బయోమెట్రిక్ నమోదు చేయడానికి అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాల ముందు చేరుకోవాలన్న నిబంధనను తెలంగాణ పబ్లిక్ కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. తాను పేర్కొన్న నిబంధనను కమిషన్ అమలు చేయాలి. గత ఏడాది అక్టోబర్ 16న జరిగిన పరీక్షల్లోఅమలు చేసిన విధానాన్ని ఈ ఏడాది జూన్ 11న వాటిని విస్మరించింది.
దీన్నిబట్టి పరీక్ష నిర్వహణలో, అభ్యర్థుల హాజరు వివరాలను నమోదు చేయడంలో కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమౌతున్నదని గ్రూప్-1 రద్దు సమయంలో హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి జూన్ 11న రద్దు చేసి మళ్లీ తిరిగి నిర్వహించాలని సెప్టెంబర్ 23న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఈసారి బయోమెట్రిక్ సహా నోటిఫికేషన్‌లోని అన్ని నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణ, అభ్యర్థుల డేటా సేకరణలో అజాగ్రత్త కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. దీన్ని సవాల్ చేస్తూ సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సబబే అని గ్రూప్-1 ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాల్సిందేని తీర్పు చెప్పింది.
డివిజన్ బెంచ్‌లోఈ కేసు విచారణ సందర్భంగా కూడా 'ప్రశ్ర పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నప్పుడు మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్న దాన్ని ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్‌లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా? అలా ఎందుకు జరిగింది? లక్షలమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు నీరుగారుస్తారా?' అని టీఎఎస్‌పీఎస్సీని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని.. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించిది. తర్వాత సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.
500 పైగా గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చినప్పుడు నిరుద్యోగులు ఎంతో ఆనందపడ్డారు. చాలామంది గ్రూప్-1 లక్ష్యంగా చేసుకుని సీరియస్‌గా ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ప్రశ్నపత్రాల లీకేజీతో ఒకసారి, కమిషన్ నిర్లక్ష్యంతో మరోసారి గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు కావడంతో నిరుద్యోగులు ఎంతో మానసిక వ్యథకు గురవుతున్నారు. పరీక్ష రద్దుపై సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కి వెళ్లారు. కానీ సింగిల్ బెంచ్ కంటే డివిజన్ బెంచ్ కమిషన్ చాలా కఠినమైన పదాలు వాడింది. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ జడ్జి తీర్పు సబబే అని పేర్కొంటూ అవే అంశాలనే పునరుద్ఘాటించింది. సర్వీస్ కమిషన్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది తెలుస్తున్నది. అందుకే డివిజన్ బెంచ్ అభ్యర్థుల భవిష్యత్తు, కమిషన్ ప్రతిష్ఠ ప్రశ్నార్థకంగా మారాయని చెప్పింది.
నియామకాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్లలో లోపాలు, పరీక్ష నిర్వహణ సమయంలో లోపాలు పదే పదే ఎందుకు పునరావృతమౌతున్నాయి? సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే కమిషన్ హడావుడిగా ఎందుకు పరీక్షలు నిర్వహిస్తున్నది? అన్నప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కమిషన్ నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. పరీక్ష రద్దు తర్వాత రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 52 వేల మంది అభ్యర్థులు హాజరుకాలేదు. ఏండ్ల తరబడి చదివిన వాళ్లకు పరీక్ష రద్దు అనేది మానసిక వ్యథకు గురిచేసింది. ఈ సమయంలో అభ్యర్థుల్లో విశ్వాసం నింపాల్సిన కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. నిరుద్యోగ అభ్యర్థులను పూర్తిగా నైరాశ్యంలోకి నెడుతున్నది. కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ అని దీంట్లో రాజకీయ జోక్యం ఉండదంటూనే మరి స్వేచ్ఛగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నది? ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత, నోటిఫికేషన్లలో, పరీక్ష నిర్వహణలో లోపాలపై కోర్టులు ప్రశ్నించినా ఎందుకు పాఠాలు నేర్చుకోవడం లేదు? ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవడానికి కూడా వీల్లేదని కేసు విచారణ సందర్భంగా దాఖలు చేస్తున్న కౌంటర్లను చూస్తే తెలిసిపోతున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని నేతల మాటలు నినాదాలే కాని వాటిని భర్తీ చేసే ఉద్దేశం లేదన్ననది కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం అని నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు.