Sunday 29 July 2012

కట్టుకథల విష పుత్రికలు



తెలంగాణపై కాంగ్రెస్ కాలపయాపన రెండున్నర సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది. పండుగలు, ఎన్నికల పేరుతో ఇంత కాలం నెట్టుకుంటూ వస్తున్న ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలు ఇప్పుడు రాష్ట్ర విభజన అంశాన్ని తేల్చే పనిలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ తేలుస్తారని ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు టీ జేఏసీ ఆగస్టు తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టీఆర్‌ఎస్ అధినేత మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యం అని చెప్పడం, దానిపై మీడియాలో చర్చలు జరిగాయి, జరుగుతున్నాయి. అయితే ఇందులో వాస్తమెంతో తెలియదు కానీ ఇప్పుడు సీమాంధ్ర మీడియా చేస్తున్న హడావుడి చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై హస్తినలో ఏదో జరుగుతుందనేది సుస్పష్టం.
తెలంగాణపై ఢిల్లీలో కదలిక వచ్చిన ప్రతి సందర్భంలో  సీమాంధ్ర మీడియా పనిగట్టుకుని విష ప్రచారం చేయడం మామూలే. తెలంగాణ ఏర్పాటుపై ఢిల్లీ నుంచి సిగ్నల్స్ బంద్ అయ్యాయని, శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసిన ఆరో ప్రతిపాదన పట్ల ఢిల్లీ పెద్దలు సుముఖంగా ఉన్నట్టు కొన్ని ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయి. ఆరో ప్రతిపాదన అంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు భావిస్తున్నట్టు ఇందుకోసం కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి నివేదిక సమర్పించిందని వారే చెప్పుకొస్తున్నారు. ఒక ఆంగ్ల పత్రికలో అచ్చయిన కథనం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ వ్యతిరేక ఛానళ్లు చేస్తున్న విష ప్రచారం అంతా ఇంతా కాదు. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ నాయకత్వ మార్పు తప్పదనే బ్రేకింగ్ న్యూస్‌లు బంద్ అయ్యాయి. సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ ఎదురైన పరాభవము పక్కకుపోయింది. మీడియా అంటే నిష్పక్షపాతంగా వ్యహరిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. కొన్ని మీడియా ఛానళ్లు ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షపై ఎంత విషయం చిమ్ముతాయో వారి కథనాలు చూస్తే అర్థమవుతుంది.

కేంద్ర హోం శాఖ తెలంగాణపై రాష్ట్రపతికి సమర్పించిన ఊహాగాన లేఖను చూద్దాం. అందులో శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరో ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని ఆ కమిటీయే పేర్కొన్నది. అలాగే ప్రణబ్ రాష్ట్రపతి కాకముందు ఆయనకు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరుంది. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఆ పార్టీ వేసే కమిటీ భారాన్ని మోసేది ఆయనే. ప్రజా సమస్యలపై సాచివేత ధోరణి అవలంబించాలంటే ప్రణబ్‌కే సాధ్యం అనే ఆ పార్టీ ప్రగాఢ విశ్వాసం. అందుకే ముప్ఫై పైచిలుకు కమిటీలకు ఆయన నేతృత్వం వహించారు. (వాటిలో ఒక్క అంశాన్ని కూడా ఆయన తేల్చలేదు అది వేరే విషయం). ఇక తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉంది అని, ఇందుకు తనకు సిగ్నల్స్ ఉన్నాయని పేర్కొన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఇటు ఢిల్లీ పెద్దల నుంచి మొదలు గల్లీ లీడర్ల అభిప్రాయం సేకరించిన సదరు సీమాంధ్ర మీడియా, ఇప్పుడు కేంద్ర హోంశాఖ తెలంగాణ సాధ్యం కాదని రాష్ట్రపతి నివేదిక పంపిన విషయంలో మాత్రం ఆ పని చేయలేదు. అయితే రాష్ట్రపతిగా ప్రణబ్ ఎన్నికైన తర్వాత ఈ మీడియానే తెలంగాణపై ఆయనను గుచ్చిగుచ్చి ప్రశ్నించినా, ఆ సమాధానాన్ని దాటవేశారు. అంతేకాదు కేంద్ర క్యాబినేట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని బదులిచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ గానీ, యూపీఏ ప్రభుత్వం క్యాబినేట్ గానీ తెలంగాణపై ఏమైనా స్పందించిందా అంటే అదీ లేదు. మరి కేంద్ర హోం శాఖ నివేదిక పంపినట్టు విశ్వసనీయ వార్గాల సమాచారం అని వీరు ఎలా చెప్పగలుగుతున్నారు. ఇందులో వాస్తవాలు ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ రాజకీయ పార్టీల వలే సీమాంధ్ర మీడియా కూడా తమ ద్వంద్వ విధానాలతో ఇరు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నది. తమ రేటింగ్స్ కోసం చిచ్చులు రేపుతున్నది.

ఒక్క విషయం మాత్రం స్పష్టం ఇటు తెలంగాణ ప్రజలు గానీ, అటు సీమాంధ్ర ప్రజలు గానీ తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మొన్న ఉప ఎన్నికల తర్వాత తెలంగాణను వ్యతిరేకించే కరుడుగట్టిన సీమాంధ్ర నేతలే తెలంగాణ ఇచ్చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో రాయల తెలంగాణ ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. అప్పుడు చప్పుడు చేయని ఈ సీమాంధ్ర ఛానళ్లు ఇప్పుడు నానా యాగీ చేయడం చూస్తుంటే ... ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలపై  చర్చ జరుగుతుంది అనేది స్పష్టం. అయితే అది రాష్ట్ర విభజన పైనా లేక రాష్ట్ర నాయకత్వ మార్పు పైనా అనేది కొన్ని రోజుల్లో తేలనుంది. అంత వరకు ప్రజలను ప్రశాంతంగా ఉండమని నీతులు చెప్పే ఈ ఛానళ్లు కూడా దాన్ని ఆచరిస్తే ఆంధ్ర ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. తెలంగాణ ప్రజల కూడా ఈ సీమాంధ్ర మీడియా అసత్య ప్రచారాలను నమ్మకుండా సహనంతో ఉండాలి. మనముందున్నవి రెండే అంశాలు. ఒకటి పోరాడి తెలంగాణ సాధించుకోవడం. రెండోది తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో భాగస్వాములవడం.
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home