Thursday, 28 September 2023

కరువులేని సమాజ లక్ష్య సాధనే స్వామినాథన్ కు నివాళి

 


ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో అతిపెద్దది అత్యంత కీలకమైంది వ్యవసాయం. వ్యవసాయం లాభదాయకంగా లేనందు వల్ల  తల్లిదండ్రులు వారి పిల్లలను వ్యవసాయం వైపు ప్రోత్సహించడం లేదు. అందుకే సేద్యం ఒకటే చాలదు వ్యవసాయ అనుబంధ అభివృద్ధి అంశాలు చాలా ముఖ్యమని,  పార్కులు అగ్రి ప్రాసెస్ విధానం ఉత్పత్తుల తయారీ వంటి వ్యాపకాల ద్వారానే యువతరం వ్యవసాయం పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుందని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ స్పష్టం చేశారు.   ఐటీ రంగంలోనే కాకుండా వ్యవసాయంలోనూ మన దేశం ఔట్‌ సోర్సింగ్‌ సేవలు అందించేందుకుఅనేక అవకాశాలు ఉన్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.  


వ్యవసాయ పరిశోధనవైపు యువత రాకపోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ..యువత సహజంగా వారి తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు నడుచుకుంటుందన్నారు. వ్యవసాయం లాభసాటిగా లేదని వారు భావిస్తే..తమ పిల్లలను అగ్రికల్చర్‌ కోర్సులు చదివించేందుకు వారు అంగీకరించరన్నారు. ఆర్థికంగా లాభమా కాదా అన్న విషయం బాగా ప్రభావితం చేస్తుందన్నారు. విశ్వవిద్యాలయాలకు వెళ్లి చదువుకునే యువత హుందా జీవితాన్ని కోరుకుంటున్నది. విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నది. వ్యవసాయం ద్వారా అన్నిరకాల అవసరాలు తీరేలా ఆదాయం వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు కీలకమైన అంశం. యువతరం రైతులు పంట పండించడానికి మాత్రమే పరిమితం కాకండి. అదనపు ఆదాయాన్ని అందించే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై దృష్టి సారించాలనిఆయన సలహా ఇచ్చారు. అలాగే మన వ్యవసాయ విద్యా విధానం వాస్తవాలకు దూరంగా సాగుతుందన్నారు. మన విద్యార్థుల్లో చాలామందికి రైతుల సమస్యలు ఏమిటో తెలియదన్నారు. జాతీయ రైతు కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు చాలా వ్యవసాయ కళాశాలలకు వెళ్లానని అక్కడ విద్యార్థులు తమకు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ లేదని వారు ఓపెన్‌గానే చెప్పారని తెలిపారు. తాను వ్యవసాయ పరిశోధన సేవలు అందించే సమయంలో అగ్రికల్చర్‌ విద్యార్థులు ఒక సీజన్‌ (వానకాలం లేదా యాసంగి) మొత్తం రైతులతో గడపాలని  చెప్పవాడిని, అప్పుడే వారికి వ్యవసాయంలోని అసలు సమస్యలు అనుభవంలోకి  వస్తాయన్నారు. 


ఎంఎస్‌ స్వామినాథన్‌ సిఫార్సులను అమలు చేయాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతుంటాయి. దీనిపై ఆయనను అగినప్పుడు తాను చేసిన కొన్ని సూచలను ప్రభుత్వాలు  అమలు చేశాయన్నారు. రైతులకు 4 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వడం వంటివి వాటిలో కొన్న. కానీ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రధాన అంశాలపై తన  ఇంకా అమలు కాలేదన్నారు. తాను చేసిన మరో ముఖ్యమైన సూచన ఏమిటి అంటే దేశమంతా ఒకే మార్కెట్‌  ఉండాలన్నారు. అప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల తరలింపుపై ఆంక్షలు ఉండవన్నారు. ఒకే మార్కెట్‌ విధానం తెస్తే అవినీతి చాలా వరకు తగ్గుతుందన్నారు. 


కరువు లేని సమాజ స్థాపన మనకు చాలా అవసరం అన్నారు. ప్రతీ ఒక్కరికీ తగినంత ఆహారం ఇవ్వాలన్నారు. ఆహారభద్రత చట్టం అమల్లోకి వచ్చాక ఈ  పథకం ద్వారా చాలావరకు ఇది సాధ్యపడుతుందన్నారు. కరువు లేని సమాజాన్ని సృష్టించేందుకు సమీకృత ప్రణాళికను  అమలు చేయాలని స్వామినాథన్‌ సూచించారు. దానికి ఆహార భద్రత చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు. కరువులేని సమాజం లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదన్నారు. అలాగే పంటల విస్తీర్ణం తగ్గుదల సమస్యను అధిగమించడానికి అధికోత్పత్తినే పరిష్కారమన్నారు. మృత్తికల సంరక్షణ, పంటలకు సూక్ష్మ పోషకాలు అందించడం, చీడపీడల నివారణ, సమిష్టి బాధ్యత వంటి చర్యల ద్వారా ఉత్పత్తి పెంచుకోవచ్చన్నారు. కాబట్టి కరువులేని సమాజం లక్ష్య సాధనే మనం స్వామినాథన్ కు ఇచ్చే నివాళి. 

No comments:

Post a Comment