పుట్టిన పెరిగిన ప్రాంతమంతమంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. అందుకే మా కాలేరు (గోదావరి ఖని) అట్లనే ఉంటది. 80వ దశకంలో కోల్ బెల్ట్ ఏరియాలో ఉపాధి కోసం ఊళ్లను వదిలి వచ్చిన వాళ్లు లక్షల్లో ఉంటారు. అందుకే ఆ ప్రాంతంలో సింగరేణి గనుల్లో ప్రత్యక్షంగా లక్షకు పైగా మందికి ఉపాధి కల్పిస్తే పరోక్షంగా వేలాది మందికి ఆశ్రయం కల్పించింది. కానీ చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టి వీఆర్ఎస్ ఫలితంగా ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ.. ప్రస్తుతం సుమారు 40 వేల వరకు వచ్చింది. సంస్థ ఉత్పత్తి వేటలో పడి కార్మికుల సంక్షేమాన్ని మరిచింది. ఫలితంగా పదవీ విరమణ చేసిన కార్మికులు పది పన్నెండేళ్ల కంటే ఎక్కువగా బతకడం లేదు. దీనికి కారణం అక్కడ పెరిగిపోయిన కాలుష్యం.
అండర్ గ్రౌండ్ గనులు, ఓపెన్ కాస్టులకు తోడు ఎన్టీపీసీ, తాజాగా ఎఫ్ సీ ఐ వల్ల అక్కడ పర్యావరణలో చాలా మార్పులు వచ్చాయి. ఎండాకాలంలో ఏసీలు కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఉడుకపోతకు తోడు గాలిలో తేమ వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అక్కడి వాతావరణం అనుకూలించడం లేదు. ముఖ్యంగా అక్కడి కాలుష్యం వల్ల ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్యం వల్ల కోల్ మైన్స్ లో పనిచేసిన వారికి గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు కార్పొరేట్ హాస్పిటల్స్ లో సర్వీసులు అందడం లేదనే విమర్శలున్నాయి. సింగరేణి ఉత్పత్తి, అభివృద్ధిలో భాగస్వాములైన కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత సంస్థ యాజమాన్యంపై ఉన్నది.
కోల్ బెల్డ్ ఏరియాలో కొత్తగా ఉపాధి అవకాశాలు లేకపోయినా నష్టం లేదు. ఎందుకంటే డిపెండెంట్ ఉద్యోగాలు లేవన్న నాడే కార్మికులు వారి పిల్లలను ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్య కోర్సులు చదివించారు. దీంతో 90వ, 2000వ దశకం నుంచి అక్కడి విద్యార్థుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు చాలామంది యూత్ వారి వారి వృత్తుల్లో స్థిరపడ్డారు. అయితే ప్రస్తుతం రామగుండం, గోదావరిఖనిలో జరగాల్సిన పని ఒకటి ఉన్నది. అది ప్రజల భాగస్వామ్యంతో పాలకులు చేయాల్సింది ఏమింటే అక్కడ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మొక్కలు విరివిగా పెంచాలి. వాటిని సంరక్షించాలి. నీటి కాలుష్యాన్ని తగ్గించాలి. అక్కడి ప్రభుత్వ, సింగరేణి ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మంచి వైద్యం అందించాలి. అలాగే జూనియర్, డిగ్రీ కాలేజీలు కూడా పెరగాలి. పర్యావరణ పరిరక్షణ అనేది నినాదంగా కాకుండా విధానంగా మారాలి. ప్రజల్లో ఆ చైతన్యాన్ని పెంపొందించాలి. అప్పుడే ఆ పారిశ్రామిక ప్రాంతం నిజంగా ప్రగతి పథంలో నడిచినట్టు అవుతుంది.
(జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)
No comments:
Post a Comment