కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?


    వరుసగా మూడోసారి నరేంద్రమోడీ  ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2014,2019లో సొంతంగా మెజారిటీ సాధించడంలో మంత్రివర్గ కూర్పులోనూ తన మార్క్‌ను చూపెట్టారు. అయితే పదేళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రాంతీయపార్టీలే కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే  71 మంది మంత్రులతో మోడీ 3.0 సర్కార్‌ కొలువుదీరింది. ఇందులో 30 మంది క్యాబినెట్‌ హోదా, 5 స్వతంత్ర హోదా, 36 మంది సహాయమంత్రులు.  ఈ కూర్పులోనూ ఒకవైపు సంకీర్ణ ధర్మం పాటిస్తూ  ఐదు మిత్రపక్షాలకు హెచ్‌డీ కుమారస్వామి  (జేడీఎస్‌), చిరాగ్‌ పాశ్వాన్‌ (ఎల్‌జేపీ-రాంవిలాస్‌ పాశ్వాన్‌), జితన్‌ రామ్‌ మాంఝీ (హెచ్‌ఏఎం-సెక్యులర్‌) రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (జేడీయూ), కింజారపు రామ్మోహన్‌నాయుడు (టీడీపీ) ఒక్కో కేబినెట్‌ పదవి కట్టబెట్టారు. 


    పార్టీ విధేయులకే పెద్దపీట వేసినట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో కిషన్‌రెడ్డి, సంజయ్‌లనే తిరిగి క్యాబినెట్‌లో తీసుకోవడం, ఏపీలోనూ మూడు దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు చోటు దక్కడమే దీనికి నిదర్శనం. అలాగే ఈ ఏడాది, వచ్చే ఏడాది  బీహార్‌, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ సొంతంగానే అధికారంలోకి వచ్చి రాజ్యసభల తన బలం పెంచుకోవడానికి ఈ  రాష్ట్రాలకు కేబినెట్‌లో పెద్దపీట వేసింది. బీహార్ నుంచి నలుగురికి కేబినెట్ హోదా కల్పించింది. అందులో మిత్రపక్షాల సభ్యులు ముగ్గురు ఉండగా.. ఒకరు బీజేపీ. దీంతోపాటు ఈ రాష్ట్రం నుంచి 4 సహాయ మంత్రుల ను తీసుకున్నది. దీనిలో జేడీయూ ఒకటి కేటాయించి మిగిలిన 3 బీజేపీ సభ్యులకు ఇచ్చింది. ఎన్డీఏలో టీడీపీ తర్వాత జేడీయూనే అతి పెద్ద పార్టీ. అయితే ఆయన వ్యవహారశైలి కాషాయ నేతలకు కొత్త కాదు. అందుకే అదే రాష్ట్రంలో ఎల్జేపీ, హెచ్‌ఏఎంలకూ జేడీయూకి ఇచ్చిన ప్రాధాన్యం ఇచ్చింది. బీహార్‌లో ఎలాంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి కేంద్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఎదురైనా అక్కడ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నటు తెలుస్తోంది. 


    ఇక 16 సీట్లు గెలిచిన టీడీపీ ఒక కేబినెట్‌, ఒక సహాయమంత్రి, జేడీయూ ఒక కేబినెట్‌, ఒక సహాయ మంత్రి దక్కింది. ఐదు స్థానాలున్న ఎల్జేపీకి ఒకటి,  రెండు స్థానాలు ఒకటి, ఒకే స్థానం ఉన్న జేడీఎస్‌కు ఒక్క కేబినెట్‌ ఇచ్చింది.  కానీ టీడీపీ, జేడీయూల తర్వాత కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన శివసేన (శిండే)కు 7 స్థానాలున్నాయి. అయినా కేబినెట్‌లో ఒక్కటే (స్వతంత్ర హోదా) దక్కడం గమనార్హం. మహారాష్ట్ర రాష్ట్రం నుంచి బీజేపీ నుంచి 2 కేబినెట్‌, రెండు సహాయ మంత్రులను తీసుకున్నది. ఒకటి రామ్‌దాస్‌ అథవాలె (ఆర్పీఐ) కి ఇచ్చింది.   అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ మహారాష్ట్రలో పార్టీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించమని కోరారు. ఇందతా  ఆపార్టీ వ్యూహంలో భాగమే. శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) నమ్ముకోవడం కంటే సొంతంగానే రాష్ట్రంలో అధికారం రావాలనుకుంటున్నది. వచ్చే ఎన్నికల్లో రామ్‌దాస్‌ అథవాలె, రాజ్‌ఠాక్రే లాంటి వాళ్లతోనే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇక 10 లోక్‌సభ స్థానాలున్న హర్యానాలో గతంలో 10\10 గెలుచుకున్న ఆపార్టీ సగం స్థానాలు కోల్పోయి 5 సీట్లకే పరిమితమైంది. జేజేపీ మద్దతుతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆపార్టీ మద్దతు ఉప సంహరించుకోవడంతో స్వతంత్రుల మద్దతుతో పాటు జేజేపీలోని  నలుగురు ఎమ్మెల్యేలు తనవైపు తిప్పుకుని కాషాయపార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నది. ఈసారి సొంతంగానే అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటున్నది. మంత్రివర్గంలో ఈ రాష్ట్రానికి పెద్దపీట వేసింది. బీజేపీ నుంచే ఒక కేబినెట్‌, ఒక స్వతంత్ర, ఒక సహాయ మంత్రి పదవులు ఇచ్చింది. దీన్నిబట్టి బీహార్‌, మహారాష్ట్ర, హర్యాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నదో ఈ కూర్పును చూస్తే అర్థమౌతుంది.

    Comments

    Popular posts from this blog

    ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

    ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు