Tuesday 6 March 2012

'పంచ'తంత్రం ఫలితాలు.. ప్రభావం..


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సగటు కాంగ్రెస్ అభిమానిని దిగ్భ్రాంతికి గురి చేసి ఉంటాయి. కష్ట కాలంలో ఉన్న  కాంగ్రెస్ పార్టీకి యుపిలో పూర్వ వైభవం తెచ్చిపెడతాడనుకున్న రాహుల్ మంత్రం పనిచేయలె. ఈ ఎన్నికల ఫలితాలకు రాహుల్ ఒక్కడినే భాద్యుడిని చేయడం సరికాదని.. గాంధీ-నెహ్రూ కుటుంబాల విధేయులు చెబుతుండవచ్చు. కానీ మొన్న.. నిన్న .. నేడు.. రేపు కూడా  భావి ప్రధానిగా భావించ బడుతూ.. అయన భజన పరులచే ప్రశంసలూ అందుకున్నారు. అందుకుంటున్నారు. మరి ఆయనను బాధ్యుడిని చేయవద్దంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలె.  రాహుల్ ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హుడే అన్న నేతలు .. ఈ ఎన్నికల ఫలితాల వైఫల్యాలను మాత్రం అయన ఒక్కడికే అంటగట్టవద్దంటున్నారు. నిజమే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే. కానీ గెలిచినప్పుడు సమష్టి కృషి అంటారు. ఓడినప్పుడు దానికి పార్టీ నో ఒకవేళ అక్కడ ఉండే మరో పెద్ద నేతనో ఆ వైఫల్యాల భాద్యతను మోస్తారు. అయితే యుపికి సంబంధించి రాహులే భాద్యత వహించాలే. అక్కడ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అంటే రాహుల్ అనే విధంగా కొనసాగింది. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉండి రాహుల్ నానమ్మ ఇందిరా, తండ్రి రాజీవ్ లతో కలిసి పనిచేసిన నేతలు కూడా రాహుల్ జపమే చేశారు. ఎందుకంటే గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఇరవై స్థానాలు రావడానికి చాలా కృషి చేశారు. దేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్న యుపిలో పాగా వేస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చు అని రాహుల్ భావించారు. అందుకే భావి ప్రధానిగా భావించిన ఆయన యుపి రాజకీయాల పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ఈ ఎన్నికల ఫలితాలు యూపీఏ పాలనకు బీటలు వారుతున్నాయి అని చెప్పకనే చెబుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వస్తున్నది. మత తత్వ పార్టీలతోనే ఈ దేశానికి ముప్పు ఉందని బిజెపి పై నిత్యం విమర్శలు చేసే ఆ పార్టీ  యుపి లో మైనారిటీ ఓట్ల కోసం ఎలా వ్యవహరించిందో చూశాం. అధికారం కోసం రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తాయి. అందులో కాంగ్రెస్, బిజెపి ఎవరిదైన ఒకటే విధానం.. పవర్ కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం. ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు కలిసి రాకపోవడానికి... రాహుల్, ప్రియాంక ల చరిష్మా పనిచేయక పోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవ్వాళ దేశవ్యాప్తంగా అవినితీ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో .. అవినీతి పై మాట్లాడిన వారితో కాంగెస్ మంత్రులు .. ఆ పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరు యావత్ ప్రజానీకం చూసింది. అవినీతిని నిర్మూలించడం లో జాతీయ పార్టీలు అవలంభిస్తున్న విధానాలను ప్రజలు నిరసించినట్టు కనబడుతున్నది. ఇక యుపి ని మాయావతి నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని చేసినా తీర్మానాన్ని ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించారనే వాదనలు మన రాష్ట్రంలోని మీడియాలో చర్చలు పెడుతున్నారు. యూపీ విభజనకు ఏ పీ విభజనకు సంబంధం లేదు. దీనిపై చర్చ అనవసరం కూడా. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్న బీఎస్పి అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు పరచాలని నిర్ణయించింది. అంబేద్కర్ చెప్పిన చిన్న రాష్ట్రాలతో ఉండే పాలన సౌలభ్యాన్ని అమలు చేయాలని సంకల్పించింది. యూపీ ఎన్నికల్లో రాష్ట్ర విభజన అనేది ఒక అంశం మాత్రమే. దాన్నే ప్రధాన ఎజెండాగా ఏ పార్టీ కూడా ప్రచారం చేయలేదు.. యూ పీ విభజనకు పట్టుబట్టిన బీఎస్పి కూడా దాన్ని ఎత్తుకోలేదు. కానీ ఇవ్వాళ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అలాంటి పరిస్థితులు లేదు. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రధాన ప్రతిపక్షం తో పాటు (ఒక్క సిపిఎం ) మినహా  ఏ పార్టీ కూడా తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడలేవు. అందుకే యూపీ రాజకీయాలను ఏపీ కి అంటగట్టడం తెలంగాణ వ్యతిరేకుల పని మాత్రమే! ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే లోక్ సభకు సెమీ ఫైనల్ గా ఎలా భావిస్తున్నారో.. యిప్పుడు రాష్ట్రంలో జరగబోయే ఉప ఎన్నికలు కూడా వచ్చే జనరల్ ఎన్నికలకు సెమీ ఫైనల్ గానే భావించాలి. అంతే కాదు ఈ ఎన్నికలు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల అస్తిత్వానికి సంబంధించిన ఎన్నికలు. పాపం చంద్రబాబు యూపీ ఎన్నికల్లో ఎస్పి సాధించిన ఫలితాలు ఏపీలో తమ పార్టీ కి ఆపాదించుకుంటున్నారు. అవినీతి విషయంలో అయినా .. ప్రజల ఆకాంక్ష  విషయంలో అయినా .. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అయినా ద్వంద్వ విధానాలు అవలంబిస్తే ... వారిది ఎప్పటికి ప్రతిపక్ష పాత్రే అవుతుంది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home