Thursday 4 October 2012

ప్రజలు, ప్రసారమాధ్యమాలు, ప్రజాప్రతినిధులు



ఈ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది అని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల కన్వీనర్ మంత్రి శైలజనాథ్ ఉవాచ. కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసిన సందర్భంలో అక్కడ ఏం జరుగుతున్నదోనని అంతా గగ్గోలు పెట్టారు. దీంతో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి శైలజనాథ్ ఢిల్లీ వెళ్లి సీమాంధ్ర ఎంపీలను కలిశారు. మీడియాలో వచ్చినంత హడావుడి ఇక్కడ ఏమీ లేదని తిరిగి ప్రయాణం అయ్యారు. అయినా సమైక్యాంధ్ర అంటున్న ప్రజాప్రతినిధుల్లోనే సంక్లిష్టత కనిపిస్తున్నది. రాయలసీమ పరిరక్షణ పేరుతో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు, ఒకవేళ రాష్ట్రం విడిపోతే రాయలసీమ పరిస్థితి ఏమిటి అని యాత్ర చేపట్టారు. తెలంగాణ కంటే ముందు ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాల్సిందేనని అందుకోసం ప్రజలను మేల్కొల్పేందుకు ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఇంతలో టీజీ వెంకటేశ్ ఉలిక్కిపాటుకు గురైనట్టు కనిపిస్తున్నది. మొన్నటికి మొన్న సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఒక సమావేశం పెట్టుకుని మరీ డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు టీజీ నేతృత్వంలో రాయలసీమ ప్రజాప్రతినిధులు హస్తినలో అధిష్ఠానం పెద్దలను కలిసి రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతమే అధికంగా నష్టపోయిందని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందో లేదో కానీ రాయలసీమ నేతల్లోనే ఐక్యత లేదన్న ఇప్పుడు సుస్పష్టం. నలుగురిలో నారాయణలాగా వీళ్లు అప్పుడప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాయలసీమ కూడా ఇవ్వాలంటున్నారు. మరి అదే రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారు అంటున్నారు.

తెలంగాణ ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఎవరికి వారు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. విభేదాలు ఎన్ని ఉన్నా అందరి అభిప్రాయం మాత్రం తెలంగాణ రాష్ట్రమే. కానీ సీమాంధ్రలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అంటున్న వారే ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. కిరణ్‌కుమార్ మహబూబ్‌నగర్‌లో ఒక మాట, కృష్ణా జిల్లాలో ఒక మాట, జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట ఇలా ప్రాంతానికో పాట పాడుతున్నాడు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించలేము అంటూనే ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనపై కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టారు. రాష్ట్ర విభజన అనివార్యం అనేది సీమాంధ్ర నేతల ఆందోళన చూస్తుంటే అర్థమవుతున్నది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో వేదికలు ఏవైనా అందరి గమ్యం ఒక్కటే. కానీ సీమాంధ్రలో అప్పుడే కోస్తాంధ్ర, రాయలసీమ అనే రెండు విభజనలు వచ్చాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్టానికి ముఖ్యమంత్రి అయినా రేపు విభజన తర్వాత ఆయన రాజకీయం చేయాల్సింది సీమాంధ్రలోనే. అందుకే కాబోలు తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రాంతంలోని సామాన్య ప్రజానీకం పసిగట్టింది. కానీ మింగలేక కక్కలేక ముఖ్యమంత్రి మాటలను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సీమాంధ్ర మీడియా కూడా జేఏసీ, టీఆర్‌ఎస్ పార్టీ మధ్య విభేదాలను భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పెద్దల మాటలను ఉటంకిస్తూ అవి తెలంగాణకు అనుకూలంగా లేవనే చర్చలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు సీమాంధ్ర నేతలు ప్రాంతాల వారీగా చేస్తున్న ప్రయత్నాలను మాత్రం విశ్లేషించడం లేదు. తెలంగాణపై సానుకూలత లేదంటూనే ఈ అంశం లేని చర్చ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే మార్చ్ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలను పట్టుకుని పెద్దవిగా చూపే ప్రయత్నం చేసింది. తీరా దాన్ని జేఏసీ నాయకత్వం దాన్ని ఖండించడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్లీ కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే చర్చల సారాంశం ఏమిటి? అవి అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి? ప్రశ్నిస్తున్నాయి. సీమాంధ్ర మీడియా ఇక్కడ ఇంకో విషయాన్ని మరిచిపోతున్నది. పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ విశాఖ కేంద్రంగా తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటి అన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దాని అమలు చేయాల్సిన బాధ్యత తనపై ఉన్నదని చెప్పారు. బొత్స కూడా ఢిల్లీకి వెళ్లివచ్చిన తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కానీ లగడపాటి వంటి  వాళ్లు తెలంగాణపై చేస్తున్న వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇస్తున్న సీమాంధ్ర మీడియా పార్టీ బాధ్యునిగా బొత్స చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న నలుగురైదుగురు పెట్టుబడిదారుల మాటలే వారికి ప్రాధాన్యం అయిపోయాయి. అసంబద్ధమైన విషయాలపై చర్చలు పెడుతూ ప్రజలను ఎందుకు పరేషాన్ చేస్తున్నారో ఆలోచించాలి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ అలసత్వం కనబడుతున్నది. విద్యుత్ కోతలపై సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నది. పంటలు ఎండిపోతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయినా ఇవేవీ మీడియాకు పెద్ద సమస్యలుగా కనిపించడం లేదు. కిరణ్ సర్కారు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు.  అందుకే రాష్ట్ర విభజనపై నిర్ణయం ఎప్పుడు వస్తుందో తెలియదని అందరూ అంటున్నారు. కానీ నీరో చక్రవర్తిలా నిద్రపోతున్న సర్కారును మాత్రం నిద్రలేపాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నది.
-రాజు

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home