Thursday 9 September 2021

వాస్తవాలను విస్మరిస్తే..

ఈ మధ్య ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. పద్నాలుగు ఏండ్లు ఉద్యమంలో అగ్రభాగం లో ఉన్న పార్టీ, ఏడేండ్లుగా అధికారంలో కొనసాగుతున్న పార్టీ ఎన్నికల్లో గెలవడానికి చాలా కష్టపడుతున్నది అన్నారు. నిజమే. ముఖ్యంగా రెండోసారి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టారు. అయినా వారు ఆశించిన స్థాయిలో పాలన లేదని భావించారో ఏమో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన ఆరు నెలలకే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అధికార పార్టీకి ఆశ్చర్యాన్ని, షాక్ కు గురిచేసే ఫలితాలు వచ్చాయి. నాలుగు స్థానాలు బీజేపీ, మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి పోయాయి. 

ఇక అప్పటి నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో ఫలితాలు అయితే హిట్ లేదా ఫట్ అన్నట్టే వచ్చాయి. దీనికి కారణం ఇప్పటికీ సంస్థాగతంగా అధికార పార్టీ బలంగా లేదు. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన కీలక నేతలు వెళ్ళిపోతే అక్కడ పార్టీ నిర్మాణాన్ని మొదటి నుంచి చేపట్టాల్సి వస్తున్నది. అది కూడా ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు కొంత జనాలకు తెలిసిన నేతలను పార్టీలోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా ద్వితీయ శ్రేణి నేతలు కొత్తగా వచ్చిన వారితో కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేసినా కొన్నిసార్లు ఫాయిదా ఉండటం లేదు. దీనికి కారణం కొన్నివర్గాలు అధికార పార్టీకి అనుకూలంగా కొన్నివర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ లెక్కల అంచనాలు అప్పుడప్పుడు బెడిసి కొడుతున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. 

మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులు మంచి ఫలితాలను అందించాయి. వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలు ప్రారంభించి ఉండి ఉంటే బాగుండేది. విధాన పరమైన నిర్ణయాలు ఆచరణలో కి వచ్చేసరికి సరిగ్గా అమలు కావడం లేదు. అలాగే చాలా ఏండ్లుగా అసంతృప్తితో ఉన్న నిరుద్యోగులను, ఇంకా ఇతర వర్గాల సమస్యలపై సరైన స్పందన లేదు. ఎన్నికల సమయంలో ఈ వర్గాలు ఎక్కడ తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారో అన్న అనుమానంతో అప్పటికప్పుడు వాళ్లను ప్రసన్నం చేసుకునే ప్రకటనలు ఇస్తున్నారు. అవి ఆయా ఎన్నికలు అయిపోగానే అటకెక్కుతున్నాయి. అందుకే ఓట్ల వేటలో వివిధ ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నది. వాస్తవాలను విస్మరించి చేసే రాజకీయాలు ఎల్లకాలం నడువవు అన్న విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.


Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home