Wednesday 15 September 2021

ప్రత్యామ్నాయం లేకుండా వరి వద్దంటే ఎట్లా?

వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు సమాఖ్య ప్రభుత్వానికి విరుద్ధంగా ఉన్నాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నదని, దీనివల్ల ఆహార భద్రత కు ముప్పు వాటిల్లనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు, రైతు సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. 

ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరి వేసుకోవడమే! అన్న సీఎం కేసీఆర్ అభిప్రాయం పై వివాదం చెలరేగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. ఎందుకంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకుండా ఉన్నపళంగా రైతులను వరి వేయవద్దు అనడం సరికాదు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరి దిగుబడులు సాధించిన రాష్ట్రం తెలంగాణ అని, దీనికి కారణం తమ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం వల్లనే ఇది సాధ్యమైందని ఆ మధ్య కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే ఆఖరి గింజ వరకు ధాన్యం కొంటామని కూడా అన్నారు. ఇప్పుడు మాట మారుస్తున్నారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

రాష్ట్రంలో దాదాపు 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వారు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఇతర పంటలు వేయాలంటే ఆ భూములు వాటికి అనుకూలంగా ఉన్నాయో లేదో ఒక శాస్త్రీయ అధ్యయనం అంటూ ఏదీ లేదు. రెండు మూడు శాతం మంది ఆదర్శ రైతులు చేసే ప్రయోగాలను మిగిలిన రైతులంతా అనుసరించాలనడం అశాస్త్రీయం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు కట్టి, ఒక నిర్దిష్ట వ్యవసాయ విధానం లేకుండా ఇప్పడు వరి సాగు చేయవద్దు అనడం పాలకుల అవివేకానికి నిదర్శనం.ముఖ్యమంత్రి గతంలోనూ సన్న రకం వడ్లు సాగు చేయాలని చెప్పి విమర్శల పాలయ్యారు. మాట్లాడితే దేశానికి మన పథకాలు ఆదర్శం అనే టీఆర్ ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కారణంగా చూపెట్టి  రాష్ట్ర రైతుల మెడ పై కత్తి పెట్టడం కరెక్టు కాదు. అంతేకాదు జిల్లాల్లో ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు ప్రకటించింది. జిల్లాల వారీగా వీటిపై సమగ్ర అధ్యయనం చేసి ఆచరణలో పెట్టి అప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తే ఫలితం ఉంటుంది. ఇవేవీ లేకుండా రైతులు వరి కి బదులు ఇతర పంటలు సాగు చేస్తే లాభాలు వస్తాయి అనడం రాష్ట్ర ప్రభుత్వం సమస్య నుంచి తప్పుకోవడమే కానీ పరిష్కార మార్గాల కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు


చూపెట్టినట్టు కాదు.

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home