Thursday, 5 June 2025

వివాదాస్పద వ్యాఖ్యలు.. విమర్శలొచ్చాక వివరణలు

 ఈ మధ్య నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రప్రసాద్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయన కూతురు చనిపోయిన బాధలో ఉన్నారని అందుకే  ఆయన అలా వ్యవహరిస్తున్నారని అలీ వివరణ ఇచ్చారు. అన్నివర్గాల నుంచి  ఆయన వ్యవహారశైలిపై, వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ తన వ్యాఖ్యలపై విమర్శల నేపథ్యంలో ఎమోషనల్‌గా స్పందించారు. ఇకపై ఎవరినీ 'నువ్వు' అని పిలవనని, అందరినీ గౌరవంగా 'మీరు' అని సంబోధిస్తానని వాగ్దానం చేశారు.

అయితే బూతులు మాట్లాడటం, సినిమా ఫంక్షన్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజేంద్రప్రసాద్ తోనే మొదలు కాలేదు. ఆయనతోనే ముగిసిపోవు. అయితే జనంలో ఉన్నప్పుడు  ఎలా మాట్లాడన్నలన్న సోయి వాళ్లకు ఉండకపోవడమే దీనికి కారణం అంటున్నారు. పైగా తాము స్టార్స్ అని, మేము ఏమి మాట్లాడినా చెల్లుతందనే భావనలో కొంతమంది ఉంటారని పౌర సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. సినిమా, క్రికెట్, రాజకీయ నాయకులంటే ప్రజలకు  కొంత అభిమానం ఉంటుంది. అందుకే వాళ్లను అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే వీళ్లు అందరికీ  ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది నటుల తీరుతో జనాలు విస్తుపోతున్నారు.

రాజేంద్రప్రసాద్  అయితే ఒకసారి కాదు  ఇటీవల కాలంలో వరుసగా నోటికి వచ్చినట్లు మాట్లాడి వార్తల్లో నిలిచారు. అంతా అయిపోయాక ఇప్పుడు అందరినీ గౌరవంగా మీరు అని పిలుస్తానని వివరణ  ఇచ్చారు. ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది. ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా నటుడిగా ముఖ్యంగా తన కామెడీతో అందరి అభిమానం పొందిన  ఆయన ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో అభాసుపాలయ్యారు. ఆయనపై ఉన్న గౌరవాన్ని ఆయనే తగ్గించుకున్నారు. ఇంత జరిగాక పశ్చాత్తపపడ్డ ఆయన ఇక నుంచైనా పద్ధతిగా ఉంటారని  ఆశిద్దాం. 


No comments:

Post a Comment

Featured post

రేవంత్‌ రాజకీయాలకు కోదండరామ్‌ బద్నాం

'కొంతమంది తమకు తాము ఎక్కువగా ఊహించుకుంటారు' అనిప్రొఫెసర్‌ కోదండరామ్‌ను ఉద్దేశించి కేసీఆర్‌ అప్పట్లో ఓ కామెంట్‌ చేశారు. దీనిపై చాలామం...