కొనుగోలు డిమాండుతో కేంద్రంతో కొట్లాట


ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న కేసీఆర్‌ మాట్లాడారు.


‘‘మా ప్రశ్న ఒక్కటే.. తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?’’ అని సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదన్నారు. పండించిన పంట కొంటారా.. కొనరా? అనే అడుగుతున్నారన్నారు. కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నదని అన్నారు రైతుల గోస తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉందని ఆయన అన్నారు. 


ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. కేసీఆర్ చాలా కాలంగా కేంద్రం బీజేపీ, కాంగ్రెస్ ఏతర కూటమి ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ  కూటముల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ రాదనే అంచనాల్లో టీఆర్ ఎస్ అధినేత ఉన్నారు. కాబట్టి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకం అనేది కేసీఆర్ వాదన. బెంగాల్ గెలిచిన తర్వాత తృణమూల్ అధినేత కూడా ఇతర రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆప్ కూడా అదే బాటలో ఉన్నది. పంజాబ్, గోవా లలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఆప్ మద్దతు అవసరం అన్నది ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా తెలుస్తున్నది.  శివసేన కూడా మొన్న లోక్ సభ ఉప ఎన్నికల్లో మహారాష్ట్ర అవతల దాద్రా నగర్ హవేలి లో జెండా ఎగురవేసింది. మొన్న జరిగిన వివిధ రాష్ట్రాల్లో జరిగిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. అందుకే మహాధర్నా వేదిక ద్వారా వరి కొనుగోలు అంశంతో పాటు దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను కేసీఆర్ ప్రస్తావించారు.


‘‘ఏడాదిగా దేశ వ్యాప్తంగా రైతులు నిరసన చేస్తున్నారు. సాగు చట్టాలు వద్దని డిమాండ్‌ చేస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వరా? నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తున్నది అన్నారు. దేశంలో 40 కోట్ల ఎకరాల భూములున్నాయి. అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు. బంగారం పండే భూములను నిర్లక్ష్యం చేస్తున్నారు. భారత్‌ ఆకలి రాజ్యమని హంగర్ ఇండెక్స్ లో వెల్లడైందని, ఆకలి సూచీలో పాకిస్థాన్‌ కంటే దిగువన భారత్‌ ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఉత్తర భారత రైతులు డిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. దేశాన్ని పాలించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మేం తెచ్చిన సాగు విధానాలతో రైతులోకం ఓ దరికి వచ్చింది. దిక్కుమాలిన కేంద్రం బుర్రలు పని చేయడం లేదు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పింది. కేంద్రం తీరుతోనే ఇష్టం లేకున్నా ధాన్యం సాగు వద్దని చెప్పాం. వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయమని కోరాం.

ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందించి పోరాడాలనే ఆలోచన ఉండి ఉండొచ్చు. అట్లనే ధాన్యం కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, రాష్ట్ర బీజేపీ నాయకత్వ రాజకీయ విధానాల్లో వ్యత్యాసం కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ప్రజల్లో చర్చకు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది. రానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు వస్తే అసలు విషయం వెల్లడి అవుతుంది. అప్పుడుఎవరు ఏమిటి అన్నది ప్రజలకు బోధపడుతుంది. అప్పటిదాకా ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉంటారు.

Comments

Popular posts from this blog

ఏపీలో కూటమిలోకి బీజేపీ చేరిక లాభమెవరికి? నష్టమెవరికి?

కేబినెట్‌ కూర్పులో ఆ మూడు రాష్ట్రాలకు పెద్దపీట... ఎందుకంటే?

ఆరు నెలల్లో అస్తవ్యస్త నిర్ణయాలు