Sunday 19 September 2021

అర్హత పరీక్ష నిర్వహణ లోనూ అలసత్వం


ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం నుంచి త్వరలో వంటి ప్రకటనలే తొమ్మిది నెలలుగా వినిపిస్తున్నాయి. నియామకాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమౌతున్నది. కానీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నాలుగేండ్లుగా నిర్వహించలేని స్థితిలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపడుతున్నది. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని, ఖాళీలు ఉండవని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాలతో పాటు మోడల్ స్కూళ్లలో 6నుంచి 8వ తరగతి వరకు బోధించే ట్రైన్డ్ గ్రాడ్యూయేట్ టీచర్స్ (టీజీటీ) ఉద్యోగాలు భర్తీ చేయలన్నా టెట్ అర్హత తప్పనిసరి. 

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఏడాదికి ఒకసారి అయినా టెట్ నిర్వహించాలి. కానీ నాలుగేండ్లుగా టెట్ నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016,2017లో పరీక్ష నిర్వహించారు.  2018లో మరోసారి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అప్పటి విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి సమీక్ష జరిపారు. దీనికి నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన పంపింది. దానిపై ప్రభుత్వంపై నుంచి ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. 2019 ఎన్‌సీటీఊ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో బీఈడీ అభ్యర్థులు కూడా ఎస్‌జీటీ పోస్టులకు పోటీపడవచ్చు. టెట్‌లో పేపర్-1 రాసేలా నిబంధనలు మార్చాలని అధికారులు 2019 మార్చిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దానిపై కూడా స్పందనలేదు. 

రాష్ట్రంలో ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు 2.50 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. ప్రభుత్వం ప్రకటిస్తున్నట్టు త్వరలో చేపట్టబోయే నియామకాల్లో వీరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని అనుకుంటే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. టెట్ నిర్వహించకుండా టీచర్ల ఖాళీలపై నోటిఫికేషన్ ఇవ్వడం కుదరని విద్యాశాఖ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం. కొలువుల భర్తీపై త్వరలో ప్రకటనలే వెలువడుతున్నాయి. ఆ తర్వలో ఎప్పుడు అన్నదే ప్రశ్న. అప్పట్లో క్యాబినెట్ భేటీలో ఖాళీలు అస్పష్టంగా ఉన్నాయని పూర్తి సమాచారంతో రావాలని మంత్రివర్గం ఆదేశించింది. ఆ తర్వాత జరిగిన క్యాబినెట్ భేటీలోనూ ఖాళీలపై స్పష్టత ఉన్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేమీ లేవు. కానీ నియామకాలు చేపట్టాలనే ఆలోచన లేనప్పుడు ప్రకటనలకే పరిమితం అవుతుంది. తొమ్మిది నెలలుగా నిరుద్యోగుల కండ్ల ముందు కనిపిస్తున్నది ఇదే.

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home