Thursday 2 September 2021

గ్యాస్ సిలిండర్ ధర మళ్లా మండింది


పదిహేను రోజుల వ్యవధిలోనే గ్యాస్ ధర మళ్లా మండింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అన్నట్టు దేశ జీడీపీ పెరగడం లేదు. కానీ గ్యాస్, డీజీల్, పెట్రోల్ (జీడీపీ) ధరలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. తాజా పెరిగిన గ్యాస్ ధరలతో సంవత్సర కాలంలో ప్రజలపై అధికభారం పడనున్నది. గ్యాస్ ధర ఎంత పెరిగినా కేంద్రం ఇచ్చే సబ్సిడీ పెరగడం లేదు. గడిచిన ఏడాది కాలంలో ఒక్కో సిలిండర్‌పై 287 రూపాయలు పెరిగింది. కానీ కేంద్రం ఇచ్చే సబ్సిడీ రూ. 40.71 మించింది లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్సీడీపై కోత విధిస్తూ వచ్చింది. 


సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని అధికారంలోకి వచ్చిన తర్వాత కమలనాథులు ఇస్తున్న నినాదాలు నీటిమాటలే అవుతున్నాయి. ప్రజలపై పన్నుల భారాన్ని వేస్తూ దేశ సంపదను అంతా కొంతమంది చేతుల్లోనే పెట్టే విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్‌పరం చేస్తున్నది. కరోనా కారణంగా రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. లాక్‌డౌన్ వల్ల కొన్ని నెలల పాటు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. అట్లనే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉపాధి అవకాశాలు పోయాయి. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిన కూలీలు పల్లెల బాట పట్టారు. కోవిడ్ సమయంలో బతికుంటే బలిసాకు తిని అయినా బతుకవచ్చు అని సొంత ఊళ్లకు వచ్చిన వారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన కేంద్రంలోని పెద్దలు ప్రజల నిత్యావసర వస్తువుల ధరలతోపాటు గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు నెల నెలా పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలపై భారం పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి లెక్క తయారయ్యాయి. ఉల్లిగడ్డల ధరల పెరుగుదలపై జరిగిన నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి.  మోదీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజీల్ ధరల పెరుగుదలపై అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. ఇప్పుడేమో ధరల పెరుగుదలపై మౌనంగా ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ఈ సమయంలో ధరల పెంపుతో వారిపై భారాన్ని వేస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలపై జరిగిన నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ ఏడేండ్ల కాలంలో దేశ ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో తగిన విధంగా సమాధానం ఇస్తారు. 


Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home