ఆ ముగ్గురికి ప్రధాని పదవిపై ఆశ


బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా 'ఇండియా' కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బెంగాల్‌, బీహార్‌ సీఎంలు మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌లలో దీదీ ఇప్పటికే యూటర్న్‌ తీసుకున్నారు. నితీశ్‌ కూడా అదే బాటలో నడుస్తారని టాక్‌.  ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న పార్టీల అధినేత నేతలలో మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ వీళ్ల ముగ్గురికి ప్రధాని పదవిపై ఆశ ఉన్నది.   తమిళనాడు సీఎం స్టాలిన్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎస్పీ అధినేత అఖిలేశ్‌కు గాని కేంద్ర రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. వాళ్ల రాష్ట్రాల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం అని వాళ్లు అనేకసార్లు చెప్పారు. అలాగే కేంద్రంలో సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాలకు మేలు జరుగుతుందని వీళ్ల అభిప్రాయం. అందుకే వాళ్లు కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి నడువాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌,ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ లాంటి వాళ్లు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లే.  కేంద్రం మంత్రులుగా వాళ్లు తమ పనితీరుతో ఆకట్టుకున్నవాళ్లే. 


నితీశ్‌ కోరిక అదే

కానీ నితీశ్‌ కుమార్‌ వీళ్లలా కాదు. అధికారం కోసం అన్ని ఎన్ని ఫీట్లు అయినా వేస్తారు అనడానికి ఆయన వ్యవహారశైలినే ఉదాహరణ. 2015 నుంచి ఇప్పటి వరకు ఆయన ఒకసారి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో తర్వాత బీజేపీతో మరోసారి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో, మళ్లీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే వాదన వినిపిస్తున్నది. ఎనిమిదిసార్లు బీహార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినా ఆయనకు కేంద్రంలో ప్రధాని పదవిపై చేపట్టాలనే ఆకాంక్ష ఉన్నది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయపార్టీలను ఏకం చేసే సమయంలో ఇదే  అంశంపై ఆయనను ప్రశ్నిస్తే తనకు ప్రధాని పదవిపై ఆశ లేదన్నారు. కానీ ఇండియా కూటమికి తానే నాయకత్వం వహించాలని భావించారు. కానీ మిగతా పక్షాలు ఖర్గేను ప్రతిపాదించగా.. కన్వీనర్‌ పదవిని నితీశ్‌కు కట్టబెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన టార్గెట్‌ ప్రధాని పదవి. అందుకే ఆయన తనకు తాను ఆశించిన పదవి దక్కని చోట ఉండటం ఎందుకు అన్న ఆలోచనతోనే మరోసారి ఆయన కాషాయపార్టీవైపు చూస్తున్నారనేది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇప్పటికైతే నితీశ్‌ మళ్లీ బీజేపీతో చేతులు కలుపుతారు అన్నది అధికారికంగా వెల్లడికాకున్నా.. ఎన్నికల షెడ్యూల్‌ నాటికి ఆయన ఒంటరిగా పోటీ చేయడమో లేదా బీజేపీతో కలిసి పోటీ చేయడమో ఏదో ఒకటి మాత్రం కచ్చితంగా జరుగుతుంది. 


మమతకు ఆలోచన అదే

ఇండియా కూటమిలో తాను కొనసాగాలంటే బెంగాల్‌ బాధ్యతలు తనకే అప్పగించాలని ఆమె స్పష్టం చేశారు. 'దేశంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా 300 సీట్లలో పోటీ చేయాలని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కట్టుగా ఉన్నాయి. అవి మిగతా సీట్లలో పోటీ చేస్తాయి. అయితే బెంగాల్‌లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ జోక్యాన్ని మేం అనుమతించబోమన్నారు. విపక్ష కూటమికి మేం కట్టుబడే ఉన్నాయం. జాతీయస్థాయిలో కూటమి భాగస్వామిగా మేం మా వ్యూహాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయిస్తాం. విపక్షాలంటే ఏ ఒక్క పార్టీకి చెందినవో కావు. మేమంతా ఐక్యంగా ఉండి, బీజేపీని ఓడించడానికి ఏం చేయాలో అది చేస్తామని' అన్నారు. దీనికి వామపక్షాలు, బెంగాల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు అంగీరించే పరిస్థితి లేదు. అంతేకాదుబెంగాల్‌లో కాంగ్రెస్‌, వామపక్షపార్టీలు టీఎంసీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ సీపీఎంను కలుపుకని వెళ్తే కేరళ, బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లోనూ వారికి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. అది లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి విజయానికి దోహదపడుతుందని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచన. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై మమత నిర్ణయం ఫలించదని తెలుసు. అందుకే ముందుగానే తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎన్నికల ఫలితాల అనంతరం మా వ్యూహాన్ని నిర్ణయిస్తామనడం వెనుక గతంలో ప్రాంతీయపార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు దేవెగౌడ ప్రధాని అయిన విషయం విదితమే. అలాంటి ఒప్పందాన్నే ఇప్పుడు ఇండియా కూటమికి దూరంగా జరుగుతున్న ముఖ్యంగా నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ ల మధ్య పరోక్ష అంగీకారం అయి ఉంటుంది.  


అరవింద్‌ కేజ్రీవాల్‌ అడుగులు క్లీయర్‌

నితీశ్‌కుమార్‌, మమతా బెనర్జీ వలె కాకుండా అరవింద్‌ కేజ్రీవాల్‌ క్లియర్‌గానే ఉన్నారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన తనపార్టీని విస్తరించే పనిని చాలా ఏళ్ల కిందటే మొదలుపెట్టారు.  గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసినా పంజాబ్‌లో మాత్రం ఆయన వ్యూహాలు ఫలించాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వీలైనంత ఎక్కువస్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు.  అందుకే ముందుగా పంజాబ్‌, ఢిల్లీ బాధ్యతలు తనకే ఇవ్వాలని మమతా ద్వారా చెప్పించారు. కానీ పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆ ప్రతిపాదనకు అంగీకరించవద్దని తమ అధిష్ఠానానికి సూచించింది. దీంతో దీదీ బాటలోనే పంజాబ్‌, ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలని ఆప్‌ నిర్ణయించింది. కేజ్రీవాల్‌ కూడా ప్రధాని పదవి చేపట్టాలని ఉన్నది. అందుకే  ఆయన వివిధ రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించి అక్కడ అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ రాష్ట్ర అభివృద్ధి నమూనాను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన అంతిమ లక్ష్యంగా ప్రధాని పదవే. బహుశా ఎన్నికల ఫలితాల అనంతరం తమ  నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పే అవకాశాలున్నాయి. 


కాంగ్రెస్‌ ముందున్న లక్ష్యం


కూటమి ప్రతిపాదనలకు విరుద్ధంగా వెళ్లాలనుకునే వారితో సంప్రదింపులు, సీట్ల సర్దుబాటు చర్చల జరిపే కంటే కలిసి వచ్చేవారిని, సర్దుకుపోయే పార్టీలతో కలిసి నడిస్తే ఫలితం ఉండొచ్చు అనే వాదన ఉన్నది. పదేళ్ల కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నది. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా త్వరగా ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలి. దానికి సమయం ఎక్కువ లేదు. ఎంత త్వరగా దీనిపై తుది నిర్ణయానికి వచ్చి ఇండియా కూటమి కామన్‌ అజెండా, కార్యాచరణ ప్రకటించిన ప్రచారం మొదలుపెట్టడం మేలనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు