Raju Asari

Tuesday, 4 November 2025

జర్నలిజంలో మార్పులు మంచికేనా?

 

జర్నలిజంలో నాకు ఓనమాలు నేర్పిన గురువులు చెప్పింది ఒక్కటే... సమకాలీన, వర్తమాన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. భాషపై పూర్తిస్థాయి పట్టులేకున్నా.. నిత్యం కొత్త పదాలు నేర్చుకోవాలి. ఫలితంగా పద సంపద పెరుగుతుంది. తద్వారా ఏదైనా విషయంపై రాయడం ఈజీ అవుతుంది. వేగంగా పనిచేయడం జర్నలిజంలో అతి ముఖ్యం. త్వరగా చేస్తే మిగిలిన సమయంలో తప్పొప్పులను సరిచేసుకోవచ్చు అన్నది వారి సూచన. నేను అనుకోకుండా ఈ వృత్తిలోకి వచ్చినా పెద్దలు చెప్పిన ఈ సూచనలను పాటించే ప్రయత్నం చేసిన. అందుకే కొంత గుర్తింపు తెచ్చుకున్న. ఇప్పుడు డిజిటిల్‌ మీడియా వచ్చిన తర్వాత జర్నలిజానికి అర్థం మారిపోయింది. అంతా వాట్సప్‌ జర్నలిజం అయిపోయింది. బ్రేకింగ్‌ న్యూసే పెద్ద విషయం అయిపోయింది. అందుకే మానవీయ అంశాలు, రాజకీయ అంశాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు పత్రికల్లో ప్రాధాన్యం తగ్గిపోయింది. 


నలుగురితో నారాయణ అనే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికీ ఎక్కువమంది చెబుతున్న మాట ఏమిటంటే రాయగలిగేవాళ్లు దొరకడం లేదు. అలాంటి వారిని ప్రోత్సహించాలనుకుంటున్న కొన్నిపత్రికలు వాళ్ల ప్రతిభకు తగ్గ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. స్థూలంగా చెప్పాలంటే ఇప్పుడు జర్నలిజంలో ప్రత్యేకత అనేది లేదు. అందరూ అన్నీ రాయాలి. పేజీలు నిండితే చాలు అన్న స్థితికి వచ్చింది. అందుకే కొన్నిరోజులుగా ఈ వృత్తిలోకి వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. రానున్న రోజుల్లో ఇది మరింత పతనావస్థకు చేరుతుందని చాలామంది మిత్రులు వాపోతున్నారు. అయితే ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు. కానీ మార్పు సహజం. అలాగే కొత్తది కొన్నాళ్లకుపోయి మళ్లీ పాత పద్ధతులు రావడం మామూలే. కాలచక్రంలో అనేక రంగాల్లో ఇది కనిపిస్తున్నది. అలాంటి పరిణామాలు ఈ వృత్తిలోకి వస్తాయని ఆశిద్దాం. 

No comments:

Post a Comment

Featured post

హైదరాబాద్‌ బాలాపూర్ పరిధిలో స్క్రాప్ షాప్‌లో అగ్నిప్రమాదం

   ఎలాంటి ప్రాణనష్టం లేదన్న పోలీసులు హైదరాబాద్ నగరంలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహీన్ నగర్ సమీపంలో ఉన్న ఒక స్క్రాప్ షాప్‌లో (తుక్కు...