Thursday 29 July 2021

కార్యాచరణ కావాలె


 కోవిడ్ కారణంగా ప్రపంచం కుదేలైపోయింది. ఉపాధి కోసం పట్నం వెళ్లినవాళ్లు తిరిగి పల్లెల బాట పడుతున్నారు. ఏడాదిన్నరకాలంగా కూలీ చేసుకునేవాళ్ల, ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ల, చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఉన్నత చదువులు చదివి ఉపాధి కోల్పోయి కూలీలుగా మారుతున్న వారి గురించి జీవనగాథలు నిత్యం వార్తల్లో చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు ప్రకటించిన 25 కిలోల బియ్యం, రెండు వేల రూపాయల నగదు కొంత ఉపశమనం కలిగించినా ఇది తాత్కాలికమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. అట్లనే కేంద్రం ప్రభుత్వం అయితే ఈ ఏడేండ్ల కాలంలో ఉపాధి కల్పన అన్నది మరిచిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తూ చేతులు దులుపుకుంటున్నది. నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగిపోయింది అని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 


నీళ్లు, నిధులు,నియామకాలు అన్నది ఉద్యమ ట్యాగ్‌లైన్. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరున్నరేండ్ల కాలంలో నియామకాలపైనే నిత్యం చర్చ జరుగుతున్నది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నియామకాల కోసం నినదించాల్సి రావడం దురదృష్టం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఖాళీల భర్తీ చేపట్టి నిర్ణీత కాలంలో నియామకాలు పూర్తి చేసి ఉన్నైట్లెతే చాలా కుటుంబాలకు భరోసా దొరికేది. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు నిరాశనిస్పృహలకు లోనై ఆత్మహత్యల లాంటి అగయిత్యాలకు పాల్పడే పరిస్థితి ఉండేది కాదు. నియామకాలపై ప్రతిపక్షాలు, ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పౌరసంఘాలు ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఎదురుదాడే తప్ప ఫలితం లేదు. నోటిఫికేషన్లు రాక, ఉన్న ఉపాధి పోయి వ్యవసాయ కూలీలుగా, ఉపాధి కూలీలుగా నిరుద్యోగులు మారుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు యాభై వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు అని ప్రచారం చేశారు. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఖాళీల భర్తీ ఉన్న అడ్డంకులు ఏమిటి అన్నది స్పష్టంగా చెప్పడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వెలువరించడానికి ఆటంకంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవచ్చు. కానీ నియామకాలపై ప్రభుత్వం చెప్పేవి అన్నీ ఆపదమొక్కుల లెక్కనే ఉన్నవి. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కనబడకుండా త్వరలో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. 


అట్లనే వయోపరిమితి దాటిపోవడం వల్ల వచ్చిన ఒకటి రెండు నోటిఫికేషన్లకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. వయోపరిమితి సడలింపునకు సంబంధించిన జీవో కూడా 2019 జూలైలోనే ముగిసిపోయింది. ఆ జీవో పొడిగించలేదు. దీంతో వచ్చిన అరకొర అవకాశాలూ పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ, కార్పొరేషన్లను దీన్ని అమలు చేస్తున్నారు. మరి నియామకాల వయోపరిమితి విషయంలో అన్నింటిలో ఒకే విధానం లేదు. అందుకే అన్నీ అర్హతలు ఉన్నా వయోపరిమితి సడలింపు లేకపోవడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్యాన్ని వీడాలి. నియామకాలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించాలి. వయోపరిమితి సడలింపు జీవోను పొడిగించి అన్ని ప్రభుత్వ, కార్పొరేషన్ల ఖాళీల భర్తీలో అమలయ్యేలా చూడాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కొత్త జోనల్ వ్యవస్థ అమలుకు ఉన్న ఆటంకాలు కూడా తొలిగిపోయాయి. కేంద్ర హోం శాఖ కొత్త జోన్లకు ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా తెచ్చిన కొత్త జోనల్ ప్రకారమే నియమకాలు జరుగుతాయని ప్రకటిస్తున్నది. యాభై వేల కొలువులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. రెండురోజుల క్యాబినెట్‌లోనూ కొలువుల అంశం కొలిక్కి రాలేదు. మరో ఐదు రోజుల తర్వాత మరోసారి క్యాబినెట్ భేటీ ఉంటుందని, కొలువుల భర్తీకి ఆమోదం తెలుపుతుందని వార్తలు వచ్చాయి. ఇది జరిగి పదిహేను రోజులు అవుతున్నది. ఇప్పుడు కొలువుల అంశంపై కార్యాచరణ లేదు.  హుజూరాబాద్ ఉప ఎన్నిక హడావుడిలో అనేక అంశాలు అప్రదానం అయ్యాయి. కొలువుల కోసం ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలపై పట్టింపులు లేదు. . ఏటా ఇయర్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడుతామన్న ప్రభుత్వ ప్రకటన ఆహ్వానించదగినదే. కానీ అది ఆచరణలో అమలైనప్పుడే దానికి విలువ ఉంటుంది.  నిరుద్యోగులు ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ కొలువుల భర్తీపై కారణాలు చెప్పకుండా కార్యాచరణ కావాలె అని నిరుద్యోగులు కోరుకుంటున్నారు.

-ఎ. రాజు

2 comments:

  1. Vayo parimithi sadalimpu Kavali good analysis.

    ReplyDelete
  2. Graet Analysis & Facts about Unemployment in India...

    ReplyDelete