Sunday 1 July 2012

రాజకీయ కుట్రే ‘రాయల తెలంగాణ’


రాష్ట్రపతి ఎన్నికను తెలంగాణకు ఆయుధంగా వాడుకోవాలని తెలంగాణ జేఏసీ పిలుపు ఒకవైపు, ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలపై సంప్రదింపులు మరోవైపు. దీంతో అందరి చూపు ఆంధ్రప్రదేశ్‌పైనే. తెలంగాణపై నిర్ణయం వెల్లడించడానికి కేంద్రం కసరత్తు చేస్తోందనే సంకేతాలు అందుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణను తేల్చేస్తారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. అయితే దీనిపై కొత్త, వింత వాదనలు వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించి  ఏడాదిన్నర దాటినా దానిపై కేంద్రం ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు.  కమిటీ చేసని ఆరు సిఫార్సుల్లో మొదటి రెండు సిఫార్సులపై అనేక చర్చలు జరిగాయి. ఎందుకంటే మొదటి రెండు సిఫార్సుల్లో రాష్ట్రాన్ని యధాతదంగా ఉంచడం, లేదా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. వీటిపై ఇటు తెలంగాణవాదులు, అటు సమైక్యవాదులు  ఎవరికి అనుకూలమైన సిఫార్సులపై వారు తమ వాదనలు వినిపించుకుంటూ వస్తున్నారు. కానీ తెలంగాణలోని ఒక బలమైన సామాజిక వర్గం కర్నూల్, అనంతపురంలతో కలిపి ‘రాయల తెలంగాణ’ (ఎంఐఎం వాదన కూడా ఇదే) తమకు ఆమోదయోగ్యమే అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. జేఏసీ కూడా దీనిపై నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన ఎందుకు ముందుకు వచ్చింది. శ్రీకృష్ణ కమిటీలోని నాలుగో ప్రతిపాదనను కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగానే తెరమీదికి తెచ్చారా? ఉప ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో ‘ఫ్యాన్’ గాలి జోరుకు కాంగ్రెస్ పెద్దలు కలవరానికి గురైనట్టు కనిపిస్తున్నది. తెలంగాణవాదుల భుజాన తుపాకీ పెట్టి జగన్‌ను కాల్చే ప్రయత్నం చేయాలని చూస్తోందా? ఇవన్నీ చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. మొన్నటి వరకు సమైక్యవాదమే మా నినాదం అన్న జేసీ దివాకర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్‌లు ఉన్నపళంగా రూటు మార్చుకున్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ హక్కుల సంగతి ఏమిటి ప్రశ్నించిన వీరు ఇప్పుడు కర్నూలు, అనంతపురం ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాలుగు జిల్లాల హక్కులు కాస్త ఈ ఇద్దరు నేతల వల్ల రెండు జిల్లాలకై పరిమితమయ్యాయి. వీరి ప్రదిపాదనలను సమైక్యాంధ్ర కన్వీనర్ మంత్రి శైలజానాథ్ ముందు ప్రస్తావిస్తే, అలాంటివి ఏవైనా వస్తే అప్పుడు ఆలోచిస్తామనడం గమనార్హం. అయినా రాయలసీమ హక్కుల కోసం చేసుకున్న  ‘శ్రీభాగ్’ ఒప్పందం ఆంధ్ర, సీమ ప్రాంతాల మధ్య జరిగింది. దానికి తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేదు. ఇప్పుడు రాయలసీమ హక్కుల గురించి మాట్లాడుతున్న ఈ నేతలు కూడా ఆ ఒప్పందం అమలు కోసం ప్రయత్నించి దాఖలాలు లేవు. వారి అవకాశవాద రాజకీయాల కోసం ఆ ప్రాంత ప్రజల హక్కులను కాలరాసిన, రాస్తున్న నేతలు వారు. వీరి కుటిల నీతి ఏమిటో ఇప్పటికైనా రాయలసీమ ప్రజలు అర్థం చేసుకోవాలి.

నిజంగానే రాష్ట్రపతి ఎన్నిక తర్వాత రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అని భావించలేము. అందుకే రాయల తెలంగాణ, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం వంటి అంశాలను తెరమీదికి తెచ్చి ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్ర పన్నుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు సీమాంధ్రలో జగన్, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే రాయల తెలంగాణ ప్రతిపాదన అసాధ్యమని శ్రీకృష్ణ కమిటే తేల్చి చెప్పింది. దీనికి తెలంగాణవాదులు అంగీకరించరన్న విషయమూ తెలుసు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఐదున్నర దశబ్దాలుగా మోసం చేస్తున్నది. తెలంగాణ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడమే తప్ప, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే సదుద్దేశం ఏనాడూ ఆ పార్టీకి లేదు. ఎన్నికల ముందు తెలంగాణ ప్రస్తావన తెచ్చి పబ్బం గడుపుకోవడం ఆ పార్టీకి పరిపాటి అయ్యింది. తెలంగాణను అడ్డుకోవడానికి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని రాజకీయం చేసి రచ్చ చేయడం ఆ పార్టీ పెద్దలకు అలవాటే. అందులో భాగమే ఇప్పటి ప్రతిపాదనలు.  దీనికి రాష్ట్రంలోని సీమాంధ్ర మీడియా కూడా వంత పాడుతున్నది. సరిగ్గా ఇలాంటి వ్యూహాన్నే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009లో తెలంగాణలో మొదటి దఫా ఎన్నికలు పూర్తయ్యాక నంద్యాల సభలో తెలంగాణ ఉద్యమం విషం చిమ్మారు. అయితే అప్పుడు తెలంగాణవాదానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి మాత్రం సీమాంధ్రలో మెజారిటీ సీట్లను తెచ్చిపెట్టింది. అయితే పరిస్థితులు మారిపోయాయి.  కోవూర్ ఉప ఎన్నికల దగ్గరి నుంచి మొన్నటి ఉప ఎన్నికల వరకు సీమాంధ్రలో లగడపాటి, టీజీ వెంకటేశ్ వంటి నేతలు వైఎస్‌ఆర్‌సీపీకి ఓటు వేస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని ప్రచారం చేశారు. నాటి వైఎస్ వ్యూహం బెడిసి కొట్టింది. మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారనే లగడపాటి వితండవాదం ఓడిపోయింది. అదొక్కటే కాదు తెలంగాణ గడ్డమీదికి వచ్చి అభివృద్ధి జపం చేసిన కిరణ్‌కు పరకాల ప్రజలు ఐదో స్థానాన్ని బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయినా, ఇంత తక్కువ శాతం ఓట్లు రాలేదు. రెండు ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పెద్దలను కలవరపాటుకు గురిచేసి ఉండవచ్చు. అందుకే రాష్ట్ర విభజన అనివార్యమయ్యే స్థితిలో ప్రజలను గందరగోళపరిచే ప్రకటనలు వస్తున్నాయి.

ఇప్పుడు వస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదన వల్ల తెలంగాణ సమస్య పరిష్కారం కాదు. విలీనానికి ముందు ఉన్న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణను ఈ ప్రాంత ప్రజలు డిమాండ్. అందుకే ఐదున్నర దశాబ్దాల ప్రజా పోరాటాన్ని అణవేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణ ఏర్పాటు చేస్తే మంచిది. అలా కాకుండా మరోసారి ‘రాయల తెలంగాణ’ పేరుతో  ఈ ప్రాంత ప్రజలను మోసం చేయాలని చూస్తే కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఇందుకు వంతపాడుతున్న నేతలకు శంకరగిరి మాన్యాలు తథ్యం!
-రాజు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home