తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు పెట్టింది పేరు. పార్టీలో ఎంత పెద్దవారైనా పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. పార్టీ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదు. ఇవన్నీ ఎక్కడో విన్నట్టు ఉంది కదూ! తెలుగుదేశం పార్టీ అధినేత మీడియా ముందు తరచుగా వాళ్ల పార్టీ గురించి చెప్పుకునే ఊకదంపుడు ఉపన్యాసాలు. కానీ బాబు చెప్పిన ఆ నీతి సూత్రాలు తెలంగాణ ప్రాంత నేతలకే వర్తిస్తాయి కాబోలు! అంతేమరి బాబు ప్రాపకం కోసం ఈ ప్రాంత నేతలు ఆయన ఏది చెబితే అదే చేస్తారు. తాజాగా టీడీపీ రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో ఒక కొత్త దుఖానం తెరిచారు. అదే ప్రాంతానికి చెందిన రాయలసీమ హక్కుల నేత ఒకసారి సమైక్యమని, మరోసారి రాయల తెలంగాణ అని ఆ ప్రాంత హక్కులను తనకు ఇష్టం వచ్చినట్టు మలుచుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన జేసీ దివాకర్‌రెడ్డి ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి లేదా అనంతపురం జిల్లాను బెంగళూరులో కలపాలని వాదించారు. అయితే సమైక్యాంధ్ర కన్వీనర్ మంత్రి శైలజనాథ్ కూడా రాయలసీమ ప్రాంతం వాడే కావడం గమనార్హం. అంటే ఈ నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధుల నుంచి నలభై మాటలు వినిపిస్తున్నాయి. పార్టీలు వేరైనా ఎవరి ప్రయోజనాలకు వారికి ఉన్నాయి. అందుకే ఒకరి తర్వాత ఒకరు రాయలసీమ హక్కుల గురించి పదే పదే ఉచ్చరిస్తుంటారు. వారి ఆవేదన ఆచరణలో ఉంటే నిజంగా రాయలసీమ ప్రజలకు కొంత మేలు జరిగి ఉండేది. కానీ వారి లక్ష్యం అది కాదు. సమైక్య, రాయల ద్వంద్వ స్వరాలు వినిపించడం వారికే సొంతం. ఆ నలుగురి బాధే రాయలసీమ ప్రజల బాధ అన్నట్టు వ్యవహరిస్తుంటారు.
ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా నష్టపోయింది అని వాదించే నేతలకు కొన్ని ప్రశ్నలు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది రాయలసీమ నేతలే. ఇప్పుడు కూడాఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షం నేత, కాబోయే ముఖ్యమంత్రి అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చెబుతున్న జగన్ కూడా రాయలసీమ ప్రాంతం వాసులే. అయినా రాయలసీమ ఎందుకు వెనుకబడిందో ఈ వితండ వాదనలు చేస్తున్న వారే వివరణ ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి రాయలసీమ నేతే. విలీన సమయంలో ఈ రెండు ప్రాంతాల నేతలు చేసుకున్న ఒప్పందాలను ఆదిలో అణగదొక్కింది ఆ మహానుభావుడే. ఆంధ్రకు ముఖ్యమంత్రి పదవి లభిస్తే, తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాసుకున్న ఒప్పందాలను కాలరాసింది ఆ ప్రబుద్ధుడే. ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు వంటిది అని సెలవిచ్చింది వారే. ఇక అప్పటి నుంచి మొదలైన తెలంగాణ ప్రజల హక్కుల హననం ఇప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఈ ప్రాంత ప్రజలు హక్కులడిగితే అరదండాలే. అయినా ఏనాడూ వీటి స్పందించలేదు ఇప్పుడు రాష్ట్ర విభజనపై తలాతోకా లేని వాదనలు చేస్తున్న నాయకులు. అట్లనే తెలంగాణ తమ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ మహానాడు సమావేశంలో తీర్మానం చేసి, తీరా ప్రకటన వచ్చాక మాట మార్చింది బాబు టీడీపీయే. అప్పుడు మాట్లాడలేదు బైరెడ్డి. కానీ ఇప్పుడేదో ప్రళయం ముంచుకొచ్చినట్టు ప్రగల్భాలు పలుకుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలు, రాయలసీమలోని కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. వాటిని ఎవరూ కాదనరు. కానీ రాయలసీమ హక్కులకు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ముడిపెట్టడం సరికాదు. రాయలసీమ హక్కులు గురించి ఎవరు ఎవరితో చేసుకున్నారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. అలాగే రాయలసీమ హక్కులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంతో చేసుకున్న ఒప్పందాలను వలస పాలకులు తుంగలో తొక్కారనే దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్ల వందలాది మందికి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంత ఉందో టీడీపీది అంతే ఉంది. ఈ వాస్తవాలను పక్కనపెట్టి రాయలసీమ హక్కుల పేరుతో రోజుకో రాగం తీస్తున్న నేతలు కోరుతున్నదేమిటి? రాయలసీమ అభివృద్ధా? లేక ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమా అన్నది వారికే తెలియదు. కనుక సీమ ప్రజలరా తస్మాత్ జాగ్రత్త!
-రాజు
No comments:
Post a Comment