Sunday 1 July 2012

రాష్ట్రపతి ఎన్నికలో రాజకీయాలు

దేశంలో దశాబ్దంనర కాలంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దీంతో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధాపడవలసిన పరిస్థితులు వచ్చాయి. పేరుకే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా ఢిల్లీ పీఠంపై కూర్చునే పరిస్థితులు పోయాయి. జాతీయ పార్టీలు ఎంత బలహీనపడ్డాయో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా స్పష్టంగా కనిపిస్తున్నది. యూపీఏ, ఎన్టీఏ కూటములు తమ రాష్ట్రపతి అభ్యర్థులను గెలిపించుకోవడానికి చిన్నాచితకా పార్టీలను కూడా బతిమిలాడాల్సి వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్ల విలువ 10.98 లక్షలు. వచ్చే నెల 19న జరిగే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే 5,49,442 ఓట్లు కావాలి. అధికార పార్టీ తరఫున ప్రణబ్ బరిలో ఉన్నారు. ప్రధానప్రతిపక్షం సంగ్మాకు మద్దతు పలుకుతున్నది. అయితే రాష్ట్రపతి ఎన్నిక మాత్రం మూడు కూటముల్లో మంటపెట్టింది. యూపీఏ తరఫున పోటీలో ఉన్న ప్రణబ్‌ను ఆ కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన తృణమూల్ వ్యతిరేకిస్తున్నది. మమతాబెనర్జీ అబ్దుల్ కలాంను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో నిలపాలని విఫలయత్నం చేశారు. కానీ ఆ రతిపాదనను కాంగ్రెస్ పెద్దలు తిరస్కరించారు. ప్రణబ్‌ను ఏకపక్షంగా ఎంపిక చేశారని ఆరోపిస్తున్నది. తృణమూల్ యూపీఏ నుంచి వైదొలగనుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే మమత మద్దతు ఇవ్వకపోయే సరికి ఈ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్నది. కానీ రాష్ట్రపతి ఎన్నిక అధికార పార్టీనే కాదు ప్రధాన ప్రతిపక్షంలోనూ చీలిక తెచ్చింది. ఎన్డీఏ కూటమిలోని శివసేన, జేడీయూ ప్రణబ్‌కు మద్దతు ఇస్తున్నాయి. అలాగే వామపక్షాల్లోని సీపీఎం, ఫార్వర్డ్‌బ్లాక్ ప్రణబ్ వెంట ఉండగా, సీపీఐ ఓటింగ్‌కు గైర్హాజరు కావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న కూటముల బలాలు పరిశీలిస్తే యూపీఏకు (తృణమూల్ మినహా) 4,12,00 లక్షల ఓట్లున్నాయి.  ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం, ఫార్వర్డ్ బ్లాక్, జేడీయూ, శివసేన, జేడీఎస్ పార్టీల ఓట్లు కలిపితే ప్రణబ్‌కు 6.29లక్షల ఓట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎన్డీఏకు (జేడీయూ, శివసేన మినహా)
2,43,000 ఓట్లు ఉన్నాయి. ఎన్డీఏ బలపరుస్తున్న సంగ్మాకు అన్నాడీఎంకే, బీజేడీల ఓట్లు కలిపి 3,10,00 ఓట్లు పడే అవకాశమున్నది. దీంతో 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ఎన్నికవడం ఖాయంగానే కనిపిస్తున్నది. అయితే ఈ ఎన్నికపై కూటముల్లోని పార్టీల పట్టింపులు విషయంలో ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే ప్రధాన ప్రతిపక్షం తరఫున బరిలో నిలిచిన సంగ్మా ఈశాన్య ప్రాంతంలోని చిన్న రాష్ట్రాల నుంచి రాజకీయంగా ఎదిగారు. అధికార పార్టీ తరఫున బరిలో ఉన్న ప్రణబ్ చిన్న రాష్ట్రాలను వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నిక ఏమంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలియజేస్తున్నది. సంగ్మా మొన్నటి వరకు ఎన్సీపీలో కొనసాగారు. ఆ పార్టీ యూపీఏలో భాగస్వామి. ఆ పార్టీ అధ్యక్షుడు, సంగ్మా కుమార్తె అధికార పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో పోటీ నుంచి తప్పుకోవాలని శరద్ పవార్ సూచించినా సంగ్మా బేఖాతరు చేశారు. పార్టీకి రాజీనామా చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఉండే రాజకీయ సమీకరణాలు కూడా రాష్ట్రపతి ఎన్నిను సంక్లిష్టం చేశాయి. అందుకే మహారాష్ట్రలో ఎన్సీపీ కాంగ్రెస్‌తో, శివసేన బీజేపీతో కలిసి పనిచేస్తున్నది. అందుకే ఎన్సీపీ వ్యతిరేకించిన అభ్యర్థిని శివసేన కూడా వ్యతిరేకిస్తున్నది. అట్లనే బెంగాల్‌లో మూడు దశబ్దాల ఎర్రకోటను కూల్చి అధికారంలోకి వచ్చిన మమత వ్యతిరేకించిన అభ్యర్థికి సీపీఎం మద్దతు తెలుపుతున్నది. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి నిర్ణయం కీలకమవుతుంది. అందుకే అధికార, ప్రతిపక్ష కూటములు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించకుండా రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటున్నాయి.  ఈ రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఒక అవకాశంగా
ఉపయోగించుకోవాలి. ఐదున్నర దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలను కమిటీలు, ఒప్పందాలుల పేరుతో మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న ప్రణబ్ కూడా తెలంగాణ వ్యతిరేకి. దేశంలోని ప్రధాన సమస్యలన్నింటి తేల్చకుండా 30 కమిటీలను తన జేబులో వేసుకుని తిరుగుతున్న వ్యక్తి ప్రణబ్. ఆయకు పార్టీయే కానీ ప్రజలు ముఖ్యం కాదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనను ట్రబుల్ షూటర్‌గా పేర్కొంటుంది. ఈ ట్రబుల్ షూటర్ పార్టీని సమస్యల నుంచి గట్టెంచడానికి ప్రజలను ట్రబుల్స్‌కు గురిచేయడానికి కూడా వెనకాడడు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తెలంగాణను అడ్డుకున్న ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటేయ్యాలి. లేకపోతే కనీసం తమ నిరసనను తెలియజేయడానికి ఓటింగ్‌కు గైర్హాజరవ్వాలి.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home