Saturday, 29 November 2025

బిహార్‌లో పొత్తుపై రచ్చ



  • కూటమి నుంచి కాంగ్రెస్‌ వెళ్లిపోవచ్చు
  • ఎలాంటి అభ్యంతరం లేదన్నఆర్జేడీ


పట్నా: బిహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో పొత్తును తెంచుకోవాలని కాంగ్రెస్ నాయకులు తమ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు మంగ్ని లాల్ మండల్ సంచలన ప్రకటన చేశారు. కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ వైదొలగడానికి సంపూర్ణ స్వేచ్ఛ ఉందన్నారు. కాంగ్రెస్ గెలిచిన సీట్లు కూడా ఆర్జేడీ మద్దతు వల్లే వచ్చాయని అన్నారు.


సవాళ్లకు కారణాలు

శనివారం  మీడియాతో మాట్లాడిన మండల్.. ఒంటరిగా వెళ్లాలని పార్టీ నిర్ణయించుకుంటే, ఎవరు అడ్డుకుంటారు? మంచి విషయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన బలాన్ని అంచనా వేసుకుని కొత్త మార్గాన్ని ఎంచుకుంటే, ఆర్జేడీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 61 సీట్లలో పోటీ చేసి కేవలం ఆరు మాత్రమే గెలిచింది. దీంతో ఢిల్లీలో పార్టీ నాయకులు ఇటీవల ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి భాగస్వాములతో సమన్వయం లేకపోవడం వల్లే పేలవ ప్రదర్శన జరిగిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. దీంతో ఆర్జేడీతో పొత్తు నుంచి వైదొలగాలని సూచించినట్లు తెలుస్తోంది.


ఆర్జేడీ ఎదురుదాడి

పేలవ ప్రదర్శనకు తేజస్వి ప్రసాద్ యాదవ్‌ను లేదా ఆర్జేడీని నిందించడం అన్యాయమని మండల్ అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా తక్కువగా కనిపించారని,  మా కార్యకర్తలే ముందుండి నడిపించారని ఆయన తెలిపారు. ఎక్కువ సీట్ల కోసం మొండిగా పట్టుబట్టడం, ఆర్జేడీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం వంటి చర్యల ద్వారా కాంగ్రెస్ తమకు నష్టం చేసిందని మండల్ ఆరోపించారు. తమ కేడర్‌కు అసలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా, అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్లినట్లు తెలిపారు.


అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ కూటమిని రద్దు చేయడానికి మా పార్టీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ రాజేష్ రాథోర్ చెప్పారు. ప్రస్తుతానికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Featured post

అస్సాం అసెంబ్లీ పోరు: కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష

ప్రియాంక గాంధీ ముందున్న సవాళ్లు ఇవే డిస్పూర్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కిం...