ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు
రాష్ట్రంలో ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు మార్పు కోరుకున్న మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిలో పేర్లు, చిహ్నాల మార్పేనా? ఉద్యమకాలంలో తెలంగాణ ఆకాంక్షలు, హక్కుల కోసం కొట్లాడిన వాళ్లు, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోనూ వాటి సాధన కోసం పోరాడిన వాళ్లు, మాట్లాడిన వాళ్లకు ఈ ప్రభుత్వంపై ప్రారంభంలోనే కొన్ని భయాలు కలిగాయి. తెలంగాణ అస్తిత్వం, రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా సీఎం సహా, మంత్రులు మాట్లాడిన తీరే దానికి కారణం. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటారు. జిల్లాలు కుదిస్తామంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అంటారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు ,నిధులు, నియామకాల కోసం జరగలేదంటారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది వీటి కోసం కాదు కదా. గత ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటిని సవరించాలంటున్నారు. లోపాలు ఉంటే సరిదిద్దాలంటున్నారు. కేసీఆర్ వ్యతిరేక అజెండానే తమ లక్ష్యమనే విధంగా కాంగ్రెస్ చేస్తున్న రాజకీయం వల్ల రాష్ట్రం చాలా కోల్పోవాల్సి వస్తుందనే విషయాన్ని ప్రస్తుత పాలకులు విస్మరిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ తెచ్చిన పథకాలు, నిర్మించిన ప్రాజెక్టులన్నీ పనికిరావనే ప్రచారం చేస్తూ తామేదో గొప్పగా రాజకీయం చేస్తున్నామని జబ్బలు చరుచుకొంటున్నది. సాగు నీటి ప్రాజెక్టుల విషయంపై అవగాహనారాహిత్యంతో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలను పణంగా పెడుతూ రాష్ట్రానికి ఎంత లాస్ చేస్తున్నారో తెలియడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డలో ఫీలర్ల కుంగుబాటు, సుందిళ్ల, అన్నారంలలో ఏర్పడిన సీపేజీలు, పగుళ్లు, బ్యారేజీలలో నిర్మాణ లోపాలపై ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ దానిపై విచారణ చేస్తున్నది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా మధ్యంతర నివేదిక ఇచ్చింది. పూర్తిస్థాయి నివేదిక వచ్చేలోగా దెబ్బతిన్న ప్రాజెక్టులకు మరమ్మతులు చేయాలని ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దీన్ని రాజకీయంగా వాడుకున్నది. అధికారంలోకి వచ్చాక అదే రాజకీయం చేస్తున్నది. వానకాలానికి ముందే చేయాల్సిన మరమ్మతు పనులపై అలసత్వం ప్రదర్శించడంతో ఆలస్యమైంది. ఇప్పుడు ఆశించిన మేర పనులు కావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే నిదర్శనం.
ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు, ఉద్యమకారుల భయానికి కారణం కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం.ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం. కేంద్రంలో గత రెండు సార్వత్రిక ఎన్నికల వలె బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడం, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీనే కీలకంగా మారడం. ఇక ఢిల్లీలో బాబు మాటకు ఇక తిరుగుండదు. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అనుమతులు లేని నీటిపారుదల ప్రాజెక్టులున్నాయి. తెలంగాణలో చాలావరకు అసంపూర్తిగానే ఉన్నాయి. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని గాలికి వదిలింది. రాష్ట్రావిర్భావం తర్వాత కేసీఆర్ కాళేశ్వరంతో సహా వాటిని ప్రారంభించారన్న ఒకే ఒక్క కారణంతో ఇప్పుడు వాటిని వదిలేసి కొత్తవి కడుతామంటున్నది. తెలంగాణ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం కొర్రీలు పెడితే బాబుకు వ్యతిరేకంగా రేవంత్ నిలబడగలరా? అలాగే విభజన చట్టంలో కృష్ణ, గోదావరి నీటి జలాల పంపిణి కి సంబంధించి తెలంగాణ లేవనెత్తిన అంశాలను నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ సర్కార్ పట్టించుకోలేదు. అనుమతులు లేకుండానే అనేక ప్రాజెక్టులు చేపట్టారని వాటికి నీటి కేటాయింపులు వద్దంటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన కారణంగా కేటాయిస్తున్నామని చెప్పి తెలంగాణ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఏపీలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఆగమేఘాల మీద పూర్తి చేస్తారు.
అలాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు త్వరలో రావచ్చు. ఈ ట్రిబ్యునల్ కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలకు (ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర)లకు పంచింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది కాబట్టి నాలుగు రాష్ట్రాలకు సమానంగా జలాలు పంచాలన్న తెలంగాణ వాదనకు కర్ణాటక, మహారాష్ట్రలు మద్దతు తెలుపుతూనే.. ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి నుంచే వాటిని పంచాలంటున్నది. దీనికి గత టీడీపీ, మొన్నటివరకు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అంగీకరించలేదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే లోగానే ఈ అనుమతి లేని ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి. లేదంటే ట్రిబ్యునల్ ఒక్కసారి నీటి కేటాయింపులు చేస్తే దాదాపు 50 ఏండ్లదాకా అది మారదు.
కేంద్ర ప్రభుత్వ మనుగడ టీడీపీ మద్దతుపై ఆధారపడి ఉన్నది. అందుకే ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తిచేసి.. ఇదిగో మా వద్ద ఇన్ని ఉన్నాయని చూపి నీటి కేటాయింపులు ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. కృష్ణా నది పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువ ఉన్నా.. నీటి నిల్వ సామర్థ్యం లేకనే ఇప్పుడు 40 శాతం నీటివాటాకు ఒప్పుకోవాల్సి వచ్చింది. పట్టింపులకు పోకుండా వెంటనే ప్రాజెక్టులు పూర్తి చేయకుంటే అదే వాటా శాశ్వతం అవుతుంది. ఇదే సమయంలో అటు ఏపీలో బాబు తన రాజకీయ చాతుర్యంతో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువ చూపి నీటి వాటాలు ఎక్కువ కొట్టేసే ప్రమాదం లేకపోలేదు. ఇలా తెలంగాణకు అనేక ప్రమాదాలు పొంచి ఉంటే సీఎం, మంత్రులేమో అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆ ప్రాజెక్టులు ఆపేస్తం.. ఈ ప్రాజెక్టులు కూలగొడతమంటున్నారు. అవి కూలగొట్టి కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే కేంద్ర వేగంగా అనుమతులు ఇస్తుందా? ఆ ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తి కావాలి? తెలంగాణ నీటి వాటాలు సాధించేదెన్నడు? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఉన్నవాటిని భద్రం చేసుకొని తెలివిగా నీళ్లు సంపాదించుకురావటానికి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నారు.
వీటన్నింటికంటే రేవంత్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం తెలంగాణకు చాలా నష్టం చేస్తుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో సంప్రదింపులు నిర్వహించింది. అప్పుడే ఉత్తర్వులు కూడా వస్తా యని భావించారు. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో నియామక ప్రక్రియ తాత్కాలికంగా నిలి చిపోయింది. 1987 బ్యాచ్ కు చెందిన ఆదిత్యనాద్ దాస్ ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కాగ్యాదర్శిగా పనిచేశారు. 2021 సెప్టెంబరులో పదవీ విరమణ చేశారు. ఇటీవలి వరకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పనిచేశారు. వైఎస్ హయాంలో చేపట్టిన జలయజ్ఞనం ధన యజ్ఞమని నాడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డే అసెంబ్లీ వేదికగా విమర్శించారు. ఇవాళ సీఎంగా అయ్యాక నాటి నీటిపారుదల ముఖ్యకార్యదర్శిగా పనిచేసి, పదేళ్లుగా సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆదిత్యనాథ్ దాస్ సలహాదారుగా నియమించి రేవంత్ ప్రభుత్వం ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నది? రేవంత్ రెడ్డి అన్నట్టు తెలంగాణ ఉద్యమం నీళ్లు , నిధులు, నియామకాల కోసం జరగలేదని భావించాలా? రాష్ట్ర ముందున్న అనేక సమస్యలపైఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తీసుకోబోయే తక్షణ నిర్ణయాలను బట్టే తెలంగాణ భవిష్యత్తు నిర్ణయమవుతుంది. తస్మాత్ జాగ్రత్త
Comments
Post a Comment