ఏపీలో సిట్టింగ్‌ల మార్పుతో 'ఫ్యాన్' గాలి వీస్తుందా?
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో అధికార వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీల రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. తెలంగాణలో ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై పడింది. సిట్టింగులను మార్చి ఉంటే తెలంగాణలో ఫలితాలు వేరేలా ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని నియోజకవర్గ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి అంటే ఆ అభ్యర్థికే దాదాపు అసెంబ్లీ టికెట్ ఖారారు అయినట్టు భావించాలి. జగన్ సుమారు 50 మంది ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం జరుగుతున్నది. పార్టీని వీడిన వాళ్లలో ఎక్కువ శాతం మంది అయితే జనసేన లేదా కాంగ్రెస్ పార్టీలోకి చేరాల్సిందే. ఎందుకంటే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ప్రకటించాయి. ఎన్నికల షెడ్యూల్ నాటికి ఏమైనా రాజకీయ పరిణామాలు మారొచ్చు అంటున్నారు. అదే జరిగితే జనసేనతో బీజేపీ జట్టుకట్టే అవకాశాలున్నాయి. ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరీ కూడా ఇప్పటికైతే జనసేనతో తమ పార్టీకి పొత్తు కొనసాగుతున్నది. పొత్తులపై తమ పార్టీ అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు.
పదేళ్ల కేంద్ర ప్రభుత్వం, విభజన తర్వాత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ, వైసీపీలు ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్నది వాస్తవం. ముఖ్యంగా రాజధాని విషయంలో, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలకం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నది. నాటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వంతో పాటు వాటిని సాధించడంలో టీడీపీ, వైసీపీ విఫలమయ్యాయి అన్నది ఆ పార్టీ విమర్శ. కాబట్టి ఏపీ ఎన్నికల తీర్పు ఈసారి ఏకపక్షంగా ఏ పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేవు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 'వోటా' సర్వే సంస్థ రెండు నెలలుగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ సంస్థ సీఈవో కంభాలపల్లి కృష్ణ కూడా ఏపీలో ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయని అంటున్నారు. దాదాపు 50 మంది సిట్టింగులను మార్చడం వల్ల వైసీపీ అందులో సగానికి పైగా గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ మార్చకుండా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకే జగన్ నష్టనివారణ చర్యలో భాగంగానే చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఎన్నికల నాటికి ఏపీలో ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
Comments
Post a Comment