అనుకోకుండా వచ్చిన జర్నలిజం వృత్తిలో చాలా విషయాలు నేర్చుకున్నాను. రాయడంలో మెళకువలు చెప్పిన పెద్దలు చాలామంది ఉన్నారు. కొవిడ్ సమయంలో ఉద్యోగాన్ని వదిలి కొంతకాలం రెస్ట్ తీసుకున్నాను. ఆ సమయంలోనే నా బ్లాగ్ లో నిత్యం నా అభిప్రాయాలు రాసేవాడిని. హుజురాబాద్ ఉప ఎన్నిక, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అనేకం రాసిన. ఆ సమయంలో ఫీల్డ్‌లో ఉండి క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకున్న మా కామెర నవీన్, యాకయ్యలు ఇచ్చిన ఇన్ పుట్స్ చాలా ఉపయోగపడినాయి. 2018లో 88 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్న కేసీఆర్‌కు ఆ ఉప ఎన్నిక ఫలితం కొంత చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి మళ్లీ నగరానికి చేరాను. ప్రారంభంలోనే కొన్నిరోజులు నవీన్ రూమ్ లోనే ఖాళీగా ఉన్న సమయంలోనే మా కట్టా శేఖర్ రెడ్డి సార్ 'విధాత'లో పనిచేయమని చెప్పాడు. అప్పటికి ఆ వెబ్‌సైట్ రొద్దం శ్రీనివాస్ అన్న చూస్తున్నారు. అలాస మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన. ఆ సమయంలో అనేక ఆర్టికల్స్ రాసే అవకాశం లభించింది.
అలా సాగుతున్న ప్రయాణం సమయంలోనే ఒకరోజు ఎర్రోజు శ్రీనివాస్ అన్న తన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పారు. స్టార్ట్ చేసిన తర్వాత కంటెంట్ విషయం, వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ వంటి సమాచారం చెప్పారు. నువ్వు కూడా మొదలుపెట్టు. వ్యూస్ గురించి పట్టించుకోవద్దు. రోజూ ఛానల్‌ను యాక్టివ్‌లో ఉంచాలి. వార్తలు, విశ్లేషణలు నిత్యం ఉండేలా చూసుకోవాలి. ఆటోమేటిక్‌గా ఛానల్ పుంజుకుంటుంది అని చెప్పారు. రాయడం అలవాటు ఉన్న నాకు యూట్యూబ్‌లో వీడియోలు చేయడం కంటే ఆ కంటెంట్‌నే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రీల్ చేసి అప్‌లోడ్ చేసిన. ప్రారంభంలో కొంత నెమ్మదించినా క్రమంగా వ్యూస్ పెరిగాయి. వ్యూస్ బాగా రావడంపై ఎర్రోజు శ్రీనివాస్ అన్న, డాక్టర్ పారిపెల్లి శంకర్ సార్ లతో ఉన్న చర్చకు వచ్చింది. యూట్యూబ్ కంటెంట్‌లో నీదో పద్ధతి. అది కూడా కొంతమందికి నచ్చుతున్నది. అందుకే ఛానల్‌కు కొత్త సబ్‌స్క్రైబర్స్ తో పాటు వ్యూస్ వస్తున్నాయి. గో ఎహెడ్ అని ప్రోత్సహించారు.
నా యూట్యూబ్ ఛానల్ గురించి ఎన్నడూ వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోలేదు. ఇటీవల నా హితం కోరే కొంతమంది స్నేహితులకు లింక్ షేర్ చేసి సబ్‌స్క్రైబ్ చేయడంతో పాటు అభిప్రాయం చెప్పమని కోరాను. వాళ్లంతా సానుకూలంగా స్పందించారు. కొన్ని సూచనలు చేశారు. వెయ్యి మంది సబ్‌స్క్రైబర్స్ అయ్యాక ఈ జర్నీ గురించి రాద్దామని అనిపించింది. 970కి పైగా సబ్‌స్క్రైబర్స్ వచ్చాక ఛానల్ పై చిన్న వీడియో ఒకటి వాట్సప్ లో షేర్ చేసిన. అలాగే తెలంగాణలో నియోజకవర్గాల పెంపుపై వీడియో చేసిన ఒక లింక్ ఒకటి కూడా షేర్ చేసిన. చాలామంది మిత్రులు సబ్‌స్క్రైబ్ చేసి మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు.
మనం ఏదీ ఆశించకుండా ఒక ప్రయత్నం మొదలుపెడితే దానికి మన వెల్ విషర్స్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. యూట్యూబ్ అనగానే థంబ్ నెయిల్స్, కాంట్రవర్సీ కాలంలో ఛానల్‌ను మంచి కంటెంట్‌తో నడపడం కత్తి మీద సామే. కానీ వ్యక్తిగత భావ స్వేచ్ఛలో భాగమైన ఈ మాధ్యమానికి బారికేడ్లు మనమే పెట్టుకోవాలన్నది నా అభిప్రాయం. మనం రాసే రాతలు అయినా, వీడియోలు అయినా ఇతరులకు నష్టం చేయకుండా ఉంటే అదే చాలు. ప్రారంభంలో చెప్పినట్టు అనుకోకుండా వచ్చిన ఈ వృత్తి ప్రస్థానంలో ఇది మరో మైలురాయి. నవలోకాన్ని స్వప్నించిన నాకు కాలం నిర్మించిన రహదారి 2025. థాంక్స్ టు ఆల్ మై సబ్‌స్క్రైబర్స్
No comments:
Post a Comment