బీజేపీ రాజకీయాలకు బలయ్యేది ఎవరు?


బీహార్‌లో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జేడీయూ-ఆర్జేడీ కూటమి కూలిపోయి బీజేపీ-జేడీయూ కొత్త ప్రభుత్వం ఆదివారం కొలువుదీరనున్నదనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ బీహార్ లో సంఖ్యాపరంగా చూస్తే బీజేపీ (74) జేడీయూ (43),హిందుస్థానీ అవామీ మోర్చా (4), వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (4), లోక్‌జన్‌శక్తి పార్టీకి ఒక్క స్థానం ఉన్నది. మొత్తం 243 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం. ఈ పార్టీలన్నీ కలిస్తే 126 అవుతుంది. అధిష్ఠానం, నితీశ్‌కుమార్‌ ఆలోచనలు ఎలా రాష్ట్రంలోల మాత్రం భిన్నపరిస్థితులున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ రాజకీయాల్లో ఎవరికీ శాశ్వతంగా తలుపులు మూసి ఉండవని చెప్పినా ఆపార్టీలోని కొందరు నేతలు మాత్రం నితీశ్‌ రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అధికారం కోసం నితీశ్‌ వ్యవహారశైలి వల్ల ఆయన పూర్తిగా బలహీనపడిపోయారన్నది వారి వాదన. బీజేపీ, జేడీయూల సంగతి పక్కనపెడితే చిన్నపార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ప్రశ్న. 


బీజేపీ-జేడీయూ ప్రభుత్వం ఏర్పడితే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నితీశే సీఎం. దీనికి ప్రతిగా రాష్ట్రంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి నితీశ్‌కుమార్‌ అంగీకరించినట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా బీజేపీ, జేడీయూ, లోక్‌జనశక్తి పార్టీ కలిసి పోటీ చేశాయి. మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీఏ 39 గెలచుకున్నది. అందులో బీజేపీ 17, జేడీయూ 16, లోక్‌జనశక్తికి 6 సీట్లు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీకి కూడా లోక్‌సభ సీట్లే కావాలి. అలాగే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదా బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాలే ఉండాలన్నది ఆపార్టీ పెద్దల భావన. అందుకే బీజేపీ యేతర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి పదేళ్లుగా ఆపార్టీ చేసిన ప్రయత్నాలు తెలిసిందే. తాజాగా కూడా మరోసారి ఆ ప్రయత్నాన్ని చేయనున్నది. ఎందుకంటే ఇండియా కూటమి కంటే బీహార్‌లో మహాఘట్‌బంధన్‌ కలిసి పోటీ చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో స్వీప్‌ చేస్తాయని బీజేపీ హైకమాండ్ అంచనా. అందుకే అక్కడ ఆ కూటమిని బద్దలు కొట్టి బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆదివారమే గవర్నర్‌ను కలిసి బీజేపీ-జేడీయూ ప్రభుత్వ ఏర్పాటునకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. 'కూటమి నుంచి నితీశ్‌ విడిపోతే మా తలుపులు తెరుస్తాం. మాకూ మెజారిటీ ఉన్నది' అన్న ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. నితీశ్‌ను మళ్లీ సీఎం కాకుండా చిన్నపార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ సన్నాహాకాలు చేస్తున్నది. 


 

ప్రస్తుతం ఆర్జేడీకి (75), కాంగ్రెస్‌కు (19)మంది శాసనభ్యులున్నారు. వీళ్లిద్దరు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటునకు ఇంకా 28 మంది సభ్యుల మద్దతు కావాలి. ఎన్డీఏలోకి నితీశ్‌రాకను హిందుస్థానీ అవామీ మోర్చా అధ్యక్షుడు జీతన్‌ రాం మాంఝీ,లోక్‌జన్‌శక్తి నేత చిరాగ్‌ పాశ్వాన్‌లు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మాంజీ పార్టీకి నాలుగు సీట్లు, ఎల్‌జేపీకి ఒక్క సీటు ఉన్నది. అలాగే  సీపీఐ (ఎంఎల్‌) ఎల్‌ (12), ఎంఐఎం (5) సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు సీట్లున్నాయి. బీఎస్పీ తరఫున ఒకరు,స్వతంత్ర అభ్యర్థిగా మరొకరు విజయం సాధించారు. ఆర్జేడీ అధినేత చిన్నపార్టీలతో సంప్రదింపులు జరుతున్నారని సమాచారం. అలాగే నితీశ్‌ వైఖరి పట్ల జేడీయూలోని కొంతమంది, బీజేపీలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, బలనిరూపణ సమయంలో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా ఉన్నాయి. సీఎం సీటు కోసం  ఆర్జేడీ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నందున బీహార్‌లో చివరికి ఏం జరుగుతుంది?బీజేపీ రాజకీయాలకు ఎవరు బలవుతారన్నది చూడాలి. ఇండియా కూటమిలో ప్రధాన్యం దక్కలేదని అలబూనిన నితీశ్‌కు రాష్ట్రంలోనూ ఉన్న పదవి తిరిగి దక్కుతుందా? లేక రెంటికి చెడ్డ రేవడి అవుతారా? అన్నది త్వరలో తేలనున్నది.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు