అన్న కొడుకు చంద్రశేఖర్ పెండ్లి చూపుల చర్చ మూడు రోజులుగా జరిగింది. చివరికి ఆ ఘడియ నేడు రానే వచ్చింది. పెండ్లి చూపులు, మాట ముచ్చట సిటీ కి పల్లెటూరి వాతావరణానికి చాలా తేడా స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా అక్కడి వచ్చిన వాళ్లలో చాలామంది తరుచూ ఎక్కడో ఒక చోట కలుసుకోవడమో, కొంతమంది కామన్ బంధువులు ఉండటమో జరుగుతుంది. అందుకే మాట ముచ్చటే సందడిగా కనిపించింది. గొల్లపల్లి టూ గంగిపెల్లి ఎపీసోడ్ పాత తరం పెండ్లి చూపులను తలపించింది. ఎంత ఆధునిక యుగం వచ్చినా, సెల్‌ఫోన్‌లోనే ప్రపంచాన్ని దర్శించినా మానవసంబంధాలను అవేవీ భర్తీ చేయలేవు. మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి నేర్పించలేవు.
పిల్లనిచ్చే ముందు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలన్నది నానుడి. కానీ వచ్చిన వాళ్లను ఎలా అర్సుకున్నాం. వాళ్ల అభిమానం పొందామన్నది నేటి నానుడి. మూడు ముళ్ల బంధానికి ముందే రెండు కుటుంబాల సంబంధ బాంధవ్యాలు దానికి బాటలు వేస్తుంది. తెలంగాణలో పెండ్లే కాదు సుట్టాలు వచ్చినా, మాట ముచ్చట మాట్లాడుకున్నా మర్యాద చేయడం ఆనవాయితీ. పెండ్లికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపి చేయి కడగడానికి ముందు జరిగే చర్చలు సంపూర్ణం కాగానే ఆ సంతోషాన్ని స్వీటుతో, ముందుతో సెలబ్రేట్ చేసుకోవడమే.
చాలారోజుల తర్వాత ఈ పెండ్లి చూపుల తతంగంలో భాగమవడమే కాదు ఆసాంతం చూసిన తర్వాత అక్కడ చూసిన భావోద్వేగాలు, పెద్దల అభిప్రాయాలు చూసిన తర్వాత నాలుగు విషయాలు రాయాలని అనిపించింది. నిజానికి ప్రతి మనిషి ఒక యూనిక్. ప్రతి మనిషి జీవితం ఒక కథ. అన్న మొండయ్య కొడుకు పెండ్లి కుదర్చడానికి చేసిన ప్రయత్నంతోపాటు మాట ఇచ్చిన కాబట్టి దానికే కట్టుబడి ఉండటం విశేషమే. మన అభిప్రాయం అందరికీ నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. కానీ పెండ్లి అంటే కట్నకానుకలు మాత్రమే కాదు మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆయన నమ్మకం. దీనిపై మేం కొన్ని అంశాలపై విభేదించినా అంతిమంగా వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెండ్లి చేయాలనే నానుడిని చివరికి అందరూ నిజం చేశారు. ముందే చెప్పినట్టు ఈ మూడు పెండ్లి చూపుల తతంగం పాత తరాన్ని మరిపించింది. చాలారోజుల తర్వాత మా ఆసరి కుటుంబలోని చాలామందిని ఒక్కచోటికి చేర్చింది. 80లలో పడిన పెద్దనాయిన రాజయ్య చిన్నాన్నలు గట్టయ్య, ఓదెలు, అయిలయ్య, వెంకయ్యలు ఒక చోట కనిపించారు. మా తరం మా అయిలయ్య, నేను, శ్రీనన్న, రాజన్న, మా అక్షర కుమార్, మా తమ్ముళ్లు ఇద్దరు కుమార్‌లు,వెంకన్న కొడుకు రాజశేఖర్, అయిలయ్య కొడుకు రాజశేఖర్, కాబోయే వరుడు చంద్రశేఖర్, పెద్దవ్వ, మా అవ్వ, చిన్నమ్మలు, వదినలు, బంధువులమంతా ఇవాళ ఒక ఫ్రేమ్‌లో ఒదిగిపోయాం.
No comments:
Post a Comment