కూటమిలో విభేదాలు.. ఒంటరి పోరుకు సిద్ధపడుతున్న పార్టీలు
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఎవరి దారి అవి చూస్తుకుంటున్నాయి. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీపార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఫలితాల అనంతరమే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మమతా ఒంటరిగానే వెళ్తామని ప్రకటించిన కొద్దీసేపటికే పంజాబ్‌లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌మాన్ వెల్లడించారు. పంజాబ్‌లోని 13 నియోజకవర్గాల్లోనూ ఆప్ బరిలోకి దిగుతుందన్నారు. దీనికోసం 40 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశాం. సర్వే చేసిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. ఆప్ పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధపడింది అంటే ఢిల్లీలోనూ ఆపార్టీ అదే విధానాన్ని అనుసరిస్తుంది. ఎందుకంటే ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు తెలియకుండా భగవంత్‌మాన్ ఆ ప్రకటన చేయలేరు.
ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు చేస్తున్నది. అయితే మమతా బెనర్జీ మొదటి నుంచి ఒకటే ప్రతిపాదన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 300 స్థానాల్లోనే పోటీ చేయాలని, బెంగాల్‌లో తనకు, పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ కు, యూపీలో అఖిలేశ్‌కు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ క్రమంలో బెంగాలోని 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు మాత్రమే ఇవ్వాలని టీఎంసీ భావించింది. దీనికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. అలాగే ఈ విషయంపైనే కాంగ్రెస్, టీఎంసీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ ఛౌదర్ 'ఆమె అవకాశవాది అని, మమతా సహాయంతో మేము ఎన్నికల్లో పోటీ చేయం . సొంతంగా పోటీ చేయడం ఏమిటో మా పార్టీకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే మమతా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలి' అని మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధీర్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తప్పుపట్టారు. 'మమత తనకు అత్యంత ఆత్మీయురాలని, మా వాళ్లు కొన్నిసార్లు ఏదోఏదో మాట్లాడుతుంటారు. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని' సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అధీర్ రంజన్ మమతా బెనర్జీపై వ్యాఖ్యలు చేయడం ఇవ్వాల కొత్తకాదు. కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను కట్టడి చేయలేదు. ఫలితంగా పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు మమత లేకుండా ఇండియా కూటమిని ఊహించలేని ఆ పార్టీ అంటున్నది. కానీ ఎస్పీ, టీఎంసీ, ఆప్‌లు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో సఖ్యతతోనే ఉంటున్నా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకుల వ్యవహారశైలి వల్ల ఆ పార్టీలు కాంగ్రెస్‌కు దూరంగా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ కమల్‌నాథ్ వ్యవహారశైలి వల్లనే ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు కుదరలేదు. ఈ విషయాన్ని రాహుల్ గాంధే పరోక్షంగా ప్రస్తావించారు.
కేంద్రంలో బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ అధిష్ఠానం కూటమిలోని భాగస్వాములతో సీట్ల సర్దుబాటుపై సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నది. సాధ్యమైనంత వరకు ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట సీట్ల త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నది. కానీ ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాల దూకుడు చర్యల వల్ల పొత్తులకు విఘాతం కలుగుతున్నది. బీజేపీ కోరుకుంటున్నట్టే కొంతమంది కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇండియా కూటమిలో విభేదాలకు ప్రాంతీయ పార్టీల కారణం ఎంతున్నదో అంతకంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల వ్యాఖ్యలే కారణమన్నది ఇటీవల జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తోంది. నిజానికి బీజేపీ నేరుగా ఎదుర్కొని అధికారంలోకి రాగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైతే లేదు. ఎందుకంటే యూపీ, బెంగాల్, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకుని వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేస్తే త్రిముఖ పోరులో అంతిమంగా కాషాయపార్టీ లబ్ధి పొందుతున్నదని గత రెండు సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనే కాదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తేలింది. ఇండియా కూటమి ఛైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేనే ఎన్నుకున్నాయి. దీంతో కూటమిలో విభేదాలు పరిష్కరించడం, సీట్ల సర్దుబాటుపై ఆపార్టీ పైనే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ఏది పడితే అది మాట్లాడటం వల్ల కూటమి లోని పార్టీలో ఒక్కొక్కటిగా సొంతంగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ, టీఎంసీ, ఆప్‌లు నిర్ణయానికి వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నాటికి కూటమిలో విభేదాలు పరిష్కరించుకుని, సీట్ల సర్దుబాటుపై అన్నిపార్టీలు ఒక అభిప్రాయానికి రావాలి. దానికి కాంగ్రెస్ పార్టీనే కృషి చేయాలి. అప్పుడే బీజేపీని నిలువరించడం సాధ్యమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా కూటమిలోని పార్టీలు ఒంటరిగా వెళ్తే నష్టం జరుగుతుందని అంటున్నారు.
Comments
Post a Comment