Monday 1 October 2012

సాగరహారం చెప్పిన సత్యం



తెలంగాణ పేరుతో తెలుగుజాతిని నాశనం చేశారన్న లగడపాటి అయినా తెలుగు ప్రజల సంక్షేమమే తమ పార్టీ లక్ష్యం బాబు అయినా వారి ఆవేదన అంతా మాటల్లోనే! నిజానికి ఇవ్వాళ ఈ రాష్ట్రంలో ఈ అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నదంటే కాంగ్రెస్ పార్టీ కారణమో టీడీపీ కూడా అంతే కారణం. ఈ రెండు ఇప్పటికీ తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పే ఏకాభిప్రాయం అనే మాట పరోక్షంగా టీడీపీలో కూడా లేదు. ఇవ్వాళ రాష్ట్ర విభజన జరగాలంటే ఈ రెండు పార్టీ తెలంగాణపై డొంక తిరుగుడు విధానాలు విడనాడాలి. బాబు మళ్లీ లేఖ రాస్తాడు అని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చిన టీ టీడీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? బాబు లేఖ కొత్తసీసాలో పాత సారాయి అన్న చందంగా ఉన్నది. అన్ని అంశాల్లో స్పష్టత ఇచ్చిన బాబు తెలంగాణ విషయంలో మాత్రం తన అంతరాత్మ ప్రకారమే నడుచకున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అంటారు. అక్కడే తమ అభిప్రాయం చెబుతాము అంటే.. అందులో అర్థమేమైనా ఉన్నదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో ఏకాభిప్రాయం వచ్చేదాకా అఖిలపక్ష సమావేశం ఉండదు అంటే.. అప్పుడు పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఏకాభిప్రాయం ప్రజల్లో కాదు.. పార్టీల్లోనే... అందులో టీడీపీ కూడా ఉన్నది. అందుకే బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో తెలంగాణపై మేం ప్రణబ్ కమిటీకీ లేఖ రాసినదానికి కట్టుబడి ఉన్నామని, దాని ఆధారంగానే కేంద్రం చర్యలు చేపట్టాలని కోరేవారు. కానీ అలా చేయలేదు. విషయాన్ని పక్కదోవ పట్టించేలా వితండవాదాలు చేశారు బాబు. చరిత్ర అంతా అందులో పొందుపరిచారు తప్ప వర్తమానాన్ని వదిలేశారు. అందుకే బాబును తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు. విశ్వసించరు కూడా.
 ఇక లగడపాటి ఎంతసేపు తనకు తెలిసిందే చెబుతాడు తప్ప ఇతరు చెప్పేదాంట్లో వాస్తవాన్ని గ్రహించడు. అసెంబ్లీలో తీర్మానం పెడితే తెలంగాణ అంశం తేలిపోతుంది అంటాడు. మరి ఆ పని చేయమని మొన్న వర్షాకాల సమావేశాల్లో టీఆర్‌ఎస్ నిలదీస్తే కిరణ్ చెప్పిన సమాధానం ఏమిటో లగడపాటి గుర్తించుకోవాలి. కేంద్రం చెబుతున్న పార్టీల వైఖరి కూడా బట్టబయలు అవుతుంది. అలాగే లగడపాటి రాజగోపాల్ మరోమాటను మార్చిమార్చి చెబుతాడు. చిన్నరాష్ట్రాల విషయంలో రెండో ఎస్సార్సీయే కాంగ్రెస్ పార్టీ విధానం అంటాడు. ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన అధిష్ఠాన పెద్దలు తెలంగాణకు రెండో ఎస్సార్సీ వర్తించదు అని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయినా లగడపాటి తన పిడివాదాన్నే పట్టుకుని వేలాడుతాడు. ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు ప్రధాన ప్రతిపక్షం మొదలు వామపక్షాలు కూడా రెండో ఎస్సార్సీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న విషయాన్ని లగడపాటి గుర్తించుకోవాలి. అసలు లగడపాటి ఏ హోదాలో కాంగ్రెస్ విధానం ఇది ప్రకటిస్తాడో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారు అంటాడు. తది తప్పని చాలాసార్లు రుజువైంది కూడా. అయితే దానికి భావోద్వేగం, కమిట్‌మెంట్ ఓట్లు అని కొత్తసూత్రాలు ఆయనే చెబుతాడు. ఈ మధ్యనే ఎన్డీటీవీ సర్వేలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదో కళ్లకట్టినట్టు చెప్పింది. అయినా వచ్చే సార్వత్రిక  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై పార్లమెంటు స్థానాలు ఖాయమని ఈ ఆంధ్రా ఆక్టోపస్ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. అందుకే లగడపాటి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఓ జోకర్‌లా మారాడు. ప్రజల్లో సమైక్య భావన లేదని ఎవరూ అనడం లేదు. అయితే లగడపాటి చెబుతున్న మాత్రం లేదు. ప్రజల్లో ఇప్పటికే మానసిక విభజన వచ్చింది. స్వయంగా పీసీసీ అధ్యక్షుడే తెలుగు వారు రెండు రాష్ట్రాల్లో ఉంటే తప్పేమిటిని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా సున్నితమైన అంశమైన తెలంగాణపై ఆచితూచి స్పందిస్తే, కానీ లగడపాటి మాత్రం పార్టీలో ఏ హోదా లేకున్నా కేవలం పార్లమెంటు సభ్యునిగా అపరిమిత అధికారాలు ఉన్న నేతగా ఆయనకు ఆయనే భ్రమపడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడుతాడు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతాడు. అందుకే ఆయన వల్ల తెలంగాణలో ఆపార్టీ సంగతి ఏమో కానీ సీమాంధ్రలో కూడా తీవ్ర నష్టం జరుగుతున్నది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

‘సాగరహారం’ ప్రజాప్రతినిధులకు, పార్టీలకు ఒక గొప్ప సందేశాన్ని పంపింది. జేఏసీ ఇచ్చిన పిలుపుతో పార్టీలకు అతీతంగా ప్రజలు ఉవ్వెత్తున కదిలివచ్చారు. పార్టీలకు ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు. కానీ తెలంగాణపై స్పష్టత లేకుండా పైపై మాటలకే పరిమితం అవుతామంటే కుదరదని మార్చ్ నిరూపించింది. నిర్బంధాలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ప్రజలు తమ ఆకాంక్షను చాటారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా జేఏసీ తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించింది. ప్రజల సహనం ముందు ప్రభుత్వ కుయుక్తులు పనిచేయలేదు. అందుకే సహనంగా ఉండాలిని చెప్పే కాంగ్రెస్ పెద్దలు ప్రజల సహనం బద్దలవకముందే తమ సాచివేత విధానాన్ని వీడాలి. ఏకాభిప్రాయం అనే మాటతో ఇంకా ఎంతో కాలం ప్రజలను మోసం చేయలేరు. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసం కలిగేలా తెలంగాణపై తేల్చాలి. తెలంగాణ ప్రజల అయిదున్నర దశాబ్దాల ఆకాంక్ష సాకారానికి ఆచరణలో కార్యాచరణను రూపొందించాలి. అప్పుడే ఇరు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది.
-రాజు

Labels: ,

1 Comments:

At 1 October 2012 at 20:32 , Blogger krshnrao said...

Telangana people should boycott these people and products of them...then only they will understand...but there are persons who will "love "these ones for their petty wishes.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home