Tuesday, 10 June 2025

రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్

 రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది. కాళేశ్వరం కమిషన్  విచారణ తుది దశకు చేరుకున్నది. ఇప్పటికే ఈ కమిషన్ గడువును ఆరు సార్లు పొడిగించింది.  ఈ కమిషన్ కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5న ఆయన విచారణకు హాజరుకావాల్సింది. అయితే వాయిదా కోరడంతో నేడు  (జూన్ 11న) రావాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే బుధవారం మాజీ సీఎం కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనుంది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభంకానున్నది. ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. ఇప్పటివరకు మీడియా, కమిషన్‌లోని ఇంజినీర్ల సమక్షంలోనే విచారణ జరిగింది. 

కమిషన్ విచారణకు హాజరయ్యే ముందే కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతలు మంగళవారం మరోసారి సమావేశమై పలు అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. హరీశ్‌రావుతో కమిషన్‌ చర్చించిన విషయాలతోపాటు అదనంగా అడిగే అవకాశం ఉన్న అంశాల గురించి కూడా లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి  ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు బూర్గుల రామకృష్ణారావు భవన్‌ వద్దకు చేరుకుంటారని తెలుస్తోంది. 

ఈ పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వైఫల్యాలపై పోస్టులు పెడుతున్న ఆయనపై ప్రభుత్వం ఇప్పటికే 15 కేసులు నమోదు చేసింది. వివిధ కేసుల్లో ఆయన న్యాయస్థానాల ద్వారా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఆయా కేసుల్లో విచారణకు హాజరవుతున్నారు. హైకోర్టు అనుమతి తీసుకుని అమెరికా వెళ్లిన దిలీప్ కొణతం తిరిగి వస్తుండగా నిన్న హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడానికి కొన్ని గంటల ముందే దిలీప్ కొణతంను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని గులాాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూసి భయపడుతున్న కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని అంటున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తో రేవంత్ సర్కార్ ప్రశ్నించే గొంతులను అడ్డుకోలేదని దిలీప్ కొణతం సహా చాలామంది నినదిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇలాంటి కేసులు, నిర్బంధాలను అనేక ఎదుర్కొన్నామని, ఇవేవీ మాకు కొత్తకాదు అంటున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్ని కేసులు పెట్టినా ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తామంటున్నారు. మేము నిజం వైపే నిలబడుతామంటున్నారు.

No comments:

Post a Comment