Friday, 6 June 2025

ఉద్యమకాలంలో ఉద్వేగం నింపిన పత్రిక





నమస్తే తెలంగాణ ఆవిర్భావం రవీంద్రభారతిలో జరిగింది. 6-6-2011న ఆ పత్రిక ప్రారంభోత్సవానికి కేసీఆర్‌, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌, అప్పటి ఎడిటర్‌ అల్లం నారాయణ, సీఈవో కట్టాశేఖర్‌ రెడ్డి, ఎండీ సీఎల్‌ రాజం తదితరుల చేతుల మీదుగా నమస్తే  తెలంగాణ పేపర్‌ ప్రతి విడుదలైంది. 2007లో ఆంధ్రజ్యోతిలో జర్నలిజం విద్యార్థిగా మొదలు పెట్టి ట్రైనింగ్‌ పూర్తికాగానే కొన్ని రోజులు (బహుశా 15 రోజులే అనుకుంటా) రంగారెడ్డి డెస్క్‌ లో సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన. ఆ తర్వాత మా జర్నలిజం ప్రిన్సిపల్‌ సూచన మేరకు ఆంధ్రజ్యోతి ఎడిట్‌ పేజీలో పనిచేయడానికి ఎడిట్‌పేజీ డెస్క్‌ కు మారాను. జర్నలిజంలో నేర్చుకున్న దానికంటే ఎడిట్‌ పేజీలో వచ్చే ఆర్టికల్స్‌ (మేమే ప్రథమ పాఠకులం మా జ్యోతింద్రనాథ్‌ అన్నట్లు) ద్వారా అనేక విషయాలపై అవగాహన పెరిగింది. మా సీనియర్లు, మా బ్యాచ్‌ వాళ్లు జిల్లాల్లో, సెంట్రల్‌ డెస్క్‌ లో పనిచేస్తుంటే నేను మాత్రం ఎడిట్‌ పేజీలో చేయడం ప్రారంభంలో కొంత అసంతృప్తి ఉండేది. కానీ అది తాత్కాలికమే అయ్యింది. 


అప్పటి నుంచి నమస్తే తెలంగాణలో 2011 ఏప్రిల్‌ చేరే వరకు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఎడిట్‌ పేజీలో పనిచేస్తున్న కాలంలోనే వేణుగోపాల స్వామి తో పరిచయం. వర్తమాన, సామాజిక అంశాలపై సార్‌ నిత్యం చెప్పేవారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని సొంత పార్టీ, సొంత పత్రిక ఉండాలని జయశంకర్‌ సార్‌ నొక్కి చెప్పేవారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో సీమాంధ్ర యాజమాన్యంలో నడుస్తున్న పత్రికలు  అసత్యాలు ప్రచారం చేసేవి. వాటికి కౌంటర్‌ ఇచ్చే తెలంగాణ పత్రికలు అంతగా లేవు. అల్లం నారాయణ ఎడిటర్‌గా, కట్టా శేఖర్‌ రెడ్డి సీఈవోగా నమస్తే తెలంగాణ పత్రిక రానున్నదని తెలిసింది. అయితే అప్పటికి తెలంగాణ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ సమయంలో నమస్తేలో పనిచేయడానికి చాలామంది సీనియర్లు సాహసం చేయలేదు. తెలంగాణను బలంగా కోరుకునే కొంతమంది నమస్తేలో జాయిన్‌ అయ్యారు. ఆ సమయంలోనే వేణుగోపాల స్వామి సార్‌ జ్యోతికి రిజైన్‌ చేసి అక్కడికి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లిన కొన్నిరోజులకు నన్ను రమ్మని అడిగారు.  ఎడిట్‌పేజీలో పనిచేయడం వల్ల అల్లం నారాయణ, కట్టాశేఖర్‌ రెడ్డి సార్లతో పాటు కృష్ణమూర్తి (అప్పటి సెంట్రల్‌ డెస్క్‌ ఇన్‌ ఛార్జి, ప్రస్తుత విజయక్రాంతి ఎడిటర్‌), మార్కండయ (నెట్‌వర్క్‌  ఇన్ ఛార్జి, ప్రస్తుత దిశ పేపర్ ఎడిటర్) కి నేను కొత్తగా పరిచయం చేసుకునే అవకాశం రాలేదు. వేణుగోపాల స్వామి గారు నా కోసం గట్టిగా ప్రయత్నించడం వల్ల అక్కడికి వెళ్లాను. అదే సమయంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా ఉన్న కె. శ్రీనివాస్‌ సార్‌కు వెళ్తాను అనగానే ఆలోచించు అన్నారు కానీ వద్దని అనలేదు.


అలా నమస్తే అడుగుపెట్టిన నాకు అనతికాలంలోనే చాలామందితో సన్నిహితం పెరిగింది. ఆ పత్రికలో పనిచేయడం ఆ సమయంలో ఒక ఉద్వేగం. ఎందుకంటే తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు, లోక్‌సభలో, రాజ్యసభలో బిల్లు పాసైనప్పుడు ఆఫీసు ముందు సంబరాలు చేసుకున్నాం. ఎడిట్‌ పేజీ, న్యూస్‌ ద్వారా అనేక వాస్తవ అంశాలను నమస్తే తెలంగాణ  పాఠకుల దృష్టికి తీసుకెళ్లింది. అందుకే అనతి కాలంలో ఆ పత్రికకు మంచి ఆదరణ దక్కింది. ఎడిట్‌ పేజీలో పనిచేస్తూనే 'రైతుబడి' ద్వారా రైతులకు వ్యవసాయంలో  ఆధునిక పద్ధతులు, సక్సెస్‌ స్టోరీలు అందించాం. నమస్తే లో పనిచేస్తున్న సమయంలోనే దీక్షాదివస్‌, రాష్ట్ర ఆవిర్భావం మొదలు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక ఘట్టాలపై ఆర్టికల్‌ రాసే అవకాశం నాకు దక్కింది. ఆ పత్రికతో నాది  దాదాపు తొమ్మిదేళ్ల (2011-2020) ప్రయాణం. ఆ తర్వాత డిజిటల్‌ మీడియాలోకి మారాను.  కెరీర్‌లో అక్కడ పనిచేసిన కాలంలో ముఖ్యంగా 2011-2016 వరకు చాలా సంతృప్తి కలిగింది. ఎందుకంటే కొన్ని నమస్తే తెలంగాణ మాత్రమే రాయగలదు అన్నది అప్పుడు రుజువువైంది. ఆ పత్రిక పురుడు పోసుకుని 14 ఏండ్లు అవుతున్న సందర్భంగా అనేక జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడాయి. అందుకే కొన్ని అంశాలను రాసే ప్రయత్నం చేసిన. నమస్తే తెలంగాణ మిత్రులకు పత్రిక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు


-ఆసరి రాజు, ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌

No comments:

Post a Comment