Tuesday 14 September 2021

సార్వత్రిక ఎన్నికల సన్నద్ధానికే


ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఇప్పుడు కమలనాథులు కూడా ఆ జాబితాలో చేరిపోయారు. గడిచిన ఆరు నెలల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది. పార్టీలో నెలకొన్న అన్నిరకాల సమస్యలను పరిష్కరించుకొని  వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి సన్నద్ధం కావాలన్నది మోదీ,షా ల వ్యూహంగా కనిపిస్తున్నది. అందుకే ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులతో పాటు నలుగురు సీఎం మార్పుల ఇందులో భాగం అంటున్నారు. 


ముఖ్యమంత్రులపై అసంతృప్తి వ్యక్తమైతే వెంటనే గుర్తించాలి. దాన్ని పరిష్కరించాలనే సూత్రాన్ని బీజేపీ అమలు చేస్తున్నది. బీజేపీ అధినాయకత్వం 2017 ఎన్నికలకు 16 నెలల ముందు అప్పటి సీఎం ఆనందీబెన్‌తో రాజీనామా చేయించి విజయ్ రూపాణీకి కుర్చీ కట్టబెట్టింది. ఎన్నికలు 15 నెలల్లో ఉన్నాయనగా రూపాణీని దించి పాటీదార్ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్‌ను తెరపైకి తెచ్చింది. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఎన్నికైన నాటి నుంచి రెండున్నర దశాబ్దాలుగా అక్కడ బీజేపీ అధికారంలో కొనసాగుతున్నది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. అలాగే కోవిడ్ కట్టడిలో రూపాణీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఆప్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది.ఆమ్ ఆద్మీ పార్టీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకుంటున్నది. అలాగే రాష్ట్రంలో నిర్ణాయత్మక శక్తిగా 12 శాతం ఉన్న పాటీదార్లు కొంతకాలంగా ముఖ్యమంత్రి పదవి తమ సామాజికవర్గానికి ఇవ్వాలంటూ డిమాండు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరైన నాయకత్వం లేని స్థితి వంటి అంశాలను తమకు లాభిస్తాయి అని, మళ్లీ గుజరాత్ కాషాయ జెండాను ఎగురవేయాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచన. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌తో దీర్ఘకాల అనుబంధం ఉన్న భూపేంద్ర పటేల్‌ను సీఎం సీటులో కూర్చొబెట్టింది. మృదు స్వభావి, గుజరాత్‌లో బూత్ మేనేజ్‌మెంట్ పితామహుడిగా పేరున్న భూపేంద్ర నేతృత్వంలో మళ్లీ గెలువవచ్చనే అభిప్రాయం ఆ పార్టీ అధినాయకత్వంలో ఉండి ఉంటుంది. అందుకే విజయ్ రూపాణీ రాజీనామా తర్వాత రకరకాల పేర్లు తెరమీదికి వచ్చాయి. కానీ ఊహాగానాల జాబితాలో కూడా లేని పేరు భూపేంద్ర పటేల్‌ను ఎంపిక చేశారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రస్తుతం బీజేపీ రూటు మార్చింది. కొత్తవారినే సీఎం కుర్చీలో కూర్చొబెడుతున్నది. తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్ ను గుజరాత్ లో,  ఉత్తరాఖండ్‌లో పుష్కర్‌సింగ్ ధామీని నియమించింది. ఆరు నెలల్లో మార్చిన నలుగురు సీఎంలు పార్టీని విజయపథంలో నడిపించలేరని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్‌తో మొదలైన మార్పులో ఆయన స్థానంలో తీరథ్ సింగ్ రావత్‌ను నియమించినా నాలుగు నెలలు కూడా ఆయన కొనసాగలేదు. అలాగే కర్ణాటకలో యడ్యూరప్పపై పార్టీలో నెలకొన్న అసంతృప్తితో ఆయన సామాజికవర్గం పార్టీకి దూరం కాకుడదని ఆయన అనుచరుడైన బసవ బొమ్మైకి బాధ్యతలు అప్పగించారు. 


ముఖ్యమంత్రుల మార్పుపై బీజేపీలో అంతర్గత కలహాలే కారణమని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. కానీ వారి పార్టీలో ఉన్న విభేదాలను పరిష్కరించుకోకుండా పక్కవారిపై విమర్శలు చేసినంత మాత్రానా ప్రజాదరణ ఉండదని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాల మధ్య తలెత్తిన విభేదాల ఫలితమే అక్కడ అధికారాన్ని కోల్పోయింది. రాజస్థాన్‌లోనూ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య పోరు నడుస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లో   అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయి.  సీఎం భూపేశ్ బఘేల్, ఆరోగ్యమంత్రి టీఎస్​ సింగ్ దేవ్​ మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం కాక అనిశ్చితి కొనసాగుతున్నది. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కొబోతున్న పంజాబ్‌లోనూ సీఎం అమరిందర్, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పంజాబ్, గుజరాత్ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాల వైఫల్యాల ఫలితంగా ఆప్ అక్కడ బలపడుతున్నది. ఢిల్లీలో అధికారంలో ఉన్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నదని ఇటీవల ఆ పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాల బట్టి స్పష్టం అవుతున్నది.

Labels: , ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home