ఖమ్మం జి
ల్లాలో జరిగిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ముగ్గురు సీఎంలు కేజ్రీవాల్, పినరయ్ విజయ్, భగవంత్ మాన్ లతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్, సీపీఐ జాతీయ నేత డి. రాజా హాజరయ్యారు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి బీజేపీ, కాంగ్రెస్ యేతర కూటమి కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు, సీఎంలను కలిశారు. వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ తదితరులతో కేసీఆర్ భేటీ అయ్యారు. వీళ్లలో చాలామంది కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దాన్ని ఆ పార్టీ ఖండించలేదు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా జేడీఎస్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పా బీఆర్‌ఎస్, జేడీఎస్ పోటీ చేయడం దాదాపుగా ఖాయం. ఇక ఖమ్మం బీఆర్‌ఎస్ సభలో వేదిక పంచుకున్ననేతలంతా బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవాళ్లే, కొట్లాడుతున్నవాళ్లే. అలాగే వీళ్లు ఎప్పుడూ అటు ఎన్డీఏలోనూ, బీజేపీతోనూ భాగస్వాములుగా లేరు. బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కలిసే ఉన్నాయి. బీహార్, జార్ఖండ్ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లు కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్‌తో కలిసి వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే ఉద్యమకాలం నుంచి తెలంగాణకు మద్దతుగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలు, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంఐఎం తమ అలయెన్స్ అని కేసీఆర్ అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. ఇది రాష్ట్రం వరకే పరిమితం. జాతీయస్థాయిలో రేపు బీఆర్‌ఎస్ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే ఒకవేళ ఎంఐఎంను కలుపుకుంటే అది అంతిమంగా బీజేపీకి లబ్ధి జరుగుతుందనే అబిప్రాయం ఉండనే ఉన్నది.
ఈసారి కేంద్రంలో కిసాన్ ప్రభుత్వం రావాలి అంటున్న కేసీఆర్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి కూడా గత రెండు ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఈసారి తగ్గే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణతో సహా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాల ప్రభావం కచ్చితంగా వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉంటుది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోబీఆర్‌ఎస్ వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేయవచ్చు. ఈ కూటమి 30-40 సీట్లు దక్కించుకుంటే రేపు అటు యూపీఏకు గాని, ఎన్డీఏకు గాని పూర్తి మెజారిటీ రాకపోతే ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. వైసీపీ, బీజూజనతాదళ్ లాంటి పార్టీలు కూడా ప్రస్తుతం తటస్థంగానే ఉన్నాయి. ఈ పార్టీలకు వచ్చే సీట్లు కూడా కీలకంగా మారుతాయి.
అలాగే కేసీఆర్ బీఆర్‌ఎస్ ప్రయోగం అంతిమంగా బీజేపీకి మేలు చేయడానికే అనే వాదనలు ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ వైఖరి మారవచ్చు, కాంగ్రెస్ అధిష్ఠానం అభిప్రాయం మారవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు కదా!
No comments:
Post a Comment