Sunday, 15 June 2025

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు రంగం సిద్ధం




స్థానిక సంస్థల ఎన్నికలు నిర్ణీత గడువులోగా జరగకపోవడంతో ఏడాదికి పైగా స్పెషల్‌ అధికారుల పర్యవేక్షణ కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగడం లేదని, అభివృద్ధి పనులు జరగడం లేదని విపక్షాల విమర్శలకు తోడు తాము చేసిన పనులకు బిల్లులు రావడం లేదని మాజీ సర్పంచుల నిరసనలు జరుగుతున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ల ఖరారు అయ్యాకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ల బిల్లు కూడా పెట్టింది. 18 నెలల రేవంత్‌ సర్కార్‌ పాలనపై అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉన్నదనే వాదన ఉన్నది. అయితే రుణమాఫీ, ఏడాది కాలంలోనే 50 వేలకుపైగా నియామకాలు చేపట్టామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఫ్రీ కరెంటు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డులు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. రేపు లేదా ఎల్లుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఒకేసారి విడుదల చేసి స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కార్‌ క్లారిటీ ఇచ్చింది.

ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి  తెలిపారు. సోమవారం నిర్వహించే క్యాబినెట్‌ సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

స్థానిక ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని.. కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధం కావాలని పొంగులేటి సూచించారు. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్నారు. వారం రోజుల్లో ‘రైతు భరోసా’, సన్నాలకు బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు.

No comments:

Post a Comment