు కొంతమంది వ్యవహారం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిపై, ప్రశ్నించే వారిపై ఒంటికాలిపై లేస్తున్నారు.
వాళ్లంతా నిజాయితీ ఉన్నారా అంటే..? గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వాళ్లే. పదవీ కాలం ముగియగానే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టిన వాళ్లే. వీళ్ల బాధంతా ప్రభుత్వం దృష్టిలో పడాలి. పదవులు తీసుకోవాలి. అందుకే వికాస సమితి రౌండ్ టేబుల్ సమావేశంపై విషం చిమ్మారు. ఆ సమావేశంలో వక్తల అభిప్రాయాలను కోట్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలా వాపోయారు. నిజానికి ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 19 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ అస్తిత్వం ఎలా ప్రమాదంలోకి నెట్టివేయబడిందో వక్తలు అనేక ఉదాహరణలతో చెప్పారు. నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్న ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ చరిత్రను చెరిపివేసే ప్రయత్నాలు చేసింది నిజం. ఇది కేసీఆర్ వ్యతిరేకులకు కనిపించదు. అలాగే అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహం గేట్లకు తాళం వేసినా వీళ్లకు పట్టదు. కేసీఆర్ కట్టిన ఏదీ వినియోగంలోకి ఉండటానికి వీళ్లేదూ అన్నట్టు కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా రైతాంగాన్ని గోస పెట్టినా, ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు నమ్మబలికి ఇప్పుడు నిరసన చేస్తున్నవారిపై కేసులు పెడుతూ.. అణచివేస్తున్నా ఎన్నడూ అడుగరు.
వీళ్లంతా కాంగ్రెస్ పార్టీ దగ్గర టోకెన్ తీసుకుంటూ... బీఆర్‌ఎస్ ను, తెలంగాణ ప్రజలను, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేవారిని టార్గెట్ చేస్తున్నారు. నిజానికి ఆ సమావేశంలో నందిని సిధారెడ్డి సార్ కొన్ని ఉద్యమపార్టీపై కూడా విమర్శలు చేశారు. ఎక్కడ లోపం ఉన్నదో చెప్పారు. భవిష్యత్తులో ఏం చేయాలో చెప్పారు. అలాగే పాపారావు తెలంగాణ పాట ఆవశ్యకత గురించి చెప్పారు. సీనియర్ జర్నలిస్టు పరాంకుశం వేణుగోపాల స్వామి మీడియా హక్కుల పేరుతో చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు. ప్రజలకు మాత్రమే హక్కులుంటాయని అంతేగాని భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో తెలంగాణపై చంద్రబాబు దండు చేస్తున్న దాడిని ప్రస్తావించారు. జూలురు గౌరీశంకర్ గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పారు. పంజుగుల శ్రీశైల్ రెడ్డి సాహిత్య అకాడమీ ఛైర్మన్ గా సిధారెడ్డి ఉన్నప్పుడే విమర్శిస్తూ వ్యాసం రాసినా ఎన్నడూ కేసులు పెట్టలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని చెప్పారు. మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర హోదా ఉన్న జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్రం ఎలా వ్యవహరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ, ఏపీ కూటమి నేతలు గతంలో తెలంగాణ ఏర్పాటుపై ఎలా వ్యవహరించారో చెప్పారు. కనకదుర్గ దంటు మాట్లాడుతూ.. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడకముందే ఏడు మండలాలు గుంజుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ దేశ పతి శ్రీనివాస్ కాళేశ్వరం నుంచి అమరజ్యోతి వరకు కేసీఆర్ కట్టిన నిర్మాణాలపై రేవంత్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న విషయాన్ని చెప్పారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ..ఈ వలసవాదం అనేది పొంచి ఉన్న పులి లాంటిదని అదనుచూసి మన మీద లంకించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇవాళ తెలంగాణ అలాంటి అదునైన కాలం వాళ్లకు కలిసి వస్తున్నదన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కార్పొరేట్, పెట్టుబడిదారులు తెచ్చే ఫార్మా కంపెనీలు గత ప్రభుత్వం తెచ్చినా ప్రస్తుత ప్రభుత్వం తెచ్చినా వ్యతిరేకించాల్సిందే అన్నారు.
సిధారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారినప్పుడే ప్రశ్నించాల్సి ఉండే అన్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ మాయమైనప్పుడే గ్రామస్థాయి నుంచి ఉద్యమం రావాల్సి ఉండే కుండబద్దలు కొట్టారు. అక్కడి వచ్చిన వక్తలంతా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న చర్యల వల్ల తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడబోతున్నదని హెచ్చరించారు. అసలు అక్కడ ఎవరు ఏం మాట్లాడారో పూర్తిగా చూడకుండానే పత్రికల్లో వచ్చిన ఒకటి రెండు అంశాల ఆధారంగానే విశ్లేషణలు చేసి వికాస సమితిని ఒక పార్టీకి అనుబంధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అబద్ధాలతో, అర్ధసత్యాలతో బట్టకాల్చి మీదేసే ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారు. గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వీళ్లు చేసిన ప్రయత్నాలు చూశారు. కానీ మార్పు మార్పు అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ పాలనలో ఏం జరగుతున్నదో ప్రజల అనుభవంలో ఉన్నది. అందుకే ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సడలింది. వీళ్లు ఎంత ప్రభుత్వానికి డబ్బా కొట్టినా, గత ప్రభుత్వంపై నిందలేయాలని చూసినా వృథా ప్రయాసే అవుతుంది.
No comments:
Post a Comment