Sunday, 29 June 2025

35 ఏండ్ల నాయిన కల నిజమైన వేళ



ఎర్ర బండల కాడ భూమిలో బాయి తవ్వాలి. అక్కడ మూడున్నర ఎకరాల చెలక ను రెండు పంటల భూమిగా మార్చాలన్నది ఆయన కల. తద్వారా ఆర్థికంగా కొంత బలోపేతమైతే పుట్టి పెరిగిన ఊరిలో కొన్ని పనులు చేయాలి అన్నది ఆయన ప్లాన్. అప్పటికే సింగరేణి నౌకరీ చేస్తున్నా కుటుంబ పోషణతో పాటు తన తమ్ముళ్లు, చెల్లె, బంధువుల్లో కొంతమంది బాధ్యతలు తీసుకున్నాడు. అందుకే రాంనగర్ లోని మా ఇల్లు జనతా గ్యారేజ్ ని తలపించేది.

మనిషి ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది. అదే జీవితం. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. బ్రెయిన్ ట్యూమర్ (మెడికల్ అధ్యయనం ప్రకారం) వ్యాధి ఆయన ఆరోగ్యాన్ని కుంగదీసింది. ఆ వ్యాధి తో మూడేళ్ళు పోరాడారు. చివరికి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. అందుకే డాక్టర్లు కూడా ఈ పిడి స్ మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నదా,.చిన్నప్పుడు తలకు.గాయమైందా అని ప్రశ్నించారు. అవి చెప్తే తనకు ఆపరేషన్ చేయరేమో అని ఆ రెండు నిజాలను నాయిన దాచారు. ఫలితంగా ఆపరేషన్ ఫెయిల్ ఫాదర్ డెడ్. మా జీవితాలు మళ్ళీ జీరో కు వచ్చాయి. కానీ అవ్వ సంకల్పం మమ్మల్ని అనేక సమస్యల నుంచి బైట పడేసింది. నాయిన పోయాక మేము ఏమై పోతామో అన్న చాలామంది సందేహాలకు అవ్వ 20 ఏండ్ల తన కష్టంతో సమాధానం చెప్పింది. 

ఇల్లు కట్టినా మమ్మల్ని బాగా చదివించినా,మా పెండ్లిల్లు చేసినా ఏదో లోటు అవ్వను నిత్యం వెంటాడింది. అది ఒకటి నాయిన కల బాయి తవ్వడం. రెండోది గొల్ల పల్లి లో చిన్న ఇల్లు కట్టడం. అందులో మొదటి దానికి ఈ నెల 8న బీజం పడింది. జియాలజిస్ట్ సర్వే చేయడం పనులు మొదలు పెట్టడం చక చకా జరిగిపోయాయి. అన్న, నేను, చిన్నన వెంకయ్య, మా తమ్ముడు ఐలయ్య, తాత బండి ఓదెలు కొబ్బరి కాయ కొట్టి పనులు మొదలు పెట్టాం. మనం చేసే పనికి నలుగురి సహకారం దొరికితే ఆ సంతోషమే వేరు. మా బిడ్డలు రాజశేఖర్, చంద్రశేఖర్ (ఐలయ్య, మొండయ్య కొడుకులు) చేదోడు వాదోడుగా నిలిచారు. 


కొబ్బరికాయ కొట్టి అన్న, నేను వెళ్ళిన తర్వాత 13 తేదీ నుంచి 26వరకు అక్కడే ఉండి మొత్తం పనులు పర్యవేక్షణ చేసింది మా డైరెక్టర్ అక్షర కుమార్. సినిమా మేకింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ ఎక్కడ తను మెయింటెయిన్ చేశాడు. అందరినీ కో ఆర్డినేట్ చేస్తూ.. మాట్లాడుతూ, అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మాకు షేర్ చేస్తూ పని పూర్తి అయ్యి గుమ్మడి కాయ కొట్టే వరకు బాధ్యత తీసుకున్నాడు. ఏదైనా దిగితే తప్పా లోతు తెలువదు అంటారు కదా ఇల్లు కట్టినప్పుడు అన్నీ చూసుకున్నాం. మా ఇంట్లో పెండ్లిళ్ళు, ఫంక్షన్స్ అన్నీ పనులు చేసుకున్న అనుభవం మాది. కానీ బాయి తవ్వడం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు లోతుపాతులు అన్నీ అక్షర చూసాడు. పడుతూ లేస్తూ ఇక్కడి దాకా వచ్చిన మాకు మా అవ్వే అన్నీ. ఆమె బలంగా ఏదైనా కోరుకుంటే అది పూర్తి అవుతుంది మా నమ్మకం. బహుశా ఆమె సంకల్పానికి దైవం కూడా సహకరిస్తుంది అనిపిస్తుంది. నాయిన 35 ఏండ్ల కిందట జల సాకారం అయ్యింది అంటే అది అవ్వ, అక్షర పదిహేను రోజుల సహనం ఒకటి అయితే నాట్ నౌ నెవర్ అనుకున్న మా అభిప్రాయం కారణం. ఈ పదిహేను రోజుల ప్రయాణంలో చిన్న చిన్న ఆటంకాలు తప్పా సక్సెస్ ఫుల్ గా పని పూర్తి అయ్యింది. మా ఈ భగీరథ ప్రయత్నంలో మాకు అన్ని రకాలుగా సహరించిన మా కొడుకు బండి శ్రీనివాస్ (జేసీబీ ఓనర్) మా అల్లుళ్లు గెల్లు శేఖర్, గెల్లు అజయ్, జేసీబీ ఆపరేటర్ మహేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.

No comments:

Post a Comment